టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ పేలవ ఫామ్‌తో బాధపడుతున్నాడు. ముఖ్యంగా టెస్టుల్లో అతడి ఆటతీరు రోజురోజుకీ దిగజారుతోంది. రెండంకెల స్కోరు చేరుకోవడమే కష్టంగా ఉంది. న్యూజిలాండ్, ఆస్ట్రేలియా సిరీస్‌లో భారత్ ఓటమి పాలవడానికి ప్రధాన కారణాల్లో కోహ్లీ బ్యాటింగ్ ఫెయిల్యూర్ ఒకటి. అందుకే అతడ్ని అన్ని వైపుల నుంచి విమర్శలు చుట్టుముట్టాయి. దీంతో ఫామ్‌ను మెరుగుపర్చుకునేందుకు రంజీల బాట పట్టాడు విరాట్. కానీ రైల్వేస్‌తో జరిగిన మ్యాచ్‌లో 6 పరుగులే చేసి పెవిలియన్ చేరాడు. కోహ్లీని ఔట్ చేసి ఓవర్‌నైట్ పాపులర్ అయిపోయాడు పేసర్ హిమాన్షు సాంగ్వాన్. అయితే ఆ డిస్మిసల్ విషయంలో ఓ బస్ డ్రైవర్‌కు కూడా క్రెడిట్ ఇవ్వాలని అతడు అంటున్నాడు. సాంగ్వాన్ ఎందుకిలా అన్నాడో ఇప్పుడు చూద్దాం..సీక్రెట్ చెప్పేశాడు!
రంజీ మ్యాచ్‌లో విరాట్ కోహ్లీని ఔట్ చేసి ఓవర్‌నైట్ పాపులర్ అయిపోయాడు హిమాన్షు సాంగ్వాన్. మంచి స్పీడ్‌తో అతడు వేసిన ఇన్‌స్వింగర్‌ను షాట్ కొట్టబోయి ఔట్ అయ్యాడు విరాట్. అతడి బ్యాట్‌ను ఛేదించుకొని దూసుకొచ్చిన బంతి వికెట్లను గిరాటేసింది. బాల్ తగిలిన వేగానికి స్టంప్ గాల్లో లేచి దాదాపు కీపర్‌కు దగ్గరల్లో వెళ్లి పడ్డాయి. తమ ఫేవరెట్ ఆటగాడ్ని ఔట్ చేశావని కొందరు సాంగ్వాన్‌ను విమర్శిస్తే.. అంతటి దిగ్గజ బ్యాటర్‌ను పెవిలియన్‌కు పంపావ్ నువ్వు గ్రేట్ అంటూ మరికొందరు సాంగ్వాన్‌ను మెచ్చుకున్నారు. తాజాగా ఈ డిస్మిసల్‌కు సంబంధించిన అసలు సీక్రెట్‌ను అతడు బయటపెట్టాడు. ఫోర్త్ స్టంప్‌లో బౌలింగ్ వేయమని ఓ బస్ డ్రైవర్ ఇచ్చిన సలహాతోనే కోహ్లీని ఔట్ చేయగలిగానన్నాడు. ఒక్క సలహాతో..!
‘ఢిల్లీ తరఫున కోహ్లీ బరిలోకి దిగుతున్నాడని మ్యాచ్‌కు ముందే తెలిసింది. మ్యాచ్ లైవ్ టెలికాస్ట్ అవుతుందని ముందు తెలియదు. కోహ్లీ వచ్చిన తర్వాతే లైవ్ స్ట్రీమింగ్ ఉందని తెలిసింది. రైల్వేస్ టీమ్‌కు నేనే లీడింగ్ పేసర్‌ను. అందుకే జట్టు ఆటగాళ్లంతా విరాట్‌ను నువ్వే ఔట్ చేయగలవంటూ నాలో ధైర్యం నింపారు. అదే సమయంలో మేం ప్రయాణిస్తున్న బస్‌ను నడిపే డ్రైవర్ ఓ సలహా ఇచ్చాడు. కోహ్లీకి ఫోర్త్ లేదా ఫిఫ్త్ స్టంప్ లైన్‌లో బౌలింగ్ చెయ్.. అతడు పక్కా ఔట్ అవుతాడని చెప్పాడు’ అని సాంగ్వాన్ రివీల్ చేశాడు. కాగా, ఈ కామెంట్స్ విన్న నెటిజన్స్.. డ్రైవర్ భయ్యా ఎంత పని చేశావ్? కోహ్లీ ఫామ్ అందుకుంటే టీమండియాకే ప్లస్ అయ్యేది కదా అని అంటున్నారు. చిన్న సలహాతో కింగ్ కొంపముంచావ్ అంటూ సీరియస్ అవుతున్నారు.