స్థానిక ఎన్నికల్లో బీసీలకు రిజర్వేషన్లు, ఎస్సీ వర్గీకరణ నివేదికలపై చర్చించేందుకు అసెంబ్లీ ప్రత్యేకంగా సమావేశం అవుతోంది. మంగళవారం శాసనసభ, మండలి ప్రత్యేక భేటీ జరగనుంది.
శాసనసభ, మండలి ప్రత్యేక సమావేశం
దానికి ముందు రాష్ట్ర మంత్రివర్గ భేటీ
వర్గీకరణపై సబ్ కమిటీకి నేడు కమిషన్ నివేదిక
బీసీ రిజర్వేషన్లపై బూసాని కమిషన్ నివేదిక కూడా
వీటిపై మంత్రివర్గ సమావేశంలో చర్చ
రాష్ట్రంలో తొలుత జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు?
‘స్థానికం’లో బీసీ రిజర్వేషన్ల పెంపుపై అసెంబ్లీలో
తీర్మానం.. చట్టసవరణకు కేంద్రానికి వినతి!
11 వరకు పార్లమెంటు సమావేశాలు
కేంద్రం స్పందించకుంటే పాత రిజర్వేషన్ల మేరకే..
పార్టీ పరంగా బీసీలకు 42ు టికెట్లు ఇచ్చే చాన్స్!
బడ్జెట్ సమావేశాల్లోపే జిల్లా, మండల పరిషత్ ఎన్నికలు?
సర్పంచ్ ఎన్నికలకు ముందే జిల్లా, మండల పరిషత్ ఎన్నికలు నిర్వహించాలన్న ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. సర్కారు కొలువుదీరి ఏడాది పూర్తయినా తమకు ఇంకా పదవులు దక్కకపోవడంపై క్షేత్రస్థాయి నేతల్లో కొంత అసహనం ఉంది. స్థానిక ఎన్నికలను త్వరితగతిన నిర్వహించాలంటూ వారు పార్టీ రాష్ట్ర నాయకత్వంపై ఒత్తిడి చేస్తున్నారు. దీంతో పార్టీ గుర్తుపై జరిగే జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలనే ముందుగా నిర్వహించాలని సీఎం రేవంత్‌రెడ్డి ఆలోచిస్తున్నట్లు తెలిసింది. ఆ తర్వాతే సర్పంచ్ ఎన్నికలు నిర్వహించాలని యోచిస్తున్నట్లు సమాచారం. అయితే స్థానిక ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ 42 శాతానికి పెంచుతామని, ఎస్సీ వర్గీకరణకు అనుకూలమని ఎన్నికల మేనిఫెస్టోలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలే స్థానిక ఎన్నికల ముందు ప్రభుత్వానికి సవాల్‌గా మారాయి. సీఎం మాత్రం ఈ రెండు అంశాల్లోనూ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. ఇందులో భాగంగానే అసెంబ్లీ ప్రత్యేకంగా సమావేశం అవుతోంది.
స్థానిక ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పనకు కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని, అయితే అందుకు పార్లమెంటులో చట్ట సవరణ చేయాల్సిన అవసరం ఉందన్న విషయాన్ని అసెంబ్లీ ద్వారా ప్రజల దృష్టికి తీసుకెళ్లనున్నారు. ఈ చర్చలో బీఆర్‌ఎస్, బీజేపీ సభ్యులనూ భాగస్వాములను చేసి.. పార్లమెంటు బడ్జెట్ సమావేశాల్లోనే చట్టాన్ని సవరించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతూ తీర్మానాన్ని ఆమోదించనున్నారు. పార్లమెంటు సమావేశాలు ఈ నెల 11 వరకు జరగనున్న నేపథ్యంలో అసెంబ్లీ తీర్మానాన్ని బుధవారం కేంద్రానికి పంపనున్నారు. అయితే స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై దాఖలైన పిటిషన్ల మీద విచారణ జరిపిన సుప్రీంకోర్టు.. ఎప్పటిలోగా ఎన్నికలు నిర్వహిస్తారని రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. దీనికి రేవంత్ సర్కారు సమాధానం ఇవ్వాల్సి ఉంది. మరోవైపు స్థానిక ఎన్నికలు జరగకపోవడంతో కేంద్రం నుంచి రావాల్సిన నిధులు పెండింగ్‌లో పడిపోతున్నాయి. ఈ క్రమంలో పార్లమెంటు బడ్జెట్ తొలి సెషన్ ముగిసే వరకూ ప్రభుత్వం వేచి చూడనుంది. ఆలోగా స్థానిక ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లు పెంపుపై కేంద్రం స్పందించకపోతే పాత రిజర్వేషన్ల ప్రకారమే జిల్లా, మండల పరిషత్ ఎన్నికలకు వెళ్లనున్నట్లు తెలుస్తోంది. అయితే కాంగ్రెస్ పార్టీ పక్షాన బీసీలకు 42 శాతం టికెట్లను కేటాయించే అవకాశం ఉన్నట్లు సమాచారం.
