Etela Rajender: తెలంగాణలలో బీజేపీ బీసీ మంత్రాన్నే నమ్ముకుంది. గత ఎన్నికల్లో బీసీ ముఖ్యమంత్రి నినాదం కలిసి రాకపోయినా.. ఆ వర్గాన్ని ఓన్ చేసుకోవడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు కనిపిస్తుంది.
అందులో భాగంగా ఈటెల రాజేందర్‌కు రాష్ట్ర బీజేపీ పగ్గాలు అప్పజెప్పాలని ఢిల్లీ పెద్దలు ఫిక్స్ అయ్యారంట. ప్రస్తుతం ప్రెసిడెంట్ పదవి కోసం పోటీ పడుతున్న వారితో పోలిస్తే ఈటల బెటర్ అని కాషాయ పెద్దలు భావిస్తున్నారంట. అధ్యక్షుడు కావడానికి ఆర్ఎస్ఎస్ బ్యాక్‌గ్రౌండ్ అవసరం లేదంటూ తాజాగా కిషన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలతో ఈటల నియామకం దాదాపు కన్‌ఫర్మ్ అయినట్లే అంటున్నారు.తెలంగాణ కాషాయ రథసారథిగా మల్కాజ్‌గిరి ఎంపీ, మాజీ మంత్రి ఈటెల రాజేందర్ ఎంపిక దాదాపు ఖరారైదంట. ఈ నెలాఖరు లోపే దానిపై అధికారిక ప్రకటన, ఈటెల పగ్గాలు చేపట్టడం ఖాయమంటున్నారు. పార్టీ సంస్థాగత ఎన్నికలు దాదాపు పూర్తవుతున్న క్రమంలో కీలకమైన రాష్ట్ర అధ్యక్ష పదవి ఖరారుపై జాతీయపార్టీ దృష్టి సారించింది. ఈటల సారథ్యంపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా ప్రత్యేక శ్రద్దతో ఉన్నారంట. గతంలోనే ఈటెలకు కీలక బాధ్యతలు అప్పగిస్తామని షా మాట కూడా ఇచ్చారు. అయితే బండి సంజయ్, ఈటెల మధ్య గ్యాప్‌తో లోక్‌సభఎన్నికలకు ముందు ఈటెలకు పగ్గాలు ఇవ్వడానికి అధిష్టానం సాహసించలేదంట. అందుకే మధ్యే మార్గంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి మళ్లీ రాష్ట్ర పగ్గాలను అప్పజెప్పిందంటారు.
వాస్తవానికి, రాష్ట్రంలో బీసీలలోనే కాకుండా జనాభాపరంగా అత్యధిక సంఖ్యాకులున్న ముదిరాజ్ కులానికి చెందిన ఈటల రాజేందర్‌కు రెడ్డి సామాజిక వర్గంతో కూడా సంబంధాలున్నాయి. ఈటెల సతీమణి రెడ్డి సామాజికవర్గానికి చెందినవారే. బీసీ కార్డు ఓ వైపు.. రాజకీయంగా బలమైన రెడ్డి సామాజికవర్గం మరోవైపు .. ఈటెలకు నాయకత్వ బాధ్యతలు ఇవ్వడం వల్ల రెండు బలాలు కలిసి వస్తాయని బీజేపీ భావిస్తోందంట. బీఆరెస్‌తో మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలు, బండి, ఈటెల మధ్య విభేదాలు పార్టీలో అయోమయ వాతావరణం కారణంగా శాసన సభ ఎన్నికల్లో బీజేపీకి గట్టి దెబ్బ పడింది. ఎంపీ ఎన్నికల్లో అనూహ్యంగా పుంజుకున్న బీజేపీ.. బండి సంజయ్‌కు కేంద్ర మంత్రి పదవి ఇవ్వడంతో ఈటెలకు లైన్ క్లియర్ అయ్యిందంటున్నారు.
వాస్తవానికి ప్రస్తుతం అధ్యక్ష పదవి రేసులో ఈటెలతో పాటు ఎంపీలు ధర్మపురి అరవింద్, రఘునందన్, మరో నేత రామచంద్రరావు వంటి వారు పోటీ పడుతున్నారు. వారితో పోలిస్తే నాన్ కాంట్రవర్షియల్ నేతగా, రాష్ట్ర వ్యాప్తంగా పరిచయాలు ఉన్న ఈటెల రాజేందరే బెటర్ అన్న ఆలోచనలో అధిష్టానం ఉందంట. రాజా సింగ్ పేరు కూడా వినిపిస్తున్నా.. సామాజిక, ఆర్థిక, రాజకీయ నేపధ్యంతో పాటు వ్యక్తిగతంగా చూసుకున్నా ఈటల రాజేందర్ వైపే ఢిల్లీ పెద్దలు మొగ్గు చూపుతున్నారంట. 2021లో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఈటలపై కత్తి కట్టి అవమానకరమైన పరిస్థితుల్లో పార్టీ నుంచి బయటకు వెళ్లేలా చేశారు. అప్పుడున్న పరిస్థితుల్లో ఈటల కేంద్రంలో బలంగా ఉన్న బీజేపీ వైపు మొగ్గు చూపాల్సి వచ్చింది ఈటల.
