మక్తల్ : పోలింగ్ తేదీ దగ్గర పడుతున్న కొద్దీ అభ్యర్థులు ఓటర్లను మభ్యపెట్టి తమ వైపు తిప్పుకునేందుకు ఓటుకు రెండు వేలు, చికెన్, మటన్, చాప, బ్రాండెడ్ మద్యం బాటిళ్లను ఓటర్లకు ఇంటి దగ్గరే అందిస్తున్నారు. ప్రచారంలో జెండా పట్టిన వారికి మధ్యాహ్నం చికెన్, మటన్, రాత్రికి మందు, చేతికి రొక్కం.. ఇలా గత రెండు రోజులుగా ఈ వ్యవహారం జోరుగా కొనసాగుతోంది. దీంతో జులాయిగా తిరిగేవారు, ఇంటిపట్టునే ఉండే మహిళలు కొద్ది గంటలు జెండా పట్టుకుని తిరిగితే ఇవన్నీ లభిస్తున్నాయన్న కారణంతో గుంపులు గుంపులుగా ఆయా పార్టీల వెంబడి ప్రచారానికి వెళ్తున్నారు. గత రెండు మూడు రోజులుగా ఇంటింటా ప్రచారం కొనసాగుతుండటంతో, వార్డుల్లో ప్రచారానికి వెళ్లిన అభ్యర్థి వెనుక గుంపులు గుంపులుగా రావడానికి యువకులు, మహిళా కూలీలను ఒక్కొక్కరికి ఐదువందల చొప్పున ఇస్తున్నారు. ఉదయం టిఫిన్, మధ్యాహ్నం చికెన్–మటన్ బిర్యానీతో భోజనం, సాయంత్రం అల్పాహారంగా వేడి వేడి పకోడీలు, బజ్జీలు, రాత్రికి బిర్యానీ ప్యాకెట్‌తో పాటు క్వార్టర్ మందు ఇస్తున్నారు. ఇది రోజూ ఇలా కొనసాగడంతో రోజువారీ కూలీకి వెళ్లే మహిళలు, గుంపుమేస్త్రీ చేతికింద పనిచేసేవారు పనులు వదిలి ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు. పార్టీ జెండా చేతబట్టి వారి వెంట నెమ్మదిగా నడుచుకుంటూ వెళ్తే చాలు అన్నట్టుగా ఈ తంతు కొనసాగుతోంది. యువకులకు, ప్రజలకు, మహిళా కూలీలకు రోజుకు పని, కడుపునిండా తిండి, మందు, చేతికి రొక్కం… ఇలా అన్ని పార్టీల్లో ఈ వ్యవహారం సాగుతోంది. ఇలా పార్టీ జెండాలు పట్టుకుని తిరిగిన వారంతా తిరిగిన పార్టీకే, ఆ అభ్యర్థికే ఓటేస్తారంటే అది సందిగ్ధమే కదా అని ఆయా పార్టీల అభ్యర్థులే అంటున్నారు.
Tags
mahabubangar