కాంగ్రెస్‌లో రచ్చకెక్కిన విభేదాలు.. పటాన్‌చెరులో ఆందోళనలు


 

సంగారెడ్డి కాంగ్రెస్‌లో విభేదాలు మరోసారి భగ్గుమన్నాయి. ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డికి (MLA Gudem Mahipal Reddy) వ్యతిరేకంగా ప్రత్యర్థి వర్గం ఆందోళనకు దిగింది. సేవ్ కాంగ్రెస్.. సేవ్ పటాన్‌చెరు అంటూ నినాదాలు చేశారు. ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డికి వ్యతిరేకంగా గురువారం కాంగ్రెస్ నేతలు పెద్ద ఎత్తున ధర్నాకు దిగారు. ఎమ్మెల్యే ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటున్నారని ఆరోపిస్తూ పటాన్‌చెరు అంబేద్కర్ సర్కిల్ వద్ద ఆందోళన చేపట్టారు. ఎమ్మెల్యే డౌన్ డౌన్ అంటూ నేతలు నినాదాలు చేశారు. బీఆర్ఎస్ పార్టీ నుంచి వచ్చిన కార్పొరేటర్లు, కౌన్సిలర్లు, జడ్పీటీసీలు, ఎంపీపీలు, ఎంపీటీసీలు, సర్పంచులకు ప్రాధాన్యం ఇస్తున్నారని కాంగ్రెస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎమ్మెల్యే దిష్టిబొమ్మను దహనం చేసేందుకు కాటా శ్రీనివాస్ వర్గీయులు యత్నించారు. వారిని పోలీసులు అడ్డుకోవడంతో తోపులాట చోటు చేసుకుంది. రెండు రోజుల క్రితం ఐడీఏ బొల్లారంలో ఎమ్మెల్యేను కాటా శ్రీనివాస్ వర్గం అడ్డుకున్న విషయం తెలిసిందే. కాంగ్రెస్ కార్యకర్తలు అంబేద్కర్ సర్కిల్‌లో ధర్నా నిర్వహించిన అనంతరం పటాన్‌ చెరు ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ ముందు ఆందోళనకు దిగారు. ఎమ్యెల్యే కార్యాలయంలో కుర్చీలను విరగొట్టారు కాంగ్రెస్ కార్యకర్తలు. పరిస్థితి అదుపు తప్పడంతో వెంటనే పోలీసులు రంగ ప్రవేశం చేశారు. ఆందోళన చేస్తున్న కాంగ్రెస్ కార్యకర్తలను అదుపులోకి తోసుకుని పోలీస్‌స్టేషన్ తరలించారు. కాగా.. బీఆర్‌ఎస్ పార్టీ నుంచి పది మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ పది నియోజకవర్గాల్లో ఇప్పటి కూడా ఇబ్బందులు కొనసాగుతూనే ఉన్నాయి. వీటిని పరిష్కరించేందుకు అప్పట్లో టీపీసీసీ చీఫ్ మహేష్‌ కుమార్ గౌడ్ (TPCC Chief Mahesh Kumar Goud) తీవ్రంగా ప్రయత్నించారు. అయితే పాత, కొత్త నేతల మధ్య సమన్వయ లోపం వల్లే ఏదో చోట గొడవలు బయటపడుతూనే ఉన్నాయి. ఇప్పుడు తాజాగా బీఆర్‌ఎస్‌ నుంచి పటాన్‌చెరు ఎమ్మెల్యేగా గెలుపొందిన గూడెం మహిపాల్ రెడ్డి.. ఆ తరువాత కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఎమ్మెల్యే ఏకపక్ష నిర్ణయాలతో పాటు పటాన్‌చెరులో కాంగ్రెస్, బీఆర్‌ఎస్ కార్యకర్తల మధ్య తరచూ గొడవలు జరుగుతూనే ఉన్నాయి. రెండు నెలల క్రితం పటాన్‌చెరు నుంచి కాటా శ్రీనివాస్ గౌడ్ నాయకత్వంలో కొంత మంది కార్యకర్తలు గాంధీభవన్‌‌కు వచ్చారు.


ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి గురించి.. ఆయన రావడం వల్ల కలుగుతున్న ఇబ్బందుల గురించి లిఖితపూర్వకమైన లేఖను పీసీసీ చీఫ్‌కు ఇచ్చారు. దీనిపై సానుకూలంగా స్పందించిన పీసీసీ చీఫ్.. పటాన్‌చెరులో ఉన్న సమస్యలను అధ్యయనం చేసి, పరిష్కరిస్తామని వారికి హామీ కూడా ఇచ్చారు. అయితే ఇప్పటి వరకు సమస్యలు పరిష్కారం కాకపోవడంతో ఎమ్మెల్యే మహిపాల్, కాటా శ్రీనివాస్‌ వర్గాల మధ్య విభేదాలు కొనసాగుతూనే ఉన్నాయి. నిన్నటి నుంచి పటాన్‌చెరులో వచ్చిన ప్రోటోకాల్ సమస్యను ఇరువర్గాలకు చెందిన నాయకులు, కార్యకర్తలు తీవ్రంగా పరిగణిస్తున్నారు. ఈ క్రమంలో సేవ్ కాంగ్రెస్.. సేవ్ పటాన్‌చెరు నినాదంతో నిన్నటి నుంచి ఆందోళనలు చేస్తున్నారు. రేపు (శుక్రవారం) గాంధీ భవన్‌కు తమ సమస్యలను పీసీసీ చీఫ్ దృష్టికి మరోసారి తీసుకువెళ్తామని పటాన్‌చెరు కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు.

Previous Post Next Post

نموذج الاتصال

Follow Me