సంక్రాంతి నుంచి రైతు భరోసా అమలు.. ఎకరానికి 7,500 చొప్పున పెట్టుబడి సాయం


 

  • సంక్రాంతి నుంచి రైతు భరోసా అమలు.. ఎకరానికి 7,500 చొప్పున పెట్టుబడి సాయం

  • నేడు పాలమూరులో ప్రకటించనున్న సీఎం రేవంత్‌

  • రైతు సదస్సు ముగింపు సభకు ముఖ్యమంత్రి హాజరు

  • పలు కీలక పథకాలపై ప్రకటన చేసే అవకాశం

  • రూ.2 లక్షల వరకు రుణమాఫీ చెక్కుల పంపిణీ

  • ఏడాదిలో వ్యవసాయ ప్రగతిని వివరించనున్న సీఎం రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తవుతున్న సందర్భంగా.. శనివారం మహబూబ్‌నగర్‌లో నిర్వహిస్తున్న రైతు సదస్సు కీలక ప్రకటనలకు వేదిక కానుంది. ఈ సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరవుతున్న సీఎం రేవంత్‌రెడ్డి.. ఈ సందర్భంగా రైతు భరోసా పథకం అమలుకు సంబంధించి ప్రకటన చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ ఏడాది రెండో పంటకాలం నుంచి ఎకరానికి రూ.7,500 చొప్పున పెట్టుబడి సాయం అందించే రైతు భరోసా పథకాన్ని సంక్రాంతి పండుగ నుంచి ప్రారంభించాలని ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. దీనిపై మహబూబ్‌నగర్‌ రైతు సదస్సులో సీఎం రేవంత్‌రెడ్డి ప్రకటన చేసే అవకాశాలున్నాయి. గతంలో ఎకరానికి రూ.5 వేల చొప్పున ఉన్న పెట్టుబడి సాయాన్ని రూ.7500కు పెంచి రైతు భరోసా పేరిట అందజేస్తామని ఎన్నికల సమయంలో కాంగ్రెస్‌ హామీ ఇచ్చింది. కానీ, అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తవుతున్నా ఈ పథకాన్ని ప్రారంభించకపోవడంతో.. పెట్టుబడి సాయం పెంపు కోసం రైతులు ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో పాలమూరు రైతు సదస్సులో ఈ అంశంపై సీఎం రేవంత్‌రెడ్డి కీలక ప్రకటన చేసే అవకాశముందని భావిస్తున్నారు.మంత్రివర్గ ఉపసంఘం నివేదిక, అసెంబ్లీలో చర్చించిన తర్వాత మార్గదర్శకాలు ఖరారు చేసి.. రైతుభరోసా ప్రారంభిస్తామని ప్రకటించే అవకాశం ఉంది. దీంతోపాటు రైతు రుణమాఫీ కింద 2 లక్షల వరకు బకాయిలున్న రైతులకు రుణ విముక్తి కలిగించి చెక్కులను పంపిణీ చేయనున్నారు. 

  • రూ.2 లక్షల రుణమాఫీ చెక్కుల పంపిణీ..

  • రాష్ట్రంలోని రైతులకు ప్రభుత్వం ఇప్పటివరకు మూడు విడతలుగా రుణమాఫీ చేసిన విషయం తెలిసిందే. తొలుత రూ.లక్ష వరకు, రెండో విడతలో రూ.1.50 లక్షల వరకు, మూడో విడతలో రూ. 2 లక్షల వరకు రుణాలున్న రైతులకు మాఫీ చేసింది. అయితే ఈ కేటగిరీల్లో కొందరు రైతులు పలు కారణాల వల్ల రుణమాఫీ కాకుండా మిగిలిపోయారు. తెల్ల రేషన్‌కార్డులు లేనివారు, కుటుంబ నిర్ధారణ కానివారు, ఆధార్‌ కార్డులో తప్పులు ఉన్నవాళ్లు, బ్యాంకు ఖాతాల్లో పొరపాట్లున్న రైతులు, పేర్లలో తప్పులు దొర్లినవారు.. ఇలా రాష్ట్రవ్యాప్తంగా సుమారు 3.50 లక్షల మందికి రుణమాఫీ కాలేదు. మండల వ్యవసాయ అధికారులు క్షేత్రస్థాయికి వెళ్లి రైతులు, కుటుంబ సభ్యుల వివరాలు, ఆధార్‌ కార్డులు సేకరించి, సెల్ఫీలు దిగి, రైతు నుంచి డిక్లరేషన్‌ తీసుకొని, ‘యాప్‌’లో నమోదు చేశారు. కుటుంబ నిర్ధారణ పూర్తిచేశారు. వీటితోపాటు కెనరా బ్యాంకు సహా కొన్ని బ్యాంకులు గతంలో ప్రభుత్వానికి ఇవ్వని పంట రుణాల వివరాలను ఇప్పుడు సమర్పించాయి. ఇటువంటి రైతులు సుమారు 50 వేల మంది ఉన్నారు. దీంతో మొత్తం కలిపి 4 లక్షల మంది రైతుల లెక్క తేలింది. వీరికి రూ.2 లక్షల రుణమాఫీ చేయడానికి రూ.2,700 కోట్ల నుంచి రూ. 2,800 కోట్లు సర్దుబాటు చేయాల్సి వస్తోంది. వీరికి శనివారం పాలమూరులో నిర్వహించే రైతు సదస్సులో సీఎం రేవంత్‌రెడ్డి చెక్కులు పంపిణీ చేయనున్నారు. డిసెంబరు మొదటి వారంలో ఉద్యోగులకు వేతనాలు, పింఛన్లు చెల్లించిన తర్వాత.. రుణమాఫీ సొమ్మును రైతుల ఖాతాల్లో జమ చేసేలా ప్రణాళిక రూపొందించారు. దీంతో రూ.2 లక్షల వరకు రుణమాఫీ ప్రక్రియ పూర్తి కానుంది. 

