ఇంటర్‌ హాల్‌టికెట్లపై QR కోడ్‌.. ఇకపై దారితప్పడం, అడ్రస్‌ తెలియకపోయే ప్రసక్తే లేదు!

 



హైదరాబాద్‌, ఫిబ్రవరి 17 తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఇంటర్మీడియట్‌ విద్యార్ధులకు మార్చి 5వ తేదీ నుంచి వార్షిక పరీక్షలు రాయబోతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఇప్పటికే హాల్‌ టికెట్లను కూడా ఇంటర్‌ బోర్డు జారీ చేసింది. అయితే ప్రతీయేటా విద్యార్ధులు పరీక్ష కేంద్రాలకు చేరుకోవడానికి ఇబ్బంది పడుతూ పలువురు పరీక్షలకు దూరమవుతున్నారు. ఈసారి అలాంటి ఇబ్బందులకు తావులేకుండా ఇంటర్‌ బోర్డు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తుంది. అదేంటంటే.. హాల్‌టికెట్లపై పరీక్షాకేంద్రం లొకేషన్‌ క్యూ ఆర్‌కోడ్‌ రూపంలో అందుబాటులోకి తెస్తున్నారు. ఈ క్యూఆర్‌కోడ్‌ను స్కాన్‌చేయగానే మీ పరీక్షాకేంద్రం అడ్రస్‌ వెంటనే తెలిసిపోతుంది. మీరు ఉన్న కరెంట్ లొకేషన్‌ నుంచి ఎగ్జాం సెంటర్‌ ఎంత దూరమో.. ట్రాఫిక్‌ ఎలా ఉందో.. ఎన్ని నిమిషాల్లో చేరుకోగలరో వంటి వివరాలు ఇట్టే చెప్పేస్తుంది.

ఈ విధమైన ప్రత్యేకతలతో ఇంటర్‌ బోర్డు హాల్‌టికెట్లను సిద్ధం చేస్తుంది. హాల్‌ టికెట్లపై ఇలా క్యూఆర్‌కోడ్‌తో జారీచేయడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. మార్చి 5 నుంచి ప్రారంభంకానున్న ఇంటర్‌ వార్షిక పరీక్షల నేపథ్యంలో విద్యార్థులు సులభంగా పరీక్షాకేంద్రాలకు చేరుకునేందుకు ఇంటర్‌బోర్డు ఇలా ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్టు ఇంటర్‌బోర్డు డైరెక్టర్‌ కృష్ణ ఆదిత్య తెలిపారు. అలాగే గతంలో పరీక్షాకేంద్రం పూర్తి అడ్రస్‌ను హాల్‌టికెట్లపై ముద్రించేవారు కాదు. అడ్రస్‌ కాలమ్‌లో 13 పదాలు మాత్రమే ఇచ్చేవారు. కానీ ఈసారి పరీక్షా కేంద్రం హౌస్‌ నంబర్‌తో సహా, కాలనీ, ప్రాంతం వంటి పూర్తి వివరాలను హాల్‌టికెట్లపై ముద్రిస్తున్నారు.


హాల్‌టికెట్‌పై పరీక్షా కేంద్రం అడ్రస్‌ను క్యూఆర్‌కోడ్‌ రూపంలో ముద్రిస్తారురు. ఈ కోడ్‌ను స్కాన్‌ చేస్తే చాలు.. లొకేషన్‌ చూపిస్తుంది. పరీక్షాకేంద్రం చీఫ్‌ సూపరింటెండెంట్‌ (సీఎస్‌), డిపార్ట్‌మెంటల్‌ ఆఫీసర్‌ (డీవో) మొబైల్‌ నెంబర్లను సైతం ఈ హాల్‌టికెట్లపై ముద్రిస్తారు. విద్యార్ధులు తమకు అడ్రస్ విషయంలో ఏదైనా ఇబ్బంది తలెత్తితే వారికి ఫోన్‌చేసి కూడా అడ్రస్‌ కనుక్కోవచ్చు. అంతేకాకుండా హాల్‌టికెట్‌పై ఐవీఆర్‌ నెంబర్‌ను సైతం తొలిసారి ముద్రిస్తున్నారు. హాల్‌టికెట్‌ డౌన్‌లోడింగ్‌ సహా ఇతర సాంకేతిక సమస్యల పరిష్కారానికి ఇది ఉపయోగపడుతుంది. అలాగే సెంటర్‌ లొకేటర్‌ యాప్‌ కూడా మొబైల్‌లో అందుబాటులోకి తెస్తున్నారు. ఈ యాప్‌లో హాల్‌టికెట్‌ నెంబర్‌ ఎంటర్‌చేసినా.. లొకేషన్‌ చూపిస్తుంది. అలాగే హాల్‌టికెట్‌ లింకును కూడా విద్యార్థి, తల్లిదండ్రుల మొబైల్‌ ఫోన్‌లకు పంపిస్తారు. విద్యార్థి నేరుగా డౌన్‌లోడ్‌ చేసుకుని పరీక్షలకు హాజరు కావొచ్చు. ప్రిన్సిపాల్‌ సంతకం లేకపోయినా పరీక్ష కేంద్రంలోకి అనుమతి ఇస్తారు.




Previous Post Next Post

نموذج الاتصال

Follow Me