తెలంగాణ ఉద్యమకారుడిగా , రాడికల్ భావజాలంతో రాజకీయాల్లో ఎదిగిన ఈటెల మాస్ లీడర్‌గా మంచి పేరు తెచ్చుకున్నారు. ఉద్యమ సమయం నుంచి కేసీఆర్ నమ్మిన బంటుగా ఉంటూ హుజురాబాద్ ప్రజల గుండెల్లో సుస్థిర స్థానం పదిలం చేసుకున్నారు. వరుసగా ఎమ్మెల్యేగా ఎన్నికవుతూ వచ్చారు. కేసీఆర్‌ను ఎదిరించి బీజేపీ అభ్యర్ధిగా బైపోల్స్‌లో కూడా విజయం సాధించి సంచలనం సృష్టించారు. ఆ తరువాత కేసీఆర్ మీద పోటీ చేసే క్రమంలో రెండు పడవల మీద కాళ్లు పెట్టడం, అనూహ్యంగా రెండు చోట్ల ఓడిపోవడం వెంట వెంటనే జరిగిపోయింది.
Also Read: బీజేపీ మహిళా మంత్రం.. బూత్ నుంచి రాష్ట్ర స్థాయి వరకు అన్ని పదవుల్లో ప్రాధాన్యత
తర్వాత మల్కాజ్‌గిరి పార్లమెంటు నియోజకవర్గం నుంచి ఎంపీగా గెలిచి బీజేపీ జెండా ఎగురవేశారు. ఈటెలకు బీజేపీ రాష్ట్ర బాధ్యతలు ఇస్తే ఉద్యమ సంబంధాలు, సామాజిక బలం తోడై పార్టీ మరింత బలోపేత అవుతుందని అధిష్టానం భవిస్తోందంట. ఈటెలకు పగ్గాలు అప్పగించి రాష్ట్రంలో బీఆర్ఎస్‌ను కోలుకోకుండా చేయాలని స్కెచ్ గీస్తున్నారంట. బీఆరెస్ నేతలతో సత్సంబంధాలున్న ఈటెల వారిని బీజేపీలోకి లాగుతారనే అంచనాలు వేసుకుంటున్నారంట.
దాంతో ప్రధాన ప్రతిపక్షంగా బీజేపీ ఎదగవచ్చని లెక్కలు వేసుకుంటున్నారంట. ప్రధాన ప్రతిపక్షంగా బీఆరెస్ కనుమరుగైతే రాష్ట్రంలో బీజేపీనే ప్రత్యామ్నాయంగా మారుతుంది. ఆ అంచనాలతోనే మాస్ ఇమేష్ పుష్కలంగా ఉన్న ఈటెలకు పగ్గాలు అప్పజెప్పాలని ఢిల్లీ పెద్దలు ఫిక్స్ అయ్యారంట. వచ్చే వారంలోగా సంస్థాగత ఎన్నికలన్నీ పూర్తవుతున్న తరుణంలో వచ్చే వారంలో ఈటెలను అధ్యక్ష పీఠంపై కూర్చోబెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి.
నిజామాబాద్ ఎంపీ అరవింద్ కూడా అధిష్టానం దృష్టిలో ఉన్నప్పటికీ ఆయన ఆవేశం మైనస్ పాయింట్ అయిందంటున్నారు. రాజాసింగ్‌కు విస్తృతమైన ప్రజాసబంధాలు లేవు. ఆయన ఇమేజ్ సొంత సెగ్మెంట్ అయిన గోషామహల్‌కే పరిమితం. రామచంద్రరావు వంటి లీడర్లు ప్రజల్న ప్రభావితం చేయగలిగే లీడర్లు కాదని అధిష్టానం అభిప్రాయపడుతుందంట. కానీ ఈటలకు అలా కాదు. రాష్ట వ్యాప్తంగా ప్రభావం చూపించగలరు అందుకే ఆయనే బెస్ట్ ఆప్షన్ అని బీజేపీ పెద్దలు ఫిక్స్ అయ్యారంట. ఇంత కాలం అధ్య్ష పదవికి సంబంధించి పార్టీలో పాత, కొత్త నేతల పంచాయతీ నడిచింది. అయితే అధ్యక్షుడు కావడానికి ఆర్ఎస్ఎస్ బ్యాక్‌గ్రౌండ్ అవసరం లేదంటూ ఇటీవల కిషన్ రెడ్డి వ్యాఖ్యానించారు. హైకమాండ్ నుంచి సంకేతాలు ఉండబట్టే ఆయన అలా మాట్లాడారని, ఈటలే ప్రెసిడెంట్ అనడానికి అవే సంకేతాలని అంటున్నారు.