రైతు భరోసా పథకాన్ని అమలు చేయడానికి సంబంధించిన మార్గదర్శకాలను తెలంగాణ ప్రభుత్వం తాజాగా విడుదల చేసింది. గతంలో ఈ పథకం అమలులో జరిగిన లోటు పాట్లను ప్రస్తుతం ప్రభుత్వం గుర్తించింది. ఈ నేపథ్యంలో ఈ పథకం పక్కా పకడ్బందీగా అమలు చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసింది. అందులోభాగంగా.. జనవరి 26వ తేదీన గణతంత్ర దినోత్సవం సందర్బంగా రైతు భరోసా నిధులను విడుదల చేసేందుకు ముహుర్తం ఖారారు చేసింది.
వ్యవసాయ యోగ్యమైన భూములకు ఎకరానికి రూ. 6000 చొప్పున పెట్టుబడి సాయం రైతుల ఖాతాల్లో జమ చేయనుంది. వ్యవసాయ శాఖ అందించిన తాజా గణాంకాల ప్రకారం.. వర్షాకాలంలో 1.49 కోట్ల ఎకరాలల్లో పంట సాగు అయినట్లు ప్రభుత్వానికి నివేదిక అందింది. ఇక దాదాపు 3 లక్షల ఎకరాలకుపైగా భూములు సాగు యోగ్యం కాదని తేల్చి.. వాటి సర్వే నెంబర్లను సైతం ప్రభుత్వం బ్లాక్ చేసింది. ఇక రైతు భరోసా అమలుకు రూ.8900 కోట్లు నిధులు అవసరమవుతాయని ఇప్పటికే ప్రభుత్వానికి ఆర్థిక శాఖ నివేదిక అందించింది.
రైతు భరోసా పథకానికి దరఖాస్తు చేసుకోవాలని అర్హులైన రైతులకు వ్యవసాయ శాఖ సూచించింది. అందుకోసం అవసరమైన పత్రాలు సిద్ధం చేసుకోవాలంది. 2025, జనవరి 01వ తేదీ తర్వాత కొత్త పట్టాదారు పాస్ పుస్తకాలు పొందిన వారు సైతం దరఖాస్తు చేసుకోవచ్చునని పేర్కొంది. దరఖాస్తుదారుడి పట్టాదారు పాస్ పుస్తకం లేదా డిజిటల్ సంతకం చేసిన జిరాక్స్ కాపీ, ఆధార్ కార్డ్ జిరాక్స్, బ్యాంక్ అకౌంట్ ఖాతా జిరాక్స్, పూర్తిగా నింపబడిన దరఖాస్తు ఫారాన్ని క్లస్టర్ అధికారి అయిన వ్యవసాయ విస్తరణ అధికారికి సమర్పించాల్సి సూచించింది.
అయితే గతంలో పెట్టుబడి సహయం వచ్చిన రైతుల బ్యాంకు అకౌంట్ నెంబర్ ఏమైనా మార్పులుంటే.. కొత్త బ్యాంక్ అకౌంట్ నెంబర్ ఖాతాకు సంబంధించిన జిరాక్స్ కాఫీని.. దరఖాస్తు ఫారమ్‌కు జత చేసి సమర్పించాల్సి ఉంటుంది.
2025, జనవరి 01 నాటికి భూ భారతి (ధరణి) పోర్టల్‌లో ఉన్న పట్టాదారుల డేటా.. రైతు భరోసా పథకం కింద అర్హులైన రైతులకు సాయం అందించేందుకు భూమి పరిపాలన ప్రధాన కమిషనర్ (సీసీఎల్‌ఏ) నుంచి పొందబడినదని.. డిజిటల్ సంతకం అయిన రైతులు ఈ పథకానికి అర్హులని వ్యవసాయ శాఖ స్పష్టం చేసింది. అయితే గతంలో రైతు బంధు పొందిన రైతులు మళ్లీ దరఖాస్తు చేసుకోనవసరం లేదని వివరించింది