బాలీవుడ్‌లో కాంట్రవర్సీకి కేరాఫ్ అడ్రస్‌గా నిలిచే నటి, ఎంపీ కంగనా రనౌత్ మరోసారి హాట్ టాపిక్‌గా మారారు. జాతీయ గేయం 'వందేమాతరం'పై సీనియర్ నటి షర్మిలా టాగూర్ చేసిన వ్యాఖ్యలపై కంగనా తీవ్రంగా స్పందించారు.
ఒక నటిగా ఆమె అభిప్రాయాల్లో ఇంత సంకుచితంగా, కృత్రిమంగా ఉండటం తనకు షాక్ కలిగించిందంటూ కంగనా ఘాటు వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం ఈ ఇద్దరి భామల మధ్య డిబేట్ నెట్టింట పెద్ద దుమారం రేపుతోంది.
వివాదం ఎక్కడ మొదలైందంటే...
ఈ వివాదం యాదృచ్ఛికంగా రాలేదు. స్వాతంత్ర్య దినోత్సవం తర్వాత 'వందేమాతరం' పూర్తి గీతం, మొదటి రెండు చరణాలపై రాజకీయ చర్చకు దారితీసింది. ఇప్పుడు సినీ నటి షర్మిలా టాగూర్ స్పందించడంతో మరోసారి హాట్ టాపిక్‌గా మారింది.
'వందేమాతరం'లో కాళీ, దుర్గ వంటి దేవతల ప్రస్తావన ఉండే చరణాలు ఉన్నాయని, ఏకేశ్వరోపాసన పాటించే ఇతర మతస్థులకు వాటిని ఆలపించడం కాస్త ఇబ్బందిగా ఉండొచ్చని షర్మిలా టాగూర్ అభిప్రాయపడ్డారు.
అందుకే దేశంలోని అన్ని వర్గాల ప్రజలను కలుపుకొనిపోవడానికి మొదటి రెండు చరణాలకే పరిమితం చేయడం సరైనదని ఆమె ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పేర్కొన్నారు.
షర్మిలకు కంగనా కౌంటర్
ఈ వ్యాఖ్యలపై కంగనా సోషల్ మీడియా వేదికగా గట్టిగా రియాక్ట్ అయ్యారు. "షర్మిలాజీపై నాకు గౌరవం ఉంది. కానీ, ఒక ఆర్టిస్ట్ అయి ఉండి ఆమె ఆలోచనలు ఇంత సంకుచితంగా ఉండటం నన్ను షాక్‌కు గురిచేసింది" అంటూ స్పందించారు.
సాహిత్యంలో, కవిత్వంలో ఉపయోగించే పదాలు కేవలం రూపకాలని కంగనా పేర్కొన్నారు. బంకించంద్ర చట్టోపాధ్యాయ రాసిన 'వందేమాతరం' స్వాతంత్ర్య పోరాట స్ఫూర్తికి ప్రతీక అని, మనలో దాగి ఉన్న 'శక్తి'ని మేల్కొలపడానికి ఆయన ఆ పదాలను ఉపయోగించారని అన్నారు.
దాన్ని కేవలం ఒక మతపరమైన పూజగా చూడకూడదని కంగనా వ్యాఖ్యానించారు.
ఒకరినొకరు ప్రేమిద్దాం
అంతటితో ఆగకుండా స్వామి వివేకానందను ఉదాహరణగా చూపిస్తూ కంగనా రనౌత్ మరో ఆసక్తికరమైన వ్యాఖ్య చేశారు. "ఇనుప కండరాలు, ఉక్కు నరాలు, నరాల్లో ఉరుములు ప్రవహించే యువత నాకు కావాలి" అని వివేకానంద అన్నప్పుడు ఆయన ఏమైనా వెదర్ రిపోర్ట్ ఇచ్చారా? అని ప్రశ్నించారు.
యువతలోని పవర్‌ను పెంచడానికే అలాంటి పదాలను ఉపయోగించారని కంగనా పేర్కొన్నారు. డాక్టర్లు కూడా శక్తిని 'పవర్' అనే అంటారని ఆమె వ్యాఖ్యానించారు.
అందుకే హిందూ-ముస్లిం మైండ్‌సెట్ నుంచి బయటకు వచ్చి అందరూ ఒకరినొకరు కౌగిలించుకుని ప్రేమగా ఉండాలని కంగనా పిలుపునిచ్చారు.
షర్మిలా టాగూర్ వాదనను ఖండిస్తూనే, చివరికి ఆమెపై తనకు ఎప్పటికీ అభిమానం ఉంటుందని చెబుతూ కంగనా తన పోస్ట్‌ను ముగించారు.