వైద్య ఆరోగ్యశాఖలో కీలక సంస్కరణలకు నాంది పలకనున్నామని.. దాంట్లో భాగంగా, మూడు ప్రధాన విభాగాలపై మూడు టాస్క్‌ఫోర్స్‌లు వేయనున్నామని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ తెలియజేశారు.
ప్రైవేటు ఆస్పత్రుల్లో ఉచితంగా వైద్యం
ద్యఆరోగ్యశాఖలో సంస్కరణలకు ప్రభుత్వం కసరత్తు
ప్రైవేటు ఆస్పత్రులు, మందుల నాణ్యత, హోటళ్లు రెస్టారెంట్లపై టాస్క్‌ఫోర్సులు
15 రోజుల్లో తనిఖీలు మొదలు.. త్వరలో బదిలీలు, 3 డైరెక్టర్ పోస్టుల మంజూరు
ఆచార్యులు, అధ్యాపకుల మూల వేతనం పెంపు.. సిబ్బందికి ఠంచనుగా వేతనం
ఫిర్యాదులకు టోల్ ఫ్రీ నంబరు.. వైద్యఆరోగ్య మంత్రి దామోదర రాజనర్సింహ
Jclnews Web హైదరాబాద్, వైద్య ఆరోగ్యశాఖలో కీలక సంస్కరణలకు నాంది పలకనున్నామని.. దాంట్లో భాగంగా, మూడు ప్రధాన విభాగాలపై మూడు టాస్క్‌ఫోర్స్‌లు వేయనున్నామని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ తెలియజేశారు. మంగళవారం ఆయన మీడియా ప్రతినిధులతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడారు. యాక్సిడెంట్ కేసుల్లో రూ.లక్ష ఉచిత వైద్యంపై కసరత్తు జరుగుతోందని, ఈ పథకం నిబంధనల ప్రకారం క్షతగ్రాతులను సమీపంలోని ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్తే.. వారికి రూ.లక్ష వరకు ఉచితంగా వైద్యం అందించాల్సి ఉంటుందన్నారు. ఈ పథకం విధివిధానాలు ఖరారు కావాల్సి ఉందని చెప్పారు.
కాగా, కార్పొరేట్, ప్రైవేట్ ఆస్పత్రుల నియంత్రణకు క్లినికల్ ఎస్టాబ్లిష్‌మెంట్ యాక్టును అమలు చేయనున్నామని, దీనికోసం ఒక ప్రత్యేక టాస్క్‌ఫోర్స్‌ను రంగంలోకి దించాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. ఈ మేరకు వచ్చే 15 రోజుల్లో ప్రైవేటు ఆస్పత్రుల్లో తనిఖీలు మొదలవుతాయని చెప్పారు. ప్రజారోగ్యాన్ని దెబ్బతీస్తున్న నకిలీ ఔషధాల తయారీదార్ల ఆట కట్టించటానికి.. ఔషధాల నాణ్యత, విక్రయాలు తదితర అంశాలపై మరో టాస్క్‌ఫోర్స్ బృందాన్ని ఏర్పాటు చేయనున్నామని తెలిపారు. రాష్ట్రంలో హోటళ్లు, రెస్టారెంట్లు, ఆహార విక్రయదారుల సంఖ్య భారీగా పెరిగిందని, అయితే, ఆహార నాణ్యతపై భయాందోళనలు వ్యక్తం అవుతున్న దృష్ట్యా హోటళ్లు, రెస్టారెంట్లపై నిరంతర తనిఖీలు నిర్వహించేందుకు మరో టాస్క్‌ఫోర్స్ బృందాన్ని ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు. ఈ మూడు టాస్క్‌ఫోర్స్‌లు తన పర్యవేక్షణలో పని చేస్తాయని మంత్రి దామోదర తెలిపారు.
