*షాద్‌నగర్ కాదు "షాక్" నగర్..*
*సంచలన ఉదంతాలకు కేంద్రంగా షాద్‌నగర్ ప్రాంతం..*
*90వ దశకం నుంచే హత్యోదంతాలు..*
*ఏం జరిగినా రాష్ట్రవ్యాప్త సంచలనమే..*
*సంచలన నేరాలకు అడ్డాగా మారుతుందా..?*
పట్టపగలు నడిరోడ్డు మీద ఇద్దరిని నరికివేసినా.. అర్ధరాత్రి ఓ ఆడపడుచును సజీవ దహనం చేసినా.. పబ్లిక్ గా వ్యక్తులను కిడ్నాప్ చేసి అంతమొందించినా.. ఎక్కడ తప్పు చేశారో అక్కడే నేరస్తులను ఎన్కౌంటర్ చేసినా.. నేరాల్లో తెలుగు రాష్ట్రాల పోలీసులకు సవాలుగా మారిన కరడు గట్టిన నేరస్తులను ఎన్కౌంటర్
చేసినా.. అలాంటి సంఘటనలకు కేంద్రం ఏదంటే చెప్పే పేరు షాద్‌నగర్..! మూడు దశాబ్దాలుగా ఇలాంటి ఎన్నో సంఘటనలకు కేంద్ర బిందువుగా మారుతున్న షాద్‌నగర్ పట్టణంలో సంచలన ఉదంతాలు అన్నీ ఇన్ని కావు.. ఫ్యాక్షనిజం, నక్సలిజం, రౌడీయిజం.. వీటిని అణిచివేసి దిశగా అడుగులు వేసిన పోలీస్ ఇజం.. నేపథ్యంలో ఇక్కడ జరిగిన సంఘటనలు ఒకసారి పరిశీలిస్తే ఒకసారి ఆశ్చర్యం అనిపిస్తుంది ఇది షాద్‌నగరా..? లేక షాక్ నగరా? అనిపిస్తుంది.
*సంచలనం రేకెత్తించిన షాద్ నగర్ జంట హత్యలు*
1990 డిసెంబర్ 5వ తేదీన ఆనాటి ఉమ్మడి మహాబూబ్ నగర్ జిల్లాలోని షాద్‌నగర్ ఆర్టీసి బస్టాండ్‌లో అప్పటి కాంగ్రెస్ నేతలు దేవగుడి శివశంకర్ రెడ్డి, లక్కిరెడ్డి గోపాల్‌రెడ్డిలను ప్రత్యర్థులు దారుణంగా హత్య చేశారు. హత్యకు గురైన వారు మాజీ మంత్రి ఆదినారాయణరెడ్డి చిన్నాన్న. మరో వైపు ఈ హత్యలకు ప్రతీకారంగా టీడీపీ ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి బాబాయ్ శివారెడ్డిని ప్రత్యర్థులు హైద్రాబాద్‌లో హత్య చేశారు. గతంలో వీరిద్దరూ కూడ వేర్వేరు పార్టీల్లో ఉండేవారు. జమ్మలమడుగు నియోజకవర్గంలో టీడీపీ, కాంగ్రెస్ పార్టీల మధ్య ఫ్యాక్షన్ గొడవలు సాగేవి. ఆదినారాయణరెడ్డి కాంగ్రెస్ నుండి వైసీపీలో చేరారు.
వైసీపీ నుండి ఆయన టీడీపీలో చేరారు. ఉమ్మడి ఏపీ రాష్ట్రంలో చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో రామసుబ్బారెడ్డి మంత్రిగా ఉన్నారు. ఆ సమయంలోనే ఈ కేసులో రామ సుబ్బారెడ్డికి శిక్షపడింది. దీంతో రామసుబ్బారెడ్డి మంత్రి పదవికి రాజీనామా చేశారు. ఆ తర్వాత కింది కోర్టు ఇచ్చిన తీర్పుపై రామసుబ్బారెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. రామసుబ్బారెడ్డికి అనుకూలంగా హైకోర్టు తీర్పు ఇచ్చింది. ఈ కేసులో రామసుబ్బారెడ్డిని నిర్ధోషిగా తేల్చడంతో ఆదినారాయణరెడ్డి వర్గీయులు 2008లో సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఆదినారాయణరెడ్డి వర్గీయులు సుప్రీంకోర్టును ఆశ్రయించిన సమయంలో కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. ఆ తర్వాత ఆదినారాయణరెడ్డి వైఎస్ఆర్‌సీపీలో ఆ తర్వాత టీడీపీలో చేరారు ఆదినారాయణరెడ్డి.
