రాజీవ్‌ రహదారికి ‘రైతుబంధు’!

jayyapal jvs media
2 minute read

 


రహదారికి రైతుబంధుసాయం! ఇదేంటి రహదారికి రైతుబంధు సాయమేమిటని ఆశ్చరపోకండి! ఎందుకంటే 60 ఏళ్ల క్రితం నిర్మాణం ప్రారంభించిన రాజీవ్‌ రహదారికి తెలంగాణ ప్రభుత్వం నుంచి రైతుబంధు సాయం అందుతోంది.


భూనిర్వాసితులకు నష్టపరిహారం విషయంలో లేని స్పష్టత


భూవిలువ పెరగడంతో ఎక్కువైన సివిల్‌ కోర్టు కేసులు, కక్షలు


సవరణ చేస్తే తమ బాధలు తీరతాయంటున్న యజమానులు


గజ్వేల్‌, జనవరి: రహదారికి రైతుబంధుసాయం! ఇదేంటి రహదారికి రైతుబంధు సాయమేమిటని ఆశ్చరపోకండి! ఎందుకంటే 60 ఏళ్ల క్రితం నిర్మాణం ప్రారంభించిన రాజీవ్‌ రహదారికి తెలంగాణ ప్రభుత్వం నుంచి రైతుబంధు సాయం అందుతోంది. రోడ్డు నిర్మాణానికి సేకరించిన భూములను రికార్డులనుంచి తొలగించకపోవడమే దీనికి కారణం. తెలంగాణలో ప్రతిష్ఠాత్మకమైన రాజీవ్‌ రహదారి నిర్మాణం 1960లో చేపట్టారు. హైదరాబాద్‌ నుంచి సిద్దిపేట, కరీంనగర్‌, పెద్దపల్లి, రామగుండం, మంచిర్యాల వరకు విస్తరించి ఉన్న ఈ రోడ్డు నిర్మాణంలో భాగం గా సిద్దిపేట జిల్లా గజ్వేల్‌ మండలంలోని ప్రజ్ఞాపూర్‌, రిమ్మనగూడ, కొడకండ్ల గ్రామాల్లో తీసుకున్న భూమి ని ధరణి పోర్టల్‌ వచ్చినా రికార్డుల్లో నుంచి తొలగించకపోవడం, ప్రస్తుతం భూమి విలువ భారీగా పెరగడంతో నా భూమి రికార్డుల్లో ఉందని, పొజిషన్‌ చూపించాలంటూ పలువురు దరఖాస్తులు చేసుకుంటున్నారు. ధరణి పోర్టల్‌లో సైతం కొనుగోలుదారుల భూమికి బదులు పూర్వపు భూయజమానుల పేర్లు చేరడంతో పలువురు కోర్టు మెట్లు ఎక్కుతున్నారు.


ఆ భూములు ఇంకా రికార్డుల్లోనే..


సికింద్రాబాద్‌ పరిధిలోని బొల్లారం నుంచి మంచిర్యాల వరకు 1960వ దశకంలో నిర్మించిన రాజీవ్‌ రహదారి విస్తరణలో భూమిని కోల్పోయిన యజమానుల పేర్లు పహాణీల నుంచి తొలగించకపోవడం ప్రజ్ఞాపూర్‌లో పెద్ద సమస్యగా మారింది. సర్వే నెంబరు 65, 66, 67, 78, 76, 75, 147, 143, 146, 156, 176, 177, 193, 178, 185, 274, 270, 269, 268, 216, 267, 220, 222, 262, 261, 335, 336, 337, 340, 341, 356, 358లలో దాదాపు 25 నుంచి 30 ఎకరాల భూసేకరణ చేపట్టగా, తాజాగా రోడ్డు విస్తరణ సమయంలో మరో 25 ఎకరాల వరకు రోడ్డుకు సేకరించారు. ఈ సర్వే నెంబర్లలో ఎవరి భూములలో నుంచి రాజీవ్‌ రహదారి వెళ్లిందో వారి వివరాలను తొలగించకపోవడం, ప్రస్తుతం భూవిలువలు భారీగా పెరగడం, పలువురు ఈ భూముల క్రయవిక్రయాలు జరపడంతో అధికారులకు తొలగించాలంటే కత్తి మీద సాములా మారింది. రాజీవ్‌ రహదారిపై నూతనంగా నిర్మించిన ప్రజ్ఞాపూర్‌ బైపా్‌సకు సంబంధించిన భూమిని నోషనల్‌ ఖాతాలో ఆర్‌అండ్‌బీ రోడ్డుగా నమోదు చేశారు. దీంతో తాజా రోడ్డు రికార్డుల్లోకి ఎక్కితే 60ఏళ్ల కిందట వేసిన రోడ్డు మాత్రం రికార్డుల్లో నమో దు కాలేదు. రాజీవ్‌ రహదారి నిర్మాణానికి సేకరించిన భూమిని ప్రస్తుతం రికార్డుల్లో నుంచి తొలగించేందుకు అధికారులు జంకుతున్నారు. గతంలో సేకరించిన భూములకు సంబంధించిన రికార్డులు అందుబాటులో ఉన్నా ఆ భూమికి నష్టపరిహారం చెల్లింపు విషయంలో స్పష్టత లేదు. ఇటు భూరికార్డుల్లో నుంచి పేర్లను తొలగించకపోవడంతో రోడ్డు నిర్మాణానికి సేకరించిన భూమి రికార్డులో అలాగే ఉండడంతో క్రయవిక్రయాలు చేస్తున్నారు. దీంతో ప్రస్తుతం పొజిషన్‌లో ఉన్న పట్టాదారులు ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు, గజ్వేల్‌-ప్రజ్ఞాపూర్‌ మునిసిపాలిటీగా ఏర్పడి అభివృద్ధి చెందడంతో ఈ రోడ్డులో భూముల విలువ భారీగా పెరిగింది. భువనగిరి-ప్రజ్ఞాపూర్‌ రోడ్డులో సైతం భూమి విలువ భారీగా పెరిగింది. ఈ రోడ్డు విస్తరణలో సేకరించిన భూమి వివరాలను సైతం రెవెన్యూ రికార్డుల్లో నుంచి తొలగించకపోవడంతో ఈ రోడ్డులోనూ అదే పరిస్థితి నెలకొన్నది. గతంలో సేకరించిన భూమి వివరాలను ఇప్పటికైనా రికార్డుల్లో నుంచి తొలగించాలని పలువురు కోరుకుంటున్నారు

Tags
Chat