మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్ల పట్టణంలో ఓ దారుణ ఘటన వెలుగు చూసింది. లిఫ్ట్ అడిగిన మహిళపై ఇద్దరు యువకులు సామూహిక అత్యాచారం చేసినట్లు ఆరోపణలు వెలువడ్డాయి.
స్థానికుల సమాచారం ప్రకారం… మంగళవారం సాయంత్రం జడ్చర్ల పట్టణానికి చెందిన ఓ మహిళ రోడ్డుపై వెళ్తున్న బైక్‌ను ఆపి లిఫ్ట్ కోరింది. బైక్‌పై ఉన్న ఇద్దరు యువకులు ఆమెను ఎక్కించుకుని కొంత దూరం వెళ్లిన తర్వాత మున్సిపాలిటీ పరిధిని దాటి బైక్‌ను నిర్మానుష్య ప్రాంతానికి మళ్లించినట్లు సమాచారం.
అక్కడికి తీసుకెళ్లిన తరువాత ఇద్దరు యువకులు మహిళపై వరుసగా అత్యాచారం చేసినట్లు బాధితురాలు తెలిపింది. వారి నుంచి తప్పించుకుని వచ్చిన మహిళ నేరుగా జడ్చర్ల పోలీస్ స్టేషన్ కు చేరుకుని ఫిర్యాదు చేసింది.
దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు మహిళ చెప్పిన వివరాల ఆధారంగా సీసీ కెమెరా ఫుటేజ్ పరిశీలిస్తూ నిందితుల కోసం పట్టణ పరిసర ప్రాంతాల్లో గాలింపు చర్యలు చేపట్టారు.
ఈ ఘటన వెలుగు చూడడంతో జడ్చర్ల పట్టణంలో ఒక్కసారిగా ఆందోళన నెలకొంది. ప్రశాంతంగా ఉండే పట్టణంలో ఇలాంటి దారుణం ఎలా జరిగిందన్న దానిపై స్థానికులు చర్చించుకుంటున్నారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా వెలుగులోకి రావాల్సి ఉంది.