గత చంద్రబాబు ప్రభుత్వంలో ఆదినారాయణరెడ్డి మంత్రిగా కూడ పనిచేశారు. ఉమ్మడి ఏపీ రాష్ట్రంలో షాద్ నగర్ జంట హత్యల కేసులో మాజీ మంత్రి రామసుబ్బారెడ్డి 23 మాసాల పాటు జైలు జీవితాన్ని గడిపారు. ఈ కేసును కోట్టి వేస్తూ సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. జమ్మలమడుగుకు చెందిన మాజీ మంత్రి ఆదినారాయణ రెడ్డి పెద్దనాన్న దేవగుడి శివశంకర్ రెడ్డి, లక్కిరెడ్డి గోపాల్ రెడ్డిలను ప్రత్యర్థులు హత్య చేశారు. దీనికి సంబంధించి మాజీ మంత్రి శివారెడ్డి, ఆయన సోదరుడి కుమారుడు, టీడీపీ నాయకుడు రామసుబ్బారెడ్డి, ఆయన సమీప బంధువు విశ్వేశ్వర రెడ్డి, సుగమంచిపల్లె వెంకట్రామిరెడ్డి, ఆయన ముగ్గురు సోదరులు సహా మొత్తం11 మందిపై షాద్‌నగర్ పోలీసులు కేసు పెట్టారు.
2006లో కేసును కొట్టి వేస్తూ హైకోర్టు తీర్పు ఇచ్చింది. ఈ తీర్పును సవాల్ చేస్తూ శంకర్ రెడ్డి కుమారుడు శివనారాయణ రెడ్డి సుప్రీంకోర్టులో అప్పీలు చేసుకున్నారు. నిందితులకు వ్యతిరేకంగా తెలంగాణ ప్రభుత్వం కూడా అప్పీల్ చేసినప్పటికీ, కేసు విచారణ ఇంకా కొనసాగించాల్సిన అవసరం లేదని సుప్రీంకోర్టు ధర్మాసనం అభిప్రాయపడింది. సుప్రీంకోర్టు కేసును కొట్టివేస్తూ తీర్పు ఇవ్వడంతో 29 ఏళ్ల నాటి జమ్మలమడుగు (ఏపీలోని కడప జిల్లా) జంట హత్యల కేసు ఉత్కంఠకు తెర పడింది.
*షాద్ నగర్ ఎన్ కౌంటర్ లో "గ్యాంగ్ స్టర్ నయీం హతం"*
నయీముద్దీన్ అలియాస్ భువనగిరి నయీం గురించి చాలా మందికి తెలిసే ఉంటుంది. అనేక హత్యలు, భూదందా సెటిల్మెంటు కేసులలో నయీం మోస్ట్ వాంటెడ్ క్రిమినల్. అతనిపై సుమారు 100కి పైగా కేసులున్నాయి. పోలీసుల నిఘా పెరగడంతో కొంత కాలం అజ్ఞాతంలోకి వెళ్లిపోయి మళ్ళీ ఆ మధ్యనే బయటకి వచ్చి సెటిల్మెంటులు చేస్తున్నాడు. నయీం కోసం చాలా కాలంగా గాలిస్తున్న పోలీసులకి అతను అప్పటి మహబూబ్ నగర్ జిల్లా షాద్ నగర్ లో గల మిలీనియం టౌన్ షిప్పులో ఉన్నట్లు పక్కా సమాచారం అందడంతో నల్గొండ గ్రేహౌండ్ పోలీసులు అతనిని ఇంటి చుట్టుముట్టారు. తప్పించుకొని పారిపోయే ప్రయత్నం చేస్తున్న సమయంలో పోలీసులు నయీంని, అతని అనుచరుడిని కాల్చి చంపారు. కారు డ్రైవర్ మాత్రం తప్పించుకొని పారిపోయాడు. నయీం ఇంటిలో నుంచి ఒక ఏకె-47, నాలుగు తుపాకీలు పోలీసులు స్వాధీనం చేసుకొన్నారు.
