రంగారెడ్డి జిల్లా నేలలో దాగున్న జీవకణాలు ప్రపంచాన్ని భయపెడుతున్న క్యాన్సర్‌కు చెక్ పెట్టే మార్గాన్ని చూపిస్తున్నాయంటే నమ్మగలరా? శాస్త్రవేత్తలు గుర్తించిన ప్రత్యేక బ్యాక్టీరియా జాతులు ప్రాణాంతక క్యాన్సర్ చికిత్సలో గేమ్‌చేంజర్‌గా మారే అవకాశముందంటున్నారు. ఆ ఇంట్రస్టింగ్ డీటేల్స్ ఈ కథనంలో తెలుసుకుందాం.
ఈ పరిశోధనను తమిళనాడు రాష్ట్రానికి చెందిన అలగప్ప విశ్వవిద్యాలయం శాస్త్రవేత్త డా. సంజీవ్ కుమార్ సింగ్ నేతృత్వంలో జట్టు నిర్వహించింది. రంగారెడ్డి నేలలో నుంచి క్లెబ్సియెల్లా న్యుమోనియే, క్లెబ్సియెల్లా క్వాసిన్యుమోనియే, స్ట్రెప్టోమైసెస్ మినుటిస్క్లెరోటికస్, స్ట్రెప్టోమైసెస్ ప్యూసెటియస్ వంటి నాలుగు ప్రత్యేక బ్యాక్టీరియా జాతులు గుర్తించారు.
ఈ జాతుల జన్యు స్థాయి విశ్లేషణ కోసం జన్ బ్యాంక్‌లో టెస్టులు నిర్వహించారు. ముఖ్యంగా స్ట్రెప్టోమైసెస్ ప్యూసెటియస్ అనే జాతి అత్యధిక యాంటీ-క్యాన్సర్ యాక్టివిటీని చూపించింది. ఈ బ్యాక్టీరియా ప్యూసెమైసిన్ అనే సహజ సమ్మేళనాన్ని ఉత్పత్తి చేస్తుందని.. దీనికి యాంటీ-బాక్టీరియల్, యాంటీ-ట్యూమర్ లక్షణాలు ఉన్నాయని శాస్త్రవేత్తలు స్పష్టం చేశారు. ఇవి బయోటెక్నాలజీ ఆధారిత ప్రక్రియల ద్వారా క్యాన్సర్, సూక్ష్మజీవ జబ్బుల చికిత్సకు వాడతగిన ఔషధ సమ్మేళనాలుగా మారే అవకాశం ఉంది.
ఈ ఆవిష్కరణ భవిష్యత్తులో క్యాన్సర్‌కు చికిత్సలో పెద్ద మైలురాయిగా మారవచ్చని శాస్త్రవేత్తలు విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. మన నేలలో దాగి ఉన్న ఔషధ గుణాల్ని పరిశోధనలు వెలికి తీయడం ద్వారా ప్రపంచానికి ఉపయోగపడే కొత్త మార్గాలు అందుబాటులోకి రావడం ఆశాజనక పరిణామంగా చెబుతున్నారు.