గోదావరి పుష్కరాలకు లోగో, ట్యాగ్‌లైన్ పోటీలు!
లక్ష రూపాయల బహుమతి
తెలంగాణ: వచ్చే ఏడాది జరగనున్న గోదావరి పుష్కరాలను విజయవంతంగా నిర్వహించేందుకు తెలంగాణ ప్రభుత్వం ఇప్పటి నుంచే భారీ ఏర్పాట్లకు శ్రీకారం చుట్టింది. పుష్కరాల ప్రత్యేకతను ప్రతిబింబించేలా అధికారిక లోగో, ట్యాగ్‌లైన్ రూపొందించేందుకు ప్రజల నుంచి ఎంట్రీలను ఆహ్వానిస్తోంది.
రాష్ట్ర దేవాదాయ శాఖ ఈ మేరకు పోటీల నిర్వహణపై ప్రకటన జారీ చేసింది. గోదావరి నది చారిత్రక ప్రాధాన్యం, ఆధ్యాత్మిక విశిష్టత, పుష్కరాల ఆచారాలు, సంస్కృతి, సంప్రదాయాలు ప్రతిబింబించేలా డిజైన్లు రూపొందించాలని సూచించింది.
లోగో, ట్యాగ్‌లైన్ పోటీలు.. భారీ బహుమతులు
ఆసక్తి ఉన్నవారు తెలుగు, ఆంగ్ల భాషల్లో లేదా రెండు భాషల్లోనూ తమ ప్రతిపాదనలు పంపించవచ్చు. ఉత్తమంగా ఎంపికైన మూడు ఎంట్రీలకు నగదు బహుమతులు అందించనున్నారు.
పోటీలకు సంబంధించిన పూర్తి వివరాలు, నిబంధనలు, ఎంట్రీలు పంపించే విధానం దేవాదాయ శాఖ అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంటాయని అధికారులు తెలిపారు.
https://endowments.ts.nic.in
8 కోట్ల మంది భక్తులు వచ్చే అవకాశం
2027 గోదావరి పుష్కరాలకు సుమారు 8 కోట్ల మంది భక్తులు తరలివచ్చే అవకాశం ఉందని దేవాదాయ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ భారీ జనసందోహానికి అనుగుణంగా సౌకర్యాలు కల్పించేందుకు ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణ రూపొందిస్తోంది.
పుష్కరాల సన్నద్ధత, వివిధ శాఖల మధ్య సమన్వయంపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజూ ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులు పుష్కరాల నిర్వహణకు సంబంధించిన ప్రణాళికను పవర్‌పాయింట్ ప్రజంటేషన్ ద్వారా వివరించారు.
67 ప్రాంతాల్లో పుష్కర ఏర్పాట్లు
పుష్కరాల సమయంలో భక్తుల రద్దీని సమర్థంగా నిర్వహించేందుకు రాష్ట్రవ్యాప్తంగా 67 ప్రాంతాలను గుర్తించినట్లు దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా రామయ్యర్ వెల్లడించారు.
భక్తుల సంఖ్య, ఆయా ప్రాంతాల ప్రాధాన్యత ఆధారంగా మూడు విభాగాలుగా వర్గీకరించి, ప్రతి ప్రాంతంలో అవసరమైన సదుపాయాల కల్పనకు ప్రత్యేక కార్యాచరణ రూపొందిస్తున్నట్లు తెలిపారు.
గోదావరి పుష్కరాలు
పుష్కరాల సందర్భంగా ఘాట్ల నిర్మాణం, మౌలిక వసతుల కల్పన, ఇంజినీరింగ్ పనులన్నీ నిర్దేశిత సమయంలో పూర్తి చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అధికారులను ఆదేశించారు.
ఘాట్ల అభివృద్ధికి రూ.1,000 కోట్లు
గోదావరి నది ప్రవహించే తెలంగాణ ప్రాంతాల్లో భక్తులకు సౌకర్యవంతమైన స్నానఘాట్లు అందుబాటులోకి తీసుకురావడంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టింది.
ఉమ్మడి కరీంనగర్, ఖమ్మం జిల్లాలతోపాటు నది పరివాహక ప్రాంతాల్లో కొత్త ఘాట్ల నిర్మాణం, ఇప్పటికే ఉన్న ఘాట్ల అభివృద్ధి పనులు చేపడుతోంది.
పుష్కరాలకు ముందే నిర్మాణ పనులు పూర్తి చేసి భక్తులకు అవసరమైన సదుపాయాలను అందుబాటులోకి తీసుకురావాలని అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు.