Hyderabad City: హైదరాబాద్‌లో కొత్త రవాణా వ్యవస్థ.. రంగంలోకి పాడ్ ట్యాక్సీలు, ఏయే ప్రాంతాల్లో


 Hyderabad City:  హైదరాబాద్ సిటీలో రోజు రోజుకూ ట్రాఫిక్ సమస్య తీవ్రమవుతోంది. బస్సులు, మెట్రోలు పెంచినా రద్దీ పెరుగుతూనే ఉంది. ట్రాఫిక్ సమస్యను అధిగమించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం దృష్టి సారించింది. మెట్రో ప్రయాణికులకు మెరుగైన కనెక్టివిటీ అందించేందుకు చర్యలు చేపడుతోంది.ఈ నేపథ్యంలో పర్సనలైజ్డ్ ర్యాపిడ్ ట్రాన్సిట్ సిస్టమ్-PRTS లేకుంటే పాడ్ ట్యాక్సీలను ప్రవేశ పెట్టాలని ఆలోచన చేస్తోంది. దీనికి సంబంధించి తెర వెనుక అంతా రెడీ అవుతోంది. ఈ ప్రాజెక్టు సాధ్యాసాధ్యాల అధ్యయనం చేసేందుకు హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్ టెండర్లను ఆహ్వానించింది.

హైదరాబాద్‌లో కొత్త రవాణా వ్యవస్థ

హైదరాబాద్ సిటీకి ప్రతీ రోజూ లక్షలాది మంది తమ పనుల కోసం వస్తుంటారు. ముఖ్యంగా ఐటీ కారిడార్, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, సచివాలయం వంటి ప్రాంతాలు నిత్యం రద్దీగా ఉంటాయి. ఉదయం 9 గంటల నుంచి మొదలైన ట్రాఫిక్ రాత్రి వరకు కంటిన్యూ అవుతోంది. రద్దీ ప్రాంతాల్లో కొత్త రవాణా వ్యవస్థను ఏర్పాటు చేయాలని భావిస్తోంది ప్రభుత్వం.

మెట్రో స్టేషన్ల నుంచి తమ తమ ఆఫీసులు ఉద్యోగులు సులభంగా చేరుకునేలా పాడ్ ట్యాక్సీలను ఏర్పాటు చేయాలని ఆలోచన చేస్తోంది. హైటెక్స్, రాయదుర్గం, సైబర్ టవర్స్, పంజాగుట్ట మీదుగా జూబ్లీహిల్స్ చెక్ పోస్టు వంటి ఏరియాల్లో ట్రాఫిక్‌లో చిక్కుకోకుండా నేరుగా గమ్యస్థానాలకు చేరడం కొత్త రవాణా వ్యవస్థ యొక్క ముఖ్య ఉద్దేశం.

రంగంలోకి పాడ్ ట్యాక్సీలు, ఏయే ప్రాంతాల్లో

ఈ కొత్త రవాణా వ్యవస్థ ఏంటి. పాడ్ ట్యాక్సీలు అనేవి డ్రైవర్ లేకుండా నడిచేవి. విద్యుత్‌తో నడిచే చిన్నపాటి కార్లు చెబుతుంటారు. ఎలివేటెడ్ ట్రాక్‌లపై మాత్రమే అవి ప్రయాణిస్తాయి. ఒక్కో కారులో 6 నుంచి 8 మంది వరకు ప్రయాణం చేయవచ్చు. ఈ ప్రాజెక్టుని పబ్లిక్-ప్రైవేట్ పార్ట్‌నర్‌షిప్-PPP పద్ధతిలో ప్లాన్ చేస్తోంది. ఆరు రద్దీ ప్రాంతాల్లో అధునాతనమైన రవాణా వ్యవస్థను ఏర్పాటు చేయాలని ఆలోచన చేస్తోంది.

ప్రతిపాదిత ప్రాంతాల్లో వాటి ఏర్పాటుకు కావాల్సిన కన్సల్టెంట్‌ ఎంపికకు ఇటీవల టెండర్లు ఆహ్వానించింది. మెట్రోస్టేషన్లకు అనుసంధానంగా పీఆర్‌టీఎస్‌ వ్యవస్థ ఏర్పాటు చేయాలని గతంలో బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం భావించింది. అందుకోసం రెండు మార్గాలను ఎంపిక చేసింది కూడా. రాయదుర్గం మెట్రో స్టేషన్‌ నుంచి మైండ్‌స్పేస్‌, ఇనార్బిట్‌ మాల్‌, అరబిందో, నాలెడ్జ్‌ సిటీ, ఐటీసీ కోహినూర్‌ వరకు ప్రతిపాదన చేసింది.

మరొక కారిడార్‌లో అసెంబ్లీ నుంచి సచివాలయం మీదుగా ప్యారడైజ్‌ మెట్రోస్టేషన్‌ వరకు పాడ్‌కార్లను నడిపించాలని ఆలోచన చేసింది. ఏం జరిగిందో తెలీదుగానీ ఆ ప్రతిపాదన కాస్త వెనక్కి వెళ్లింది. ఈ తరహా వ్యవస్థ దేశంలో తొలిసారి ముంబైలో మొదలుపెట్టారు. బాంద్రా-కుర్లా కారిడార్‌లో చేపట్టారు. దీనికి సంబంధించిన పనులు శరవేగంగా జరుగుతున్నాయి. హైదరాబాద్ ఓకే అయితే ముంబై తర్వాత ఆ తరహా కొత్త వ్యవస్థ ఇక్కడ రాబోతోంది.

Previous Post Next Post

نموذج الاتصال

💬 Chat 📢 Follow