సర్పంచుల గళం - న్యాయం కోరుతూ వినతి...

 హైదరాబాద్ 




తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై ఉత్కంఠ కొనసాగుతోంది. ప్రభుత్వం ఎన్నికల ప్రక్రియను ప్రారంభించాలని చూస్తుండగా, మాజీ సర్పంచులు మాత్రం పెండింగ్ బిల్లుల విషయంలో తమ గళాన్ని పెంచుతున్నారు. సర్పంచుల సంఘం ప్రధాన కార్యదర్శి ప్రనిల్ చందర్ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లో తెలంగాణ రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ను కలిసి, వినతి పత్రం అందజేశారు.తమ సమస్యలను పరిష్కరించాకే ఎన్నికలకు వెళ్లాలని డిమాండ్ చేశారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత ఐదేళ్లుగా గ్రామాల్లో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినా, వాటికి సంబంధించిన బిల్లులు ఇప్పటికీ చెల్లించలేదని సర్పంచులు ఆరోపిస్తున్నారు. లక్షలాది రూపాయలు అప్పు చేసి గ్రామాభివృద్ధికి కృషి చేసిన సర్పంచులు, ఇప్పుడు ఆర్థికంగా సంక్షోభంలో ఉన్నారనీ ఈ పరిస్థితుల్లో ఎన్నికలకు వెళ్తే, మరింత కష్టాలు తప్పవని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఇంతలో ఇంటర్మీడియట్, పదవ తరగతి పరీక్షల షెడ్యూల్ సమీపిస్తున్న నేపథ్యంలో, ఇప్పుడు ఎన్నికలు జరిగితే విద్యార్థులపై తీవ్ర ప్రభావం ఉంటుందని స్పష్టం చేస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఎన్నికల హడావుడి కారణంగా విద్యార్థుల ఏకాగ్రత దెబ్బతింటుందని, కనీసం పరీక్షలు పూర్తయ్యేంతవరకు ఎన్నికలు వాయిదా వేయాలని కోరుతున్నారు.బీసీలకు 42% రిజర్వేషన్ అమలు చేయాలని, ఎస్సీ వర్గీకరణలో తగిన న్యాయం జరగాలని సర్పంచుల సంఘం డిమాండ్ చేస్తోంది. ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు మరిచిపోయిందని ఆరోపణలు చేస్తున్న సర్పంచులు, సమస్యలు పరిష్కరించకపోతే భవిష్యత్తులో తగిన విధంగా ప్రజలు సమాధానం చెబుతారని హెచ్చరిస్తున్నారు.


ఇప్పుడంతా ప్రభుత్వ నిర్ణయంపైనే ఆసక్తి నెలకొంది. పెండింగ్ బిల్లులు చెల్లించి, పరీక్షల అనంతరం ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం అంగీకరిస్తుందా? లేక నిరసనలను పట్టించుకోకుండా ముందుకు సాగుతుందా? వేచి చూడాలి!


Previous Post Next Post

نموذج الاتصال

Follow Me