🗳️ జడ్చర్ల గురుకులంలో ప్రజాస్వామ్య పండుగ..! విద్యార్థులతోనే ఎన్నికలు – నిజమైన ఎలక్షన్ వాతావరణం
జడ్చర్ల, జూలై 7:
జడ్చర్ల మండలంలోని చిట్టి బోయినపల్లి సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల పాఠశాల, కళాశాలలో మంగళవారం స్కూల్ కౌన్సిల్ ఎన్నికలు అత్యంత ఉత్సాహభరితంగా, ప్రజాస్వామ్య స్ఫూర్తిని ప్రతిబింబించేలా నిర్వహించారు.
ప్రతి సంవత్సరం అకాడమిక్ క్యాలెండర్ ప్రకారం నిర్వహించే ఈ ఎన్నికల్లో స్కూల్ కెప్టెన్, వైస్ కెప్టెన్, డిసిప్లిన్ కెప్టెన్, కల్చరల్ కెప్టెన్, హెల్త్ కెప్టెన్, స్పోర్ట్స్ కెప్టెన్, లిటరరీ కెప్టెన్ తదితర పదవులకు ఎన్నికలు జరిగాయి.
ఈ ఎన్నికలను సాధారణ అసెంబ్లీ ఎన్నికల తరహాలో నిర్వహించడం విశేషం. నోటిఫికేషన్ విడుదల నుంచి నామినేషన్ల స్వీకరణ, బ్యాలెట్ పేపర్ల ముద్రణ, పోలింగ్ బూత్ల ఏర్పాటు, పోలింగ్ నిర్వహణ వరకు ప్రతి ప్రక్రియను ఎన్నికల నియమావళి ప్రకారమే చేపట్టారు. ముఖ్యంగా విద్యార్థులనే పోలింగ్ సిబ్బందిగా నియమించి వారికి బాధ్యతలు అప్పగించడం ద్వారా ప్రజాస్వామ్య వ్యవస్థపై ప్రత్యక్ష అవగాహన కల్పించారు.
విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొని తమ ఓటు హక్కును వినియోగించుకోవడం విశేషం. నాయకత్వ లక్షణాల పెంపొందనతో పాటు ప్రజాస్వామ్య విలువలు, ఓటు హక్కు ప్రాముఖ్యత, సామాజిక బాధ్యతపై విద్యార్థుల్లో చైతన్యం కల్పించడమే ఈ ఎన్నికల ప్రధాన ఉద్దేశమని కళాశాల ప్రిన్సిపాల్ శ్రీమతి కవితా స్రవంతి తెలిపారు.
నిజమైన ఎన్నికల వాతావరణాన్ని సృష్టించి కార్యక్రమాన్ని విజయవంతం చేసిన సోషల్ డిపార్ట్‌మెంట్ ఉపాధ్యాయులు శ్రీరంగ రాజేశ్వరి, తబసుం, స్రవంతితో పాటు సహకరించిన ఉపాధ్యాయ బృందాన్ని ఆమె ప్రత్యేకంగా అభినందించారు.
ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపల్స్ భవాని, విద్యావతి, అలాగే మాధవి, రాజకుమారి, ప్రశాంతి, అయిషా తదితరులు పాల్గొన్నారు.
ఓట్ల లెక్కింపు పూర్తయ్యాక ఎన్నికైన విద్యార్థి నాయకుల ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని బుధవారం నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.