మెడికల్ కాలేజీల్లో త్వరలో బదిలీలు
ప్రభుత్వ వైద్య కళాశాలల్లో ఒకేచోట ఐదేళ్లకు మించి పని చేస్తున్న ఆచార్యులు, అధ్యాపకులు, నర్సులందరినీ బదిలీ చేయాలని.. ఈ విషయంలో ఎవరికీ వెసులుబాటు కల్పించకూడదని సర్కారు భావిస్తున్నట్లు మంత్రి తెలిపారు. స్పౌజ్ కేసులో విద్యాశాఖలో అమలవుతున్న నిబంధనను వైద్యశాఖలో పాటించాలన్న యోచనలో ఉన్నట్లు వెల్లడించారు. టీచర్ల బదిలీల్లో 8 ఏళ్లలో ఒక్కసారి మాత్రమే స్పౌజ్ (భార్య/భర్త) అంశాన్ని వినియోగించుకోవాలన్న నిబంధన ఉంది. వైద్యవిద్య సంచాలకుల పరిధిలోని అడ్మినిస్ట్రేటివ్ పోస్టుల నియామకాలకు గరిష్ఠ వయోపరిమితిని 64 ఏళ్లుగా తీసుకోవాలని నిర్ణయించినట్లు పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి నేటి దాకా వైద్య ఆరోగ్యశాఖలో.. ప్రజారోగ్య సంచాలకులు, డ్రగ్ కంట్రోల్ డైరెక్టర్ వంటి కీలకమైన పోస్టులను మంజూరు చేయలేదు. ఈ నేపథ్యంలో, ఈ రెండు పోస్టులను ప్రభుత్వం మంజూరు చేయనుందని, జీవో వారం, పది రోజుల్లో వస్తుందని దామోదర వెల్లడించారు.
తెలంగాణ వైద్య విధాన పరిషత్‌ను (టీవీవీపీ) సెకండరీ హెల్త్ కేర్ కిందికి తీసుకురావాలని సర్కారు నిర్ణయించిందని, ఇక టీవీవీపీ సెకండరీ హెల్త్ డైరెక్టర్‌గా మారనుందని తెలిపారు. టీవీవీపీకి కూడా డైరెక్టర్ రానున్నారని, దాని పరిఽధిలోని ఉద్యోగులందరికీ ట్రెజరీ ద్వారా వేతనాలు అందనున్నాయని చెప్పారు. ఈ మూడు డైరెక్టర్ పోస్టులతో పాటు తెలంగాణ రాష్ట్ర వైద్య సేవలు మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ ఎండీ పోస్టును కూడా మంజూరు చేయనున్నట్లు తెలిపారు.
కార్పొరేషన్ ద్వారా గత సర్కారు రూ.9 వేల కోట్ల రుణం
తెలంగాణ స్టేట్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ కార్పొరేషన్ పేరుతో గత బీఆర్‌ఎస్ సర్కారు వివిధ బ్యాంకుల నుంచి రూ.9 వేల కోట్ల అప్పు తీసుకుందని, ఆ డబ్బును ఏం చేశారో తెలియదన్నారు. సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రుల భవనాలను నిబంధనలకు విరుద్ధంగా 20కిపైగా అంతస్తులు కట్టాలని గత ప్రభుత్వం నిర్ణయించిందని, వరంగల్‌లో ఇప్పటికే 20కి పైగా అంతస్తులు కట్టారన్నారు. ఎల్బీనగర్ టిమ్స్‌కు కూడా అలాంటి ప్రణాళికే ఉండగా...దాన్ని తమ ప్రభుత్వం 13 అంతస్తులకు తగ్గించిందని, ఇతర టిమ్స్‌ను కూడా 13 అంతస్తులకే పరిమితం చేస్తామన్నారు. మంత్రి దామోదర రాజనర్సింహ వెల్లడించిన మరిన్ని నిర్ణయాలు..
వైద్య విద్య ఆచార్యులకు, అధ్యాపకులకు మూల వేతనం పెంపు. గిరిజన ప్రాంతాల్లో పని చేస్తున్న వారికి బేసిక్‌పే మీద 50 శాతం, కొత్తగా ఏర్పాటైన మెడికల్ కాలేజీల్లో పని చేస్తున్న వారికి 30 శాతం పెంపుదల.
ప్రభుత్వ ఆస్పత్రుల్లో రోగులకు ఇచ్చే ఆహార నాణ్యతపై తనిఖీలు. నాణ్యత లేని ఆహారం అందించినట్లు గుర్తిస్తే డైట్ కాంట్రాక్టర్లపై చర్యలతో పాటు కేసులు నమోదు.
ప్రతీ మండల కేంద్రంలో ఒక పాలియేటివ్ కేర్ ఏర్పాటు. జాతీయ రహదారుల వెంట ప్రతి 35 కి.మీ.లకు ఒక ట్రామా కేర్ సెంటర్ ఏర్పాటు.
వైద్యఆరోగ్యశాఖలో పనిజేస్తున్న సిబ్బంది అందరికీ ఠంచన్‌గా వేతనం అందేలా గ్రీన్ చానెల్ ఏర్పాటు. దీర్ఘకాలంగా ఒకేచోట పని చేస్తున్న జిల్లా వైద్యాధికారుల బదిలీ. వైద్యులు, ఇతర సిబ్బంది పనితీరుపై ఫిర్యాదుల కోసం టోల్ ఫ్రీ నంబరు ఏర్పాటు.