Revanth Reddy: జిల్లాల పునర్విభజనకు కమిషన్‌


 విశ్రాంత న్యాయమూర్తి నేతృత్వంలో ఏర్పాటు చేస్తాం 

వారసత్వ అప్పులు, తప్పులను కప్పిపుచ్చుకుంటూ వెళ్తున్నాం 
టీజీఓ డైరీ ఆవిష్కరణలో సీఎం రేవంత్‌రెడ్డి 

హైదరాబాద్‌: జిల్లాల పునర్విభజనపై ఎలాంటి అపోహలొద్దని.. ఈ ప్రక్రియను హేతుబద్ధంగా చేపడతామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు. త్వరలోనే హైకోర్టు లేదా సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి నేతృత్వంలో కమిషన్‌ ఏర్పాటు చేస్తామన్నారు. ఆ కమిషన్‌ ఆర్నెల్లపాటు రాష్ట్రమంతటా తిరిగి అభిప్రాయాలు స్వీకరిస్తుందని పేర్కొన్నారు. సచివాలయంలో తెలంగాణ గెజిటెడ్‌ ఆఫీసర్స్‌(టీజీఓ) కేంద్ర సంఘం 2026 డైరీ, క్యాలెండర్‌ను ఆయన సోమవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడారు. ‘‘గతంలో నచ్చితే నజరానా అన్నట్లు.. మండలాలు, రెవెన్యూ డివిజన్లు, జిల్లాలు ఏర్పాటుచేసి వెళ్లిపోయారు. ఒక జిల్లాలో ఒక నియోజకవర్గం.. మరో జిల్లాలో 14 నియోజకవర్గాలున్నాయి. అశాస్త్రీయంగా విభజించారు. వరంగల్, హనుమకొండలను ఒకటే జిల్లా చేయాలని డిమాండ్‌ వస్తోంది. జిల్లాలు తగ్గించడమా? పెంచడమా అనేది నేను చెప్పను. హేతుబద్ధంగా జరగాలి. జిల్లాల పునర్విభజనపై వచ్చే బడ్జెట్‌ అసెంబ్లీ సమావేశాల్లో కూలంకషంగా చర్చిద్దాం. 

మేం వచ్చిన తర్వాత పోలీసు కమిషనరేట్‌ సరిహద్దులు మాత్రమే మార్చాం. దొరల కోట పేరుపెడితే రాచకొండ కమిషనరేట్‌ పేరు సహేతుకంగా లేదనే మార్పుచేశాం. 



మనమంతా ఒకే కుటుంబం 

చాలామంది సంఘాల నేతలు ప్రభుత్వంతో కుమ్మక్కయ్యారని అంటున్నారని ప్రచారం జరుగుతోంది. మనమంతా ఒకే కుటుంబం.. మేం నిర్ణయాలు తీసుకుంటే.. మీరు అమలు చేస్తారు.  కలిసి ఉంటే అసూయపడే వారు ఎప్పుడూ ఉంటారు. గత ప్రభుత్వం నుంచి వారసత్వంగా వచ్చిన అప్పులను, తప్పులను కప్పిపుచ్చుకుంటూ వెళ్తున్నాం. వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి ఉద్యోగుల పెండింగ్‌ బిల్లుల చెల్లింపు మొత్తాన్ని పెంచుతాం. గతంలో మీకు వేతనాలు ఎప్పుడొచ్చేవి.. నేను వచ్చాక ఎలా వస్తున్నాయో గమనించాలి. ఉద్యోగుల డీఏ దస్త్రాలపై సంతకం పెట్టి ఇక్కడికి వచ్చాను. ప్రతి ప్రభుత్వ ఉద్యోగికి రూ.కోటి బీమా ఇవ్వాలని నిర్ణయించాం. మీ ఆరోగ్య భద్రత పథకంపైనా చర్చిస్తున్నాం. గతంలో బకాయిలకు సంబంధించి నెలకు రూ.200 కోట్లు ఇచ్చేవారు కాదు.. ఇప్పుడు రూ.750 కోట్లు ఇస్తున్నాం. ప్రభుత్వోద్యోగులకు రూ.12 వేల కోట్ల బకాయిలు పెండింగ్‌లో ఉన్నాయి. వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి బకాయిల చెల్లింపు పెంచుతాం. ఆదాయం పెంచుకోవడానికి పన్నులు పెంచాల్సిన అవసరం లేదు. జీఎస్టీ, ఎక్సైజ్, ఇసుక, భూమి తదితరాల్లో అవకతవకలు జరుగుతున్నాయి. వాటిని అరికట్టాలి. నగరాల్లో ఇంటి పన్ను సరిగ్గా వసూలు చేస్తే ఆర్థిక పరిస్థితే మారుతుంది. దేశంలోనే ఆదర్శంగా ఉండేలా టీజీఓలు హైదరాబాద్‌లో కార్యాలయం నిర్మించుకోవాలి.

