జెర్రిపోతు పాముల సయ్యాట కోసం కొట్లాట..!


 

సయ్యాట కోసం కొట్లాట..!

జెర్రిపోతు పాముల అరుదైన కంబాట్ ఫైటింగ్‌కు తెలంగాణ బొటానికల్ గార్డెన్ వేదిక

జడ్చర్ల, జూన్ 27: ప్రకృతిలో సంతానోత్పత్తి కోసం జరిగే పోటీకి నిదర్శనంగా రెండు మగ జెర్రిపోతు పాములు శనివారం ఉదయం అరుదైన "కంబాట్ ఫైటింగ్"లో పాల్గొన్న ఘటన జడ్చర్లలోని డాక్టర్ బూర్గుల రామకృష్ణారావు ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రాంగణంలోని తెలంగాణ బొటానికల్ గార్డెన్‌లో సందర్శకులను ఆశ్చర్యానికి గురిచేసింది.

సర్ప రక్షకుడు డాక్టర్ బి. సదాశివయ్య తెలిపిన వివరాల ప్రకారం, జెర్రిపోతు పాముల్లో సాధారణంగా మే, జూన్, జూలై నెలలు ప్రత్యుత్పత్తి కాలం. ఈ సమయంలో ఆడ జెర్రిపోతు ప్రత్యేకమైన ఫెరోమోన్ (వాసన సంకేతం) విడుదల చేస్తుంది. ఆ వాసనకు ఆకర్షితులై సమీపంలోని మగ జెర్రిపోతులు అక్కడికి చేరుకుంటాయి.

ఒకటి కంటే ఎక్కువ మగ పాములు వచ్చినప్పుడు ఆడ పామితో సంభోగించే హక్కు కోసం వాటి మధ్య పోటీ ప్రారంభమవుతుంది. ఈ పోటీలో రెండు మగ పాములు ఒకదానికొకటి పెనవేసుకుని శరీరంలోని ముందుభాగాన్ని పైకి లేపి, భూమికి తాకకుండా ఒకదానిని మరొకటి కిందకు నెట్టేందుకు ప్రయత్నిస్తాయి. ఈ పోరు కొన్నిసార్లు గంటలపాటు కొనసాగుతుంది. ఈ ప్రవర్తనను శాస్త్రీయంగా "కంబాట్ ఫైటింగ్ (Combat Fighting)" అని పిలుస్తారు.

ఈ పోరులో ఓడిపోయిన మగ పాము అక్కడి నుంచి వెళ్లిపోగా, గెలిచిన పాము ఆడ జెర్రిపోతుతో సంభోగంలో పాల్గొంటుందని డాక్టర్ సదాశివయ్య వివరించారు.

ఇలాంటి అరుదైన దృశ్యాలు సాధారణంగా ప్రత్యుత్పత్తి కాలమైన మే నుంచి జూలై వరకు బహిరంగ ప్రదేశాలు, పొదలు, వ్యవసాయ క్షేత్రాలు, ఉద్యానవనాల్లో కనిపిస్తాయని ఆయన తెలిపారు.

ప్రకృతి వైవిధ్యాన్ని కళ్లారా వీక్షించే అవకాశం కల్పించిన ఈ ఘటనను చూసిన విద్యార్థులు, ప్రకృతి ప్రేమికులు ఆసక్తిగా తిలకించారు.

Previous Post Next Post

نموذج الاتصال

💬 Chat 📢 Follow