    • ఇతర పథకాలపైనా ప్రకటన!

    రైతు సదస్సులో భాగంగా.. గడచిన ఏడాది కాలంలో రాష్ట్ర ప్రభుత్వం రైతులకు చేసిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను సీఎం రేవంత్‌రెడ్డి వివరించనున్నారు. సన్నాలకు బోనస్‌, ఉచిత విద్యుత్తు, పంట ఉత్పత్తుల కొనుగోళ్లు రైతు బీమా తదితర అంశాలపై సీఎం ప్రసంగించే అవకాశాలున్నాయి. భవిష్యత్తు కార్యాచరణను కూడా ఆయన ప్రకటించనున్నారు. దీంతో పాటు రూ.4 వేల పింఛన్‌పైనా ముఖ్యమంత్రి ప్రకటన చేస్తారని ప్రజలు ఆశిస్తున్నారు. కాగా, శనివారం సీఎం సభతో మూడు రోజుల రైతు సదస్సు ముగియనుంది. బహిరంగ సభలో ప్రసంగించేందుకు ముందు వ్యవసాయ శాఖ ఏర్పాటు చేసిన స్టాళ్లను ముఖ్యమంత్రి సందర్శించనున్నారు. లక్ష మంది రైతులతో నిర్వహించే ఈ సభకు అధికార యంత్రాంగం భారీ ఏర్పాట్లు చేసింది. ఉమ్మడి జిల్లాతోపాటు రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి రైతులు సభకు తరలివస్తుండటంతో పోలీస్‌ శాఖ 2వేల మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తోంది.


    • సన్నాలకు బోన్‌సతో రైతుల్లో సంతోషం..

    మహబూబ్‌నగర్‌ జిల్లాలో నిర్వహిస్తున్న రైతు సదస్సులో పాల్గొన్న పలువురు రైతులు... ‘సన్నాలకు బోనస్‌’ పథకంపై సంతృప్తి వ్యక్తం చేశారు. బీడు భూములకు, అనర్హులకు రైతుబంధు ఇచ్చే బదులుగా.. పంటలకు గిట్టుబాటు ధరలు, బోనస్‌ ఇస్తే రైతులతోపాటు కౌలు రైతులకు కూడా మేలు జరుగుతుందనే అభిప్రాయం వ్యక్తం చేశారు. చలమయ్యే అనే ఒక రైతు మాట్లాడుతూ.. ఒకటిన్నర ఎకరాల్లో తన తండ్రి వరిపంట సాగు చేశారని, 45 క్వింటాళ్ల దిగుబడి వచ్చిందని తెలిపారు. ఎమ్మెస్పీతోపాటు బోనస్‌ కూడా రావడంతో రూ.25 వేల అదనపు ఆదాయం వచ్చిందన్నారు.

Previous Post Next Post

Education

  1. KGBV Admissions: ఏపీ కేజీబీవీ పాఠశాలల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల, ఏప్రిల్ 11 వరకు ఆన్‌లైన్‌ దరఖాస్తులు - New!
  2. TG Polycet 2025: నేటి నుంచి తెలంగాణ పాలిసెట్ 2025 దరఖాస్తుల స్వీకరణ, మే 13న ప్రవేశ పరీక్ష - New!

News

  1. TG New Ration Cards : తెలంగాణ రేషన్ కార్డులు 'స్మార్ట్' గురూ.. ట్రైకలర్‌లో బీపీఎల్‌.. గ్రీన్‌ కలర్‌లో ఏపీఎల్‌! - New!
  2. Telangana LRS Fee : ఎల్ఆర్ఎస్ కు దరఖాస్తు చేసుకున్నారా..? మీరు చెల్లించాల్సిన ఛార్జీల వివరాలను ఇలా చెక్ చేసుకోండి - New!

హనుమాన్

  1. హనుమాన్ భజన పాటల లిరిక్స్ I Hanuman Bhajana Patala lyrics in Telugu - New!

نموذج الاتصال

Follow Me