ఉద్యోగులే ప్రభుత్వ సారథులు.. వారధులు 

గత ప్రభుత్వం పదవీ విరమణ వయసు పెంచడం వల్ల ఉద్యోగులకు చెల్లించని రూ.11 వేల కోట్ల భారాన్ని మాకు ఇచ్చి వెళ్లారు. కాంట్రాక్టర్లకు చెల్లించాల్సిన బిల్లులు రూ.42 వేల కోట్లు.. సింగరేణి, విద్యుత్తుశాఖ.. ఇలా మొత్తం 1.11 లక్షల కోట్ల బకాయిలు.. వీటికి బ్యాంకు రుణాలు అదనం. అందుకే అసెంబ్లీలో శ్వేతపత్రం ప్రవేశపెట్టాం. ప్రభుత్వం నడవాలంటే ప్రతి నెలా రూ.30 వేల కోట్లు అవసరం. కొన్ని పథకాలను పక్కనబెట్టినా రూ.22,500 కోట్ల ఖర్చు ఉంటుంది. ఆదాయం మాత్రం రూ.18 వేల కోట్లే. ప్రభుత్వంలో ఉన్న 200 మంది ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు మాత్రమే రాష్ట్రాన్ని నడపలేరు. 10.50 లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులే నడిపిస్తారు. ఈ సర్కారు వచ్చిన తర్వాత మారింది కేవలం 15 మంది మంత్రులే. ఉద్యోగులు అప్పటివారే ఉన్నారు. వారే ప్రభుత్వ సారథులు, వారధులు. వారి సమస్యల పరిష్కారానికి ప్రథమ ప్రాధాన్యమిస్తాం. 

‘అంతులేని కథ’ సినిమాలా నా పరిస్థితి..

ముఖ్యమంత్రి అయిన రెండేళ్లలో ఒక్కరోజు కూడా నేను సెలవు తీసుకోలేదు. నేను చిన్నప్పుడు అంతులేని కథ సినిమా చూశా. అందులో జయప్రద కుటుంబ బాధ్యతల కారణంగా తన ఆనందాన్ని పక్కనపెట్టి కష్టపడుతూనే ఉంటుంది. నేను కూడా సీఎం పదవి వస్తే సంతోషంగా ఉండొచ్చని అనుకున్నా. ఇప్పుడు మరింత బాధ్యత పెరిగింది. అంతకుముందు పార్టీ అధ్యక్షుడిగా 12 గంటలు పనిచేస్తే చాలు. ఇప్పుడు 18 గంటలు పనిచేసినా సమయం సరిపోవడం లేదు’’ అని పేర్కొన్నారు. కార్యక్రమంలో టీజీఓ రాష్ట్ర అధ్యక్షుడు ఏలూరి శ్రీనివాసరావు, ప్రధాన కార్యదర్శి బి.శ్యామ్, కోశాధికారి సహదేవ్, సహాధ్యక్షుడు ఉపేందర్‌రెడ్డి, రామగుండం ఎమ్మెల్యే ఠాకూర్, రాజ్యసభ సభ్యుడు అనిల్‌కుమార్‌ యాదవ్‌ పాల్గొన్నారు.


ఎడ్యుకేషన్‌ కిట్‌ నాణ్యతలో రాజీ పడొద్దు: సీఎం 

ఈనాడు, హైదరాబాద్‌: ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు అందించనున్న 22 వస్తువులతో కూడిన ఎడ్యుకేషన్‌ కిట్ల నాణ్యతలో రాజీపడొద్దని, ఇందుకు ప్రణాళిక సిద్ధం చేయాలని సీఎం రేవంత్‌రెడ్డి సూచించారు. కేంద్రీకృత, లోకల్‌ ప్రొక్యూర్‌మెంట్‌ విధానంలో సమీకరించే వస్తువులపై సమగ్ర అధ్యయనం చేయాలన్నారు. పాఠశాలలు ప్రారంభమయ్యే నాటికి విద్యార్థులకు కిట్‌లు అందించేలా చూడాలన్నారు. సోమవారమిక్కడ తన నివాసంలో సంక్షేమ వసతిగృహాలు, గురుకులాల విద్యార్థులకు అందించే వస్తువుల ప్రొక్యూర్‌మెంట్‌పై సీఎం సమీక్ష నిర్వహించారు. ‘‘యూనిఫాం, స్కూల్‌బెల్ట్, టై, షూస్, బ్యాగ్, నోట్‌బుక్స్‌ ఇతర వస్తువులు కిట్‌లో ఉంటాయి. ప్రభుత్వ పాఠశాలలు, గురుకులాలకు సంబంధించిన పెండింగ్‌ బిల్లులపై వెంటనే పూర్తి వివరాలు అందించాలి’’ అని అధికారులను ఆదేశించారు. సమీక్షలో ప్రభుత్వ సలహాదారు సుదర్శన్‌రెడ్డి, వేంనరేందర్‌రెడ్డి, సంక్షేమశాఖల ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సవ్యసాచి ఘోష్, సీఎం కార్యదర్శులు శ్రీనివాసులు పాల్గొన్నారు. 

Previous Post Next Post

نموذج الاتصال

💬 Chat 📢 Follow