స్థానిక ఎన్నికల్లో బీసీలకు రిజర్వేషన్లు, ఎస్సీ వర్గీకరణ నివేదికలపై చర్చించేందుకు అసెంబ్లీ ప్రత్యేకంగా సమావేశం అవుతోంది. మంగళవారం శాసనసభ, మండలి ప్రత్యేక భేటీ జరగనుంది. దానికి ముందు ఉదయం 10 గంటలకు సీఎం రేవంత్‌రెడ్డి అధ్యక్షతన మంత్రివర్గం సమావేశమై అజెండాను ఖరారు చేయనుంది. సమగ్ర ఇంటింటి సర్వే పేరిట కులాల వారీగా ఆర్థిక, సామాజిక, రాజకీయ స్థితిగతులపై సర్వే నిర్వహించిన ప్రణాళికా విభాగం.. సంబంధిత నివేదికను ఆదివారం ఉత్తమ్‌కుమార్‌రెడ్డి సారథ్యంలోని మంత్రివర్గ ఉపసంఘానికి సమర్పించింది. అలాగే ఎస్సీ ఉపకులాల వర్గీకరణపై జస్టిస్ షమీమ్ అక్తర్ నేతృత్వంలో ఏర్పాటు చేసిన ఏకసభ్య న్యాయ కమిషన్ కూడా ఉత్తమ్ నేతృత్వంలోని మంత్రివర్గ ఉప సంఘానికి సోమవారం నివేదిక ఇవ్వనుంది. మరోవైపు స్థానిక ఎన్నికల్లో బీసీ కోటాపై విశ్రాంత అధికారి బూసాని వెంకటేశ్వరరావు నేతృత్వంలో ఏర్పాటైన కమిషన్ కూడా ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనుంది. ఈ క్రమంలో మంగళవారం సీఎం రేవంత్‌రెడ్డి అధ్యక్షతన జరగనున్న మంత్రివర్గ సమావేశంలో సమగ్ర ఇంటింటి కులగణన సర్వే, స్థానిక ఎన్నికల్లో బీసీ కోటా, ఎస్సీ వర్గీకరణ నివేదికలపై సమీక్షించనున్నారు. అనంతరం ఈ అంశాలపై చర్చించేందుకు అసెంబ్లీ ప్రత్యేకంగా సమావేశం అవుతుంది. ఉదయం 11 గంటలకు ప్రారంభమవనున్న సమావేశం.. ఈ అంశాలపై చర్చ ముగిసే వరకూ కొనసాగనుంది. బీసీ కేటగిరీ ముస్లింలతో కలుపుకొని రాష్ట్రంలో బీసీ జనాభా 56.33 శాతం మేరకు ఉన్నట్లు సమగ్ర కులగణన సర్వే తేల్చింది. ఈ వివరాల ఆధారంగానే బూసాని వెంకటేశ్వరరావు కమిషన్.. స్థానిక ఎన్నికల్లో బీసీ కోటాపై నివేదిక ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు 50 శాతం మించకూడదు. కులగణన సర్వే ప్రకారం ఎస్సీ, ఎస్టీ జనాభా 27.88 శాతం మేరకు ఉంది. అంటే వారికి స్థానిక సంస్థల్లో 27 నుంచి 28 శాతం వరకు రిజర్వేషన్ కల్పించాల్సి ఉంటుంది. సుప్రీంకోర్టు ఉత్తర్వుల ప్రకారం బీసీలకు దక్కే రిజర్వేషన్ 22-23 శాతం మాత్రమే. బీసీ జనాభా దామాషా ప్రకారం స్థానిక ఎన్నికల్లో రిజర్వేషన్ పెంచాలంటే పార్లమెంటులో చట్ట సవరణ చేయడంతో పాటు 9వ షెడ్యూల్‌లో పేర్కొనాల్సిందే. ఈ మేరకు సమగ్ర వివరణతో కూడిన నివేదికను బూసాని కమిషన్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. స్థానిక ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పిస్తామంటూ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో బీసీ రిజర్వేషన్లు పెంచడానికి వీలుగా ప్రస్తుత బడ్జెట్ సమావేశాల్లోనే చట్టాన్ని సవరించాలని కేంద్రాన్ని కోరుతూ అసెంబ్లీలో తీర్మానాన్ని ఆమోదించి, కేంద్రానికి పంపనున్నట్లు తెలిసింది. అలాగే ఎస్సీ వర్గీకరణపైనా అసెంబ్లీలో చర్చించి, నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం.