Iran-USA War| ఇంటర్నెట్‌డెస్క్: పశ్చిమాసియా మరోసారి దద్దరిల్లుతోంది. ఇరాన్ లక్ష్యంగా అమెరికా మరో 60 రోజులు దాడులు చేయనున్నట్లు తెలుస్తోంది. ఆ దేశంపై అమెరికా బలగాలు మళ్లీ యుద్ధాన్ని ప్రారంభించాయని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అమెరికా పార్లమెంట్ (కాంగ్రెస్)కు తెలియజేశారు. ఈ మేరకు వార్ పవర్స్ నోటీసు ఇచ్చారు. జులై 7న యుద్ధం ప్రారంభ తేదీగా అందులో పేర్కొన్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు అంతర్జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి. ‘‘అమెరికా ప్రజలను, జాతీయ భద్రత, విదేశాంగ విధాన ప్రయోజనాలను పరిరక్షించడం నా బాధ్యత. దానికి అనుగుణంగానే సైనిక చర్యకు ఆదేశించాను’’ అని ట్రంప్ (Donald Trump) ఆ నోటీసులో పేర్కొన్నారు.
60 రోజుల డెడ్‌లైన్ ఏంటి..?
అమెరికా (USA) నిబంధనల ప్రకారం.. యుద్ధాన్ని ప్రకటించే అధికారం కేవలం అగ్రరాజ్య పార్లమెంట్ (కాంగ్రెస్)కు మాత్రమే ఉంది. అధ్యక్షుడికి లేదు. అందుకే... అమెరికా అధ్యక్షులు ఏ దేశంపై పోరుకు వెళ్లినా తాము సైనిక చర్య చేపట్టాం అని చెప్తుంటారు. అమెరికన్ కాంగ్రెస్ ఆమోదం పొందకుండా సైన్యాన్ని అలా వాడటానికి వారికున్న గరిష్ఠ గడువు 60 రోజులే. మామూలుగా శత్రు భూభాగంలోకి తమ సైనిక దళాలను పంపిన 48 గంటల్లోగా కాంగ్రెస్‌కు ఆ విషయాన్ని అధ్యక్షుడు తెలపాలి. 60 రోజుల్లోగా కాంగ్రెస్ ఆమోదం తెలపాల్సి ఉంటుంది. లేదంటే ఆలోగా సైనిక చర్య ఆగిపోవాలి. యుద్ధాన్ని విరమించి సైనికులను సురక్షితంగా తెచ్చేందుకని చెప్పి మరో 30 రోజుల గడువు తీసుకోవచ్చు.
ట్రంప్ ట్యాక్స్: హర్మూజ్‌లో ఒక్కో ట్యాంకర్‌కు రూ.287 కోట్లు చెల్లించాలా..!
ఫిబ్రవరి 28న ఇరాన్ (Iran)పై అమెరికా, ఇజ్రాయెల్ దాడులు ప్రారంభించాయి. అప్పుడు 60 రోజుల డెడ్‌లైన్ మే ఒకటితో ముగిసింది. పలు దేశాల మధ్యవర్తిత్వంతో అమెరికా, ఇరాన్ అవగాహన ఒప్పందంపై సంతకం చేశాయి. దాంతో తొలిదఫాలో ప్రారంభించిన సైనిక చర్య అక్కడితో ఆగిపోయిందని ట్రంప్ ప్రభుత్వం చెప్పింది. తాజా ఘర్షణలతో కొత్తగా మళ్లీ సైనిక చర్యను ప్రారంభించేందుకు అవకాశం ఉందని సమర్థించుకుంటోంది. కానీ రాజ్యాంగ నిపుణులు ఈ వాదనను ఖండిస్తున్నారు. అనధికారిక, శాశ్వత యుద్ధాన్ని కొనసాగించేందుకు ఈ తాత్కాలిక దౌత్య విరామాలను ఒక ఎత్తుగడగా ఉపయోగించుకుంటున్నారని విమర్శిస్తున్నారు.