ఎమ్మెల్యేలు కొబ్బరికాయ కొట్టక.. ఆర్నెళ్లుగా పెండింగ్‌!

 ఎమ్మెల్యేలు కొబ్బరికాయ కొట్టక.. ఆర్నెళ్లుగా పెండింగ్‌!

సమయమివ్వక ఆగిన 9 ఆరోగ్య ఉపకేంద్రాల నిర్మాణం



ఎమ్మెల్యేలు కొబ్బరికాయ కొట్టక.. ఆర్నెళ్లుగా పెండింగ్‌!

సంగారెడ్డి పట్టణ పరిధిలోని రాజంపేటలో నిలిచిపోయి ఆరోగ్య ఉప కేంద్ర భవన నిర్మాణం

సంగారెడ్డి జిల్లాలో 246 హెల్త్‌ సబ్‌ సెంటర్లు

124 నూతన భవనాల నిర్మాణానికి ప్రతిపాదనలు

ఎమ్మెల్యేలచే ప్రారంభించాలని అప్పటి కలెక్టర్‌ ఆదేశం

 సంగారెడ్డి, జనవరి 9 : ఎమ్మెల్యే వచ్చి కొబ్బరికాయలు కొడితేనే పనులు ప్రారంభించాలి.. ఎన్ని రోజులైనా అప్పటి దాకా ఆగాల్సిందే.. ఆరోగ్య ఉప కేంద్రాల భవన నిర్మాణాలపై గత కలెక్టర్‌ హుకూం ఇది! దీంతో ఆర్నెళ్లుగా జిల్లాలో ఆరోగ్య ఉపకేంద్రాల నిర్మాణం మొదలు కాలేదు. పలుచోట్ల పనులు చేపట్టేందుకు కాంట్రాక్టర్లే దొరకలేదు. కారణం ఆరా తీస్తే ఆరోగ్య ఉప కేంద్రాల నిర్మాణాలను మంజూరు చేశారే తప్ప నిధులు విడుదల చేయలేదని తెలిసింది.

124 పక్కా భవనాలు

సంగారెడ్డి జిల్లాలోని 246 ఆరోగ్య ఉప కేంద్రాలున్నాయి. ఇందులో 124 కేంద్రాలకు పక్కా భవనాలను మంజూరు చేస్తూ వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ కమిషనర్‌ గతేడాది మే 31న ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఉత్తర్వుల ఆధారంగా 124 ఆరోగ్య ఉప కేంద్రాలకు రూ.20 లక్షల చొప్పున మంజూరు చేస్తూ అప్పటి జిల్లా కలెక్టర్‌ శరత్‌ గత జూలై 10న పాలనాపరమైన అనుమతి ఇచ్చారు. అదే రోజు భవనాల నిర్మాణ బాధ్యతలు వివిధ ప్రభుత్వ ఏజెన్సీలకు కేటాయించారు. ఇందులో పంచాయతీరాజ్‌ ఇంజనీరింగ్‌ విభాగానికి 81 ఆరోగ్య కేంద్రాలు, టీఎ్‌సఎంఎ్‌సఐడీసీకి తొమ్మిది, డీఆర్‌డీఏకు 34 ఆరోగ్య ఉప కేంద్రాల భవనాల నిర్మాణాలున్నాయి. టీఎ్‌సఎంఎ్‌సఐడీసీ తమకు కేటాయించిన ఆరోగ్య ఉపకేంద్రాల భవనాల నిర్మాణాలను చేపట్టేందుకు సిద్ధమైంది. నామినేషన్‌ పద్ధతిన కాంట్రాక్టర్లకు కూడా అనుమతి ఇచ్చింది. ఇదే విషయాన్ని అప్పట్లోనే గత కలెక్టర్‌ శరత్‌ దృష్టికి టీఎ్‌సఎంఎ్‌సఐడీసీ అధికారులు తీసుకెళ్లారు. అయితే ఎమ్మెల్యేలు వచ్చి కొబ్బరికాయలు కొట్టిన తర్వాతే పనులు ప్రారంభించాలని కలెక్టర్‌ స్పష్టం చేసినట్టు తెలిసింది. ఇందుకుగాను ఎమ్మెల్యేల సమయం తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఆర్నెళ్లుగా టీఎ్‌సఎంఎ్‌సఐడీసీ అధికారులు ఎన్నిసార్లు ఎమ్మెల్యేల సమయం కోసం ప్రయత్నించినా వారు రాలేదు. అప్పట్లో జిల్లాలోని ఐదుగురు ఎమ్మెల్యేల్లో నలుగురు బీఆర్‌ఎస్‌, ఒకరు కాంగ్రె్‌సకు చెందినవారున్నారు. ఎమ్మెల్యేలు సమయం ఇవ్వకపోవడంతో తొమ్మిది ఆరోగ్య ఉప కేంద్రాల భవన నిర్మాణాలను ఇప్పటి వరకు చేపట్టలేదు.

నిధులు లేక అటకెక్కిన పనులు

పంచాయతీరాజ్‌ ఇంజనీరింగ్‌ విభాగానికి కేటాయించిన 81 ఆరోగ్య ఉప కేంద్రాల్లో 68 కేంద్రాల భవనాల నిర్మాణాలను ప్రారంభించినా.. కాంట్రాక్టర్లు మధ్యలోనే ఆపేశారు. మిగిలిన 13 ఆరోగ్య ఉప కేంద్రాల భవనాల నిర్మాణాలను అసలు ప్రారంభించనే లేదు. వీటికి డబ్బులు లేవన్న కారణంతో టెండర్లు వేసేందుకు కాంట్రాక్టర్లు ముందుకు రావడం లేదు. నిధుల కోసం డీఎంహెచ్‌వోకు లేఖ రాసినా స్పందన లేదని పంచాయతీరాజ్‌ ఇంజనీరింగ్‌ అధికారులు తెలిపారు. అలాగే, డీఆర్‌డీఏకు కేటాయించిన 34 ఆరోగ్య ఉప కేంద్రాలను స్వయం సహాయక సంఘాలకు కేటాయించారు. ఏడు కేంద్రాల భవనాల నిర్మాణాలను ప్రారంభించారు. 27 కేంద్రాలకు భవన నిర్మాణాలను మొదలు పెట్టనేలేదు. వీటి పనులు ప్రారంభించాలని ఒక్కో కేంద్రానికి రూ.2 లక్షల చొప్పున స్వయం సహాయక కేంద్రాలకు అడ్వాన్సుగా కలెక్టర్‌ విడుదల చేశారు. అయినా మిగిలిన డబ్బుల కోసం ఇబ్బందులు పడాల్సి వస్తుందని నిర్మాణాలను మొదలుపెట్టేందుకు స్వయం సహాయక సంఘాలు ముందుకు రావడం లేదు.

Previous Post Next Post

نموذج الاتصال

💬 Chat 📢 Follow