జనగామ మైన్స్ ఏడీ ని సస్పెండ్ చేయండి
• ప్రైవేటు సంస్థ నుంచి రూ.5.12 కోట్లు రాబట్టండి
• చీఫ్ సెక్రటరీకి జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి ఫిర్యాదు
జడ్చర్ల, అక్టోబర్ 14: ప్రైవేటు సంస్థతో కుమ్మక్కై ప్రభుత్వానికి కోట్లాది రుపాయలు రాకుండా చేసిన ప్రస్తుత జనగామ మైన్స్ ఏడీ విజయ్ కుమార్ పై తక్షణం చర్యలు తీసుకోవాలని జడ్చర్ల ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్ రెడ్డి డిమాండ్ చేసారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ సెక్రటరీకి ఫిర్యాదు చేసారు.
సోమవారం మీడియారు విడుదల చేసిన ఒక ప్రకటనలో అనిరుధ్ రెడ్డి ఈ ఉదంతం పూర్వాపరాలను వివరించారు. బాలానగర్ మండంల కేంద్రలోని సర్వే నెంబర్ 118/పి కలిగిన భూమిలో వారాహి అనే ప్రైవేటు సంస్థకు చెందిన వ్యక్తులు బయటి నుంచి బారీ స్థాయిలో మట్టిని తరలించుకొని వచ్చి అక్కడున్న పెద్దచెరువు కాల్వను పూడ్చి వేసి దాని దిశను మళ్లించిన విషయంగా గత ఫిబ్రవరి నెలలో అనిరుధ్ రెడ్డి స్వయంగా క్షేత్రస్థాయిలోకి మీడియాను కూడా తీసుకెళ్లి అక్కడ జరిగిన వ్యవహారాన్ని చూపించారు. ఈ వ్యవహారం పై మీడియాలో కూడా పెద్ద ఎత్తున కథనాలు కూడా వెలువడ్డాయి. ఈ నేపథ్యంలోనే అప్పట్టో మహబూబ్ నగర్ జిల్లా మైన్స్ ఏడీగా పని చేస్తున్న విజయ్ కుమార్ కూడా ఈ విషయంగా విచారణ చేసి అక్రమాలకు పాల్పడిన వారాహి సంస్థ అక్రమంగా మట్టి తరలింపునకు సంబంధించి ప్రభుత్వానికి రూ.5.12 కోట్ల ను సీనరేజ్ చార్జీలుగా చెల్లించాలని నోటీసులు ఇచ్చారు. అయితే విజయ్ కుమార్ కు మహబూబ్ నగర్ నుంచి జనగామకు బదిలీ కాగా తాను బదిలీపై వెళ్లిపోవడానికి ఒక్కరోజు ముందు విజయ్ కుమార్ గతంలో తాను జారీ చేసిన ఉత్తర్వులను తానే రద్దు చేస్తూ వారాహి సంస్థ ఎలాంటి సీనరేజి చార్జీలను చెల్లించనవసరం లేదని చెప్తూ మొత్తం రూ.5.12 కోట్లను మాఫీ చేసారు. సర్వే నెంబర్ 118/పి లో ఉన్న మట్టి ఎక్కడి నుంచో తరలించుకొని వచ్చింది కాదని, అదంతా అక్కడే తవ్విపోసిన మట్టి అని తన ఉత్తర్వుల్లో పేర్కొన్నారని ఈ సందర్భంగా అనిరుధ్ రెడ్డి తెలిపారు. అయితే ఈ అక్రమాలపై లోతుగా దర్యాప్తు చేయాలంటూ అనిరుధ్ రెడ్డి ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయగా జిల్లా కలెక్టర్ నలుగురు ఉన్నతాధిరారులతో ఒక ఫోర్ మెన్ కమిటీని నియమించి ఈ వ్యవహారంపై విచారణ జరిపించారు. ఈ కమిటీలో మహబూబ్ నగర్ ఆర్డీఓ ఇ.నవీన్, ఇరిగేషన్ ఇఇ సీహెచ్ ఉదయ్ శంకర్, సర్వే లాండ్ రికార్డ్స్ ఏడి ఎస్.కృష్ణారావు, డిడి మైన్స్ కే.నరసింహారెడ్డి తదితర అధికారులు ఉన్నారు. ఈ ఫోర్ మెన్ కమిటీ ఇచ్చిన నివేదికలో సర్వే నెంబర్ 118/పి లో ఉన్న మట్టి, అక్కడ పోసిన మట్టి రంగు వేర్వేరుగా ఉండటంతో అదంతా ఇతర ప్రాంతాల్లో తవ్వి అక్కడకు తరలించిందని నిర్ధారించారు. అక్రమంగా 1.67 లక్షల టన్నుల మట్టిని తవ్వి తీసుకొచ్చారని అధికారులు గుర్తించారు. ఈ నేపథ్యంలోనే అనిరుధ్ రెడ్డి చీఫ్ సెక్రటరీకి ఫిర్యాదు చేసారు. ఫోర్ మెన్ కమిటీ అక్కడ వేసిన 1.67 లక్షల టన్నుల మట్టి బయటి నుంచి తీసుకొచ్చిందని నిర్ధారించారని, దీంతో వారాహి అక్రమాలు నిరూపణ అయ్యాయని చెప్పారు. వారాహికి వత్తాసు పలికి తాను బదిలీ కావడానికి ఒక్క రోజు ముందు వారాహి సంస్థకు అనుకూలంగా ఉత్తర్వులిచ్చిన మైన్స్ ఏడీ విజయ్ కుమార్ ను తక్షణం విధుల నుంచి సస్పెండ్ చేయాలని, వారాహి సంస్థ నుంచి గతంలో నిర్ణయించిన విధంగా రూ.5.12 కోట్ల ను రాబట్టాలని ఈ సందర్భంగా అనిరుధ్ రెడ్డి డిమాండ్ చేసారు.