కౌన్ బనేగా జడ్చర్లకా బాద్ షా..?
అభ్యర్థుల్లో, అభిమానుల్లో ఫలితాల చలి జ్వరం..
గెలిచేది ఎవరో.. నిలిచేది ఎవరో.. తేలేది రేపే..
ఎగ్జిట్ ఫలితాలతో కాంగ్రెస్ పార్టీలో నయా జోష్..
బీఆర్ఎస్ లో అనుమానాలు..
ఎక్కడ చూసినా నరాలు తెగే ఉత్కంఠ.. ఎవరిలో చూసినా ఎన్నికల ఫలితాల చలి జ్వరం.. రేపు ఏం జరగబోతుంది..? అన్నదే మాట్లాడుతోంది ప్రతిస్వరం..
ఈ ఒక్క అంశంపైనే రోజంతా జడ్చర్ల అసెంబ్లీ గరం గరంగా కనిపిస్తోంది.. ప్రతి నోటా వినిపించేది ఒకే ఒక్క మాట.. కౌన్ బనేగా జడ్చర్ల అసెంబ్లీ బాద్ షా..?
ఉత్కంఠ భరితమైన పోరు తర్వాత ప్రతి ఒక్కరు ఆసక్తిగా ఫలితాల కోసం ఎదురుచూస్తున్నారు. మరో 15 గంటల్లో అభ్యర్థుల భవిష్యత్తు తేలనుంది..
బీఆర్ఎస్ లో సంధిగ్ధం..
అధికార పార్టీ బీఆర్ఎస్ ను ఎగ్జిట్ పోల్ సందిగ్ధంలో పడేసింది. మొదటినుంచి ఎమ్మెల్యేగా డాక్టర్ లక్ష్మారెడ్డి చేసిన అభివృద్ధి కార్యక్రమాలు, ప్రభుత్వ పథకాలకు ప్రజల్లో ఉన్న ఆదరణ, రైతుబంధు, రైతు భీమా, పింఛన్లు కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ వ్యక్తిగతంగా లక్ష్మారెడ్డిపై కనిపించని వ్యతిరేకత తమకు ఘన విజయాన్ని అందిస్తాయని నాయకులు నమ్మారు.
గత ఎన్నికల్లో జరిగిందే ఈసారి కూడా పునరావృతం అవుతుందని భావించారు. కానీ క్షేత్రస్థాయిలో ఈసారి కాంగ్రెస్ తన జోరును ప్రదర్శించడం, గ్రామీణ ప్రాంతాలలో ఆ పార్టీకి ఓటింగ్ పెరిగిందని పార్టీ వర్గాలలో పలు అనుమానాలు నెలకొన్నాయి.
గతంలో జరిగిన మ్యాజిక్ పునరావృతమై తిరిగి గెలుస్తామని నేతలు ఆశలు పెట్టుకున్నారు. ఒకవేళ ఈ పార్టీ గెలిస్తే అది కేవలం లక్ష్మారెడ్డి చేసిన అభివృద్ధి పుణ్యమే. ఓడిపోతే కచ్చితంగా ఇది ప్రభుత్వం మీద ఉన్న వ్యతిరేకత మాత్రమే..
ఆ పార్టీకి ఎన్ని ఓట్లు వచ్చినా అవన్నీ వ్యక్తిగతంగా లక్ష్మారెడ్డి ఖాతాలోకే వస్తాయి. ఉత్కంఠ భరితంగా జరిగిన ఈ పోరులో బీఆర్ఎస్ గెలుపును కూడా కొట్టి పారేయలేం. కనీస మెజార్టీతోనైనా లక్ష్మారెడ్డి గెలుపు ఖాయమని పార్టీ శ్రేణులు నమ్ముతున్నారు.
మొత్తానికి ఎన్నికల ఫలితాలు వెల్లడి అయ్యేందుకు ఒక్కరోజు మాత్రమే మిగిలింది. గెలుపు తలుపును ఎవరు తట్టబోతున్నారో... జడ్చర్ల అసెంబ్లీ ప్రజలు ఏ అభ్యర్థికి తీర్పును ఇవ్వనున్నారో ఇక కొన్ని గంటల్లోనే తేలనుంది..