భువనగిరికి చెందిన నయీం 1989లో నక్సల్ లో చేరాడు. ఆ తరువాత అతనే అనేక మంది నక్సలైట్లని హత్యలు చేశాడు. వారిలో మావోయిస్ట్ నేత సాంభశివుడు, మావో కార్యకర్త బెల్లీ తదితరులు, అతని చేతిలో చంపబడ్డారు. ఐపిఎస్ అధికారి కె.ఎస్.వ్యాస్, పాటల్ల గోవర్ధన్ రెడ్డి, రాములు, పౌరహక్కుల సంఘం నాయకుడు పురుషోత్తం తదితరుల హత్య కేసులలో నయీం ప్రధాన నిందితుడు. పాముని ఆడించేవాడు పాము కాటుతో చస్తాడన్నట్లుగా, నేర ప్రపంచంలో తుపాకులతో ఆడుకొన్న నయీం చివరికి ఆ తుపాకీ గుండుతోనే షాద్ నగర్ లో హతం అయ్యాడు. గ్యాంగ్ స్టార్ నయీమ్ ఎన్కౌంటర్ దేశవ్యాప్తంగా సంచలనం అయింది.
*దిశ నిందితుల ఎన్ కౌంటర్*
ఢిల్లీ నిర్భయ ఘటన తర్వాత అంతగా దేశం మొత్తాన్ని కదిలించిన ఘటన దిశ అత్యాచారం, హత్య. మధ్య రాత్రి కూడా కాదు కేవలం రాత్రి 9 గంటల సమయంలో, ప్రజలు డబ్బు చెల్లించి మరీ ప్రయాణించే అవుటర్ రింగ్ రోడ్డుకు అత్యంత సమీపంలో లో నలుగురు కిరాతకులు మద్యం మత్తు లో వెటర్నరీ డాక్టర్ ‘ దిశ’ ని అమానుషంగా అత్యాచారం చేసి, షాద్ నగర్ లో చంపేసి, మృతదేహం పై కూడా అఘాయిత్యం చేశారు అన్న వార్తలు దేశవ్యాప్తంగా ప్రజలను కలచివేశాయి. ప్రత్యేకంగా హైదరాబాద్లో నివసించే వారిలో భద్రత మీద భయాందోళనలు కలిగాయి. అయితే ఆరోజు తెల్లవారుజామున షాద్ నగర్ పోలీసులు సీన్ రీ కన్స్ట్రక్షన్ చేస్తుండగా నిందితులు పారిపోవడానికి ప్రయత్నించారని, పోలీసుల మీద రాళ్లు వేయడానికి ప్రయత్నించారని, తుపాకులు కూడా లాక్కోవడానికి ప్రయత్నించారని, ఆ సందర్భంగా ఆత్మరక్షణ కోసం వారి మీద కాల్పులు జరపాల్సి వచ్చిందని, ఆ కాల్పుల్లో నలుగురు చనిపోయారు అని పోలీసులు చెప్పారు.
అక్కడ జరిగింది ఏమైనప్పటికీ, దిశ కుటుంబానికి న్యాయం జరిగిందని ఆమె ఆత్మకు శాంతి చేకూరిందని ప్రజల నుండి స్పందన వస్తోంది. ప్రస్తుతం పోలీసులపై కూడా కేసు నమోదయింది ఈ వ్యవహారం ఇప్పుడు హైకోర్టులో చివరి దశలో ఉంది. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ సంఘటన షాద్ నగర్ ప్రాంతానికి సంబంధం ఉండడంతో మరోసారి ఈ ప్రాంతం వార్తల్లోకి ఎక్కింది.
*ప్రతికారెచ్చతో.. ఎన్నొ ఎన్నెన్నో..*
షాద్ (షాక్) నగర్ ప్రాంతంలో శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం పుణ్యమా అని ఇక్కడ రియల్ ఎస్టేట్ వ్యాపారం పుంజుకుంది. ఆ క్రమంలో రాయికల్ గ్రామానికి చెందిన అప్పటి ప్రముఖ రియల్ వ్యాపారి చల్మారెడ్డిని పట్టణానికి చెందిన వెంకట్రాంరెడ్డి కిడ్నాప్ చేసి గుంటూరులో దారుణంగా హత్య చేశాడు. ఈ సందర్భంగా వెంకట్రాం రెడ్డికి అనంతపూర్ హంతకముఠాకు సఖ్యత ఏర్పడింది. చాలా కాలం పాటు వారితోనే ప్రయాణం సాగించిన వెంకటరామిరెడ్డి అనూహ్య రీతిలో ఆ హంతకముఠా చేతిలోనే అనంతపూర్ లో దారుణ హత్యకు గురయ్యాడు. ఆ తర్వాత.. దీనికి ప్రతీకారంగా మరో జంట హత్యలు షాద్ నగర్ అన్నారం జంక్షన్ వద్ద చోటుచేసుకున్నాయి. వెంకటరామిరెడ్డిని దారుణంగా హత్య చేసిన వారిని కొంతమంది షాద్ నగర్ లో చర్చల పేరిట పిలిచి ఇక్కడ మాటు వేసి నరికి చంపారు.
