TGNews: రోజుకు 191 కోట్లు!
రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా తీసుకునే అప్పుల కంటే.. పాత రుణాలకు చెల్లించాల్సిన అసలు, వడ్డీ సొమ్మే భారంగా పరిణమిస్తోంది. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం చేసిన అప్పుల తాలూకు అసలు, వడ్డీలను చెల్లించడానికి కాంగ్రెస్ సర్కారు ఆపసోపాలు పడుతోంది. ఆ రుణాలకు అసలు, వడ్డీ కింద రోజుకు రూ.191 కోట్లు చెల్లించాల్సి వస్తోంది.
ఈ నెల 17 వరకు తీసుకున్నది రూ.25,118 కోట్లు
అసలు, వడ్డీల కింద కట్టింది రూ.38,040 కోట్లు
గత ప్రభుత్వ రుణభారం ఈ సర్కార్‌పై
హైదరాబాద్, జూన్ 18 రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా తీసుకునే అప్పుల కంటే.. పాత రుణాలకు చెల్లించాల్సిన అసలు, వడ్డీ సొమ్మే భారంగా పరిణమిస్తోంది. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం చేసిన అప్పుల తాలూకు అసలు, వడ్డీలను చెల్లించడానికి కాంగ్రెస్ సర్కారు ఆపసోపాలు పడుతోంది. ఆ రుణాలకు అసలు, వడ్డీ కింద రోజుకు రూ.191 కోట్లు చెల్లించాల్సి వస్తోంది. దీంతో ఇతర సంక్షేమ పథకాలకు నిధులు సర్దుబాటు చేయాలంటే ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించక తప్పడం లేదు. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చే నాటికే రాష్ట్ర అప్పులు భారీగా పేరుకుపోయాయి. ఈ విషయాన్ని అసెంబ్లీలో ప్రవేశపెట్టిన శ్వేతపత్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వివరించింది.
త ప్రభుత్వం అడ్డూఅదుపూ లేకుండా అప్పులు చేసిందని, ఇప్పుడది తమకు తలకు మించిన భారమైందని ఆక్షేపించింది. ద్రవ్య బాధ్యత, బడ్జెట్ నిర్వహణ (ఎఫ్‌ఆర్‌బీఎం) పరిధిలో తీసుకున్న బడ్జెట్ అప్పులు, వివిధ కార్పొరేషన్లకు గ్యారెంటీల పేర తీసుకున్న అప్పులు కలిపి మొత్తం రూ.6,71,757 కోట్లు పేరుకుపోయాయని వివరించింది. ఇందులో ఎఫ్‌ఆర్‌బీఎం పరిధిలోని అప్పులు రూ.3,89,673 కోట్లు, కార్పొరేషన్లకు గ్యారెంటీల పేర తీసుకుని, ప్రభుత్వం చెల్లించాల్సిన అప్పులు రూ.1,27,208 కోట్లు, కార్పొరేషన్లు స్వయంగా తీసుకుని, చెల్లించాల్సిన గ్యారెంటీ అప్పులు రూ.95,462 కోట్లు, గ్యారెంటీలు లేకుండా సంస్థలు స్వయంగా తీసుకున్న అప్పులు రూ.59,414 కోట్లు కలిపి.. మొత్తం రూ.6,71,757 కోట్లుగా ఉన్నాయని తెలిపింది. 2023 డిసెంబరు 7న కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. అప్పటి నుంచి ఈ నెల 17 వరకు అప్పుల అసలు, వడ్డీల కింద ప్రభుత్వం రూ.38,040 కోట్లను చెల్లించింది. కానీ, ఇదే సమయంలో ప్రభుత్వం తీసుకున్న అప్పు రూ.25,118 కోట్లు. రోజుకు రూ.191 కోట్ల చొప్పున అసలు, వడ్డీల సొమ్మును చెల్లించక తప్పడం లేదు.
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక తీసుకున్న అప్పు, తిరిగి చెల్లించిన సొమ్ము (రూ.కోట్లలో)
నెల తీసుకున్న అప్పు అసలు, వడ్డీ
డిసెంబరు 2023 1400 4754
జనవరి 2024 3000 6459
ఫిబ్రవరి 2024 3000 4648
మార్చి 2024 7718 8458
ఏప్రిల్ 2024 4000 4450
మే 2024 4000 7487
జూన్ 2024 2000 1785
మొత్తం 25,118 38,040