పాలమూరు జిల్లా మహబూబ్‌నగర్‌లో అఖిలభారతీయ అయ్యప్ప సేవా సమితి ఆధ్వర్యంలో జరిగిన అయ్యప్ప ఇంటింటి భజన కార్యక్రమం భక్తి వాతావరణంలో జరిగింది. అయ్యప్ప నామస్మరణతో భక్తులు ఆధ్యాత్మిక ఆనందంలో తరించిపోయారు.
మహబూబ్‌నగర్ (పాలమూరు):
పాలమూరు జిల్లా కేంద్రంలో అఖిలభారతీయ అయ్యప్ప సేవా సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన అయ్యప్ప ఇంటింటి భజన కార్యక్రమం భక్తి వాతావరణంలో వైభవంగా జరిగింది.
బుధవారం ఉత్తర నక్షత్రం సందర్భంగా బద్రి గురుస్వామి నివాసం వద్ద ఉన్న ఆలయంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అయ్యప్ప నామస్మరణతో జరిగిన భజన కార్యక్రమంలో పాల్గొన్న భక్తులు ఆధ్యాత్మిక ఆనందంలో తరించిపోయారు.
అఖిలభారతీయ అయ్యప్ప సేవా సమితి భజన మండలి సభ్యులు మాట్లాడుతూ…
ప్రతి బుధవారం రోజున అయ్యప్ప మాల ధరించిన భక్తుల ఇంట్లో లేదా ఆసక్తి ఉన్న ఎవరి ఇంట్లో అయినా అయ్యప్ప భజన కార్యక్రమం నిర్వహించవచ్చని తెలిపారు.
ఈ కార్యక్రమం ప్రతి బుధవారం సాయంత్రం 7:30 గంటల నుంచి 9:30 గంటల వరకు రెండు గంటల పాటు జరుగుతుందని చెప్పారు. ఈ భజన కార్యక్రమాలను నిర్వహించడానికి మహబూబ్‌నగర్ జిల్లా అయ్యప్ప భజన మండలి అందుబాటులో ఉంటుందని వెల్లడించారు.
ప్రతి ఇంటికీ అయ్యప్ప స్వామిని చేర్చడమే తమ ప్రధాన లక్ష్యమని తెలిపారు. అలాగే సనాతన ధర్మం మరియు భగవద్గీత బోధనలను ప్రజల్లో విస్తృతంగా ప్రచారం చేయడమే ఉద్దేశమని పేర్కొన్నారు.
భగవద్గీత అనేది చనిపోయిన వారి దగ్గర పెట్టే పుస్తకం కాదని, మనిషి బ్రతికి ఉన్నప్పుడు ఎలా జీవించాలో మార్గనిర్దేశం చేసే గొప్ప గ్రంథమని వివరించారు. ఉన్నత విలువలతో కూడిన జీవితం గడపాలంటే జీవితంలో భగవద్గీతను అనుసరించడం తప్పనిసరి అని చెప్పారు.
ఈ సందర్భంగా భజన కార్యక్రమం అనంతరం భగవద్గీత ప్రాముఖ్యతపై అఖిలభారతీయ అయ్యప్ప సేవా సమితి భజన మండలి సభ్యులు ప్రత్యేకంగా ప్రసంగించారు.