ప్రస్తుతం ఈ కేసు కూడా ఆరోపణలు ఎదుర్కొన్న రాయికల్ మోహన్ రెడ్డి పై కేసు ధర్మాసనం కొట్టేసింది. ఇకపోతే ఫ్యాక్షనిస్ట్ పరిటాల రవి అనుచరుడిని గతంలో నందిగామలో దారుణంగా హత్య చేశారు. ఇంకా చిల్లర మల్లర ఘటనల్లో ఎన్నో హత్యలు జరిగి ఈ ప్రాంతం నేరమయంగా మారింది.
గ్యాంగ్ స్టర్ నయుం ఎన్కౌంటర్ తర్వాత షాద్ నగర్ నియోజకవర్గం పాలమురు జిల్లా నుండి మినహాయించారు. రంగారెడ్డి జిల్లాలో విలీనం చేస్తూ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. సైబరాబాద్ పోలీస్ పరిధిలో షాద్ నగర్ ప్రాంతాన్ని ఏర్పాటు చేసింది. నేరాల నేర స్థావరంగా ఈ ప్రాంతం మారిందని దీనిపై కంట్రోల్ చేయడానికి మానిటరింగ్ వ్యవస్థ ఏర్పాటు చేసి సైబరాబాద్ పోలీస్ పరిధిలో చేర్చారు.
*కరుణాకర్ రెడ్డి హత్యతో తాజాగా...*
రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ నియోజకవర్గం కొత్తూరు మండలం మల్లాపూర్ గ్రామానికి చెందిన దస్తావేజు లేఖరి కరుణాకర్ రెడ్డిని అదే గ్రామానికి చెందిన మండల ఎంపీపీ పిన్నింటి మధుసూదన్ రెడ్డి అతని సోదరులు మరో ఇద్దరు కలిసి అతన్ని కిడ్నాప్ చేసి ఇటీవలే దారుణంగా హతమార్చారు. నిన్ననే దీనికి సంబంధించి ఎంపీపీ మధుసూదన్ రెడ్డి మరికొంతమందిని శంషాబాద్ పోలీసులు అరెస్టు చేసి రిమాండ్ కు తరలిస్తున్నారు.
ఈ వ్యవహారం కూడా రాష్ట్రవ్యాప్తంగా దుమారం రేపింది. ప్రధాన నిందితుడు మండల ఎంపీపీ కావడంతో తెలుగు రాష్ట్రాల దృష్టి ఈ సంఘటనపై పడింది. నేరస్తులను అరెస్టు చేయాలని ప్రతిపక్ష నేతలు ధర్నాలు ఆందోళనలు చేయడంతో ఈ సంఘటన సంచలనంగా మారింది. ఈ కేసులో ఇంకా కొన్ని సంచలన కోణాలు ఉన్నట్టు మీడియా దృష్టికి తెస్తున్నారు. త్వరలోనే వాటికి సంబంధించి కూడా ప్రజల ముందుకు సమాచారం రాబోతుంది.
ఏది ఏమైనప్పటికీ మినీ ఇండియాగా పేరుగాంచిన ఈ ప్రాంతంలో ఎంతోమంది నేరగాళ్లకు ఆవాసంగా మారింది. గతంలో మంచినీళ్ల కులాయి వద్ద వలస కార్మికులు ఘర్షణపడి తపంచాలు బయటికి తీసి సంచలనం సృష్టించిన కేసులు కూడా ఉన్నాయి. ఇంకా కొత్తూరు మండలానికి చెందిన మరో మాజీ ప్రజాప్రతినిధి సైతం తన కుటుంబ వ్యవహారంలో హత్య కేసులో చిక్కుకున్నప్పుడు రాష్ట్రవ్యాప్తంగా అందరి దృష్టి ఈ ప్రాంతాన్ని ఆకర్షించింది. ఓ రౌడీ షీటర్ ను హైదరాబాద్ లో హత్య చేసిన విషయంలో కొత్తూరు మాజీ ప్రజాప్రతినిధి హస్తం ఉందని అప్పట్లో అరెస్టు చేశారు. ఆ తర్వాత ఈ కేసు కూడా ధర్మాసనం కొట్టివేసింది.
Tags
News@jcl.
