సైబర్ నేరగాళ్ల ఆగడాలకు అడ్డూ అదుపూ లేకుండా పోతోంది. ఏదో ఒక రూపంలో అమాయకులను కొల్లగొడుతూనే ఉన్నారు.
మాజీ డీజీపీ మనుమరాలి వాట్సాప్ డీపీ
- ఫొటోతో ఆమె అకౌంటెంట్‌కు సందేశం
- 1.20 కోట్లు కొట్టేసిన సైబర్ నేరగాళ్లు
- విదేశీ ఉద్యోగం పేరిట ఓ యువకుడికి
- రూ.10.15 లక్షలకు కుచ్చుటోపీ
- ఓటీపీ, ఫోన్ ధ్రువీకరణ లేకుండా ఓ
- వ్యక్తి ఖాతా నుంచి రూ.40 లక్షల బదిలీ
- సైబరాబాద్ పరిధిలో 3 రోజుల్లో 7 కేసులు
- రూ.1.55 కోట్లు కాజేసిన కేటుగాళ్లు
సైబర్ నేరగాళ్ల ఆగడాలకు అడ్డూ అదుపూ లేకుండా పోతోంది. ఏదో ఒక రూపంలో అమాయకులను కొల్లగొడుతూనే ఉన్నారు. ఈ క్రమంలో ప్రముఖ వ్యాపారవేత్త అయిన ఓ మాజీ డీజీపీ మనుమరాలికి టోకరా వేసిన సైబర్ నేరగాళ్లు ఆమె అకౌంటెంట్‌ను బురిడీ కొట్టించి రూ.1.20 కోట్లు కాజేశారు. మరోపక్క, డబ్బు మీద అత్యాశతో కొందరు సైబర్ నేరగాళ్ల వలలో పడి తమ కష్టార్జితాన్ని పోగొట్టుకున్నారు. సైబరాబాద్ పోలీసు కమిషనరేట్ పరిధిలో 3 రోజుల్లో ఏడు కేసులు నమోదయ్యాయి. ఈ కేసుల్లో బాధితులు రూ.1.55 కోట్ల మేర పోగొట్టుకున్నారు.
మార్చి 13న బాధితురాలి ఫొటో డీపీగా ఉన్న నంబర్ నుంచి కంపెనీ అకౌంటెంట్ వాట్సాప్‌కు సందేశం వచ్చింది. తాను ముఖ్యమైన సమావేశంలో ఉన్నానని, తాను చెప్పిన ఖాతాకు వెంటనే రూ.1.20 కోట్లు బదిలీ చేయాలని అందులో ఉంది. మెసేజ్ తమ డైరెక్టర్ నుంచి వచ్చిందని భావించిన అకౌంటెంట్ వెంటనే డబ్బు బదిలీ చేశాడు.
తరువాత మళ్లీ సందేశం రావడంతో డైరెక్టర్‌ను సంప్రదించగా మోసం బయటపడింది. వెంటనే 1930కు ఫిర్యాదు చేయగా పోలీసులు ప్రత్యేక టీమ్‌ను ఏర్పాటు చేశారు.
పెట్టుబడులు.. అధిక లాభాల పేరిట మాయ
కూకట్‌పల్లికి చెందిన ఓ వ్యక్తిని టెలిగ్రామ్ ద్వారా సంప్రదించి ట్రేడింగ్ పెట్టుబడుల పేరుతో రూ.30,47,000 మోసం చేశారు. చందానగర్‌కు చెందిన మరో ఉద్యోగి నుంచి రూ.10.15 లక్షలు కాజేశారు.
20.98 లక్షలు పోగొట్టుకున్న సాఫ్ట్‌వేర్ ఇంజినీర్
ఫారెక్స్ ట్రేడింగ్ పేరుతో ఓ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌ను రూ.20.98 లక్షలు మోసం చేశారు. వెబ్‌సైట్‌లో లాభాలు చూపించినా డబ్బు విత్‌డ్రా చేయలేకపోయాడు.
యాక్సిస్, ఐసీఐసీఐ పేర్లతో మోసాలు
యాక్సిస్ బ్యాంక్ లోగోతో పెట్టుబడుల మాయలో రూ.27.74 లక్షలు మోసం చేశారు. అమీన్‌పూర్‌కు చెందిన రిటైర్డ్ ఇంజనీర్ రూ.16.10 లక్షలు పోగొట్టుకున్నాడు.
ఓటీపీ లేకుండా బ్యాంకు ఖాతాలో రూ.40 లక్షలు బదిలీ
పుప్పాలగూడకు చెందిన వ్యాపారవేత్త ఖాతా నుంచి ఓటీపీ లేకుండా రూ.40 లక్షలు బదిలీ అయ్యాయి.
విదేశీ ఉద్యోగం పేరుతో రూ.10.15 లక్షల మోసం
విదేశీ ఉద్యోగం పేరుతో ఓ యువకుడిని మోసం చేసి రూ.10.15 లక్షలు కాజేశారు. వీసా ప్రక్రియ పేరుతో వేర్వేరు ఖాతాల్లో డబ్బులు జమ చేయించి మోసం చేశారు.