- ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో తెరపైకి మరో వివాదం
- టీమిండియా జెర్సీలపై పాకిస్థాన్ పేరు ఉండడానికి బీసీసీఐ నిరాకరణ
- ఈ వివాదంపై తాజాగా స్పందించిన ఐసీసీ
- టోర్నీ లోగోను తమ జెర్సీలపై ముద్రించడం ప్రతి జట్టు బాధ్యత అన్న ఐసీసీ
- అన్ని జట్లూ ఈ నియమానికి కట్టుబడి ఉండాలని సూచన
ఫిబ్రవరి 19 నుంచి పాకిస్థాన్, దుబాయ్ వేదికలుగా జరగాల్సి ఉన్న ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో మరో వివాదం తెరపైకి వచ్చింది. భారత జట్టు ధరించే జెర్సీలపై ఆతిథ్య దేశం పాకిస్థాన్ పేరు ఉండటాన్ని బీసీసీఐ నిరాకరిస్తున్నట్టు తెలుస్తోంది.
ఐసీసీ టోర్నీలలో భాగంగా ఆతిథ్య దేశపు పేరు, లోగోను జెర్సీపై ముద్రించడం ఆనవాయతీ. కానీ, బీసీసీఐ మాత్రం తాము ఆడేది దుబాయి వేదికగా కనుక పాకిస్థాన్ పేరును తమ ఆటగాళ్ల జెర్సీలపై ముద్రించబోమని చెబుతున్నట్లు సమాచారం. ఈ వివాదంపై తాజాగా ఐసీసీ స్పందించింది. ఛాంపియన్స్ ట్రోఫీ నిబంధనలను అన్ని దేశాలూ పాటించాల్సిందేనని సంబంధిత వర్గాలు స్పష్టం చేశాయి.
"టోర్నమెంట్ లోగోను తమ జెర్సీలపై ముద్రించడం ప్రతి జట్టు బాధ్యత. అన్ని జట్లూ ఈ నియమానికి కట్టుబడి ఉండాలి" అని ఐసీసీ అధికారి ఒకరు చెప్పినట్లు ఏ-స్పోర్ట్స్ పేర్కొంది.
ఆటగాళ్ల కిట్‌పై ఛాంపియన్స్ ట్రోఫీ లోగో, ఆతిథ్య దేశం పాకిస్థాన్ పేరుతో కనిపించకపోతే భారత జట్టుపై కఠిన చర్యలు తీసుకోవచ్చని అపెక్స్ బోర్డు పేర్కొంది.
ఐసీసీ నిబంధనల ప్రకారం, మ్యాచ్‌లు ఎక్కడ జరుగుతున్నాయనే దానితో సంబంధం లేకుండా జెర్సీలపై జట్లకు ఆతిథ్యం ఇచ్చేవారి పేరు రాయాలని తెలిపింది.
ఇదిలాఉంటే... గత కొన్ని నెలలుగా బిసీసీఐ, పీసీబీ మధ్య చాలా ఉద్రిక్తతలు చోటుచేసుకున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా ఛాంపియన్స్ ట్రోఫీ కోసం తమ జట్టును పాకిస్థాన్‌కు పంపడానికి భారత బోర్డు నిరాకరించడం, చివరికి ఈ విషయంపై ఐసీసీ రాజీ కుదర్చడంతో హైబ్రిడ్ మోడల్‌లో టోర్నీ నిర్వాహణకు పాక్ అంగీకరించడం జరిగాయి.
అయితే, భవిష్యత్తులో భారత్ ఆతిథ్యం ఇచ్చే ఐసీసీ టోర్నీలకు కూడా దాయాది దేశం మన దగ్గరకు రాకుండా తటస్థ వేదికలోనే ఆడనుంది. అలాగే బీసీసీఐ కొన్ని అదనపు రుసుములు కూడా చెల్లించాల్సి ఉంటుంది.
Tags
News@jcl