జడ్చర్ల: మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల మండలం కొండేడు గ్రామం దుందుభి వాగులో పడి మంగళవారం ఇద్దరు యువతులు మరణించారు. గ్రామానికి చెందిన పడకండి కేశవులు | కూతురు స్వాతి (18), పడకండి మల్లయ్య కూతురు అనూష (18) ఉదయం వ్యవసాయ పొలం వద్దకు వెళ్లేందుకు బయలుదేరారు. దుందుభి వాగు వద్ద నీటి ప్రవాహాన్ని దాటుతూ వారి పొలానికి వెళ్లే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో దారిలో ఉన్న పాకురు వల్ల జారీ నీటి ప్రవాహంలో పడిపోయారు. ఇద్దరూ నీటి ప్రవాహం నుండి బయటపడే ప్రయత్నం చేసినప్పటికీ ప్రయోజనం లేకపోయింది.
తమ పిల్లలు పొలం వద్దకు రాకపోవడంతో కుటుంబ సభ్యులు పరిశీలించారు. ఒక బండ పైన టవల్, టిఫిన్ బాక్స్ ఉండటం చూసి వెంటనే జరిగిన విషయాన్ని గ్రామస్థులకు తెలిపారు. అందరూ వచ్చి పరిశీలించగా వారు అప్పటికే నీటి ప్రవాహంలో కొంత దూరం కొట్టుకుపోయి ప్రాణాలు కోల్పోయినట్లు గుర్తించారు. మృతదేహాలను వెలికి తీసి పోలీసులకు సమాచారం. ఇచ్చారు. ఈ సంఘటనతో గ్రామంలో విషాద ఛాయలు నెలకొన్నాయి.
Tags
News@jcl.
