KCR Attend Assembly: అంతన్నారు.. ఇంతన్నారు.. ఇక సత్తా ఏంటో చూపిస్తామన్నారు.. కానీ తీరా టైమ్ వచ్చేసరికి మాత్రం ఇలా వచ్చి అలా వెళ్లిపోయారు. ఇప్పుడు మనం ఎవరికి గురించి మాట్లాడుకుంటున్నామో ఇప్పటికే మీకు అర్థం అయి ఉంటుంది. మరి గులాబీ బాస్ ఈ వన్డే షో వెనక అసలు రీజన్సేంటి? లెక్కలు తేలుస్తామంటూ వార్నింగ్ ఇచ్చని నేతలు ఎందుకు వాకౌట్ చేశారు? ఒక్క సంతకం కోసమే ఇంత డ్రామా చేశారా? డైవర్షన్ కోసమే జల జగడాలకు తెర లేపారా? అసలు కేసీఆర్ అసెంబ్లీ డ్రామా వెనక అసలు మతలబేంటి?
ఇక తెలంగాణ పాలిటిక్స్‌లో కురుక్షేత్రం గ్యారెంటీ అనే అనుమానం రాక మానదు. మాహిష్మతి ఊపిరి పిల్చుకో.. వారసుడు వచ్చాడు అనే రేంజ్‌లో ఉంది ఈ డైలాగ్. ఇక కేసీఆర్ ఫామ్‌హౌస్ వదిలారు.. హైదరాబాద్ వచ్చారు.. ఇక అసెంబ్లీకి కూడా రాబోతున్నారు.. ఇప్పటి వరకు ఓ లెక్క.. ఇకనుంచి మరో లెక్క.. అన్నట్టుగా ఉంది ఓ రెండు రోజుల పాటు హైప్. కానీ తీరా ఏమైంది? చదువు చారెడు.. బలపాలు దోశేడు అన్నట్టు.. హండ్రెడ్ డేస్ పక్కా అనుకున్న సినిమా.. ఫస్ట్ షోకే చాప చుట్టేసినట్టు.. కేవలం వన్డే షో చేసి ఛలో అంటూ తిరిగి ఫామ్‌హౌస్‌కు వెళ్లిపోయారు మాజీ సీఎం, బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్.
కేసీఆర్ ఇంత ఆర్భాటం చేసింది ఎందుకు?
మరి కేసీఆర్ ఇంత ఆర్భాటం చేసింది ఎందుకు? ఈ సంతకం కోసమేనా? అంటే ఔననే సమాధానాలే వినిపిస్తున్నాయి ఇప్పుడు. నిజానికి తెలంగాణ పాలిటిక్స్‌లో గులాబీ బాస్ అడుగు పెడితే అది ఒక సంచలనంగా మారుతుంది. ఆఖరికి ఆయన మౌనంగా ఉన్నా కూడా అది వ్యూహాత్మకే అని నమ్మేవారు అనేక మంది. అలాంటి కేసీఆర్ మౌనాన్ని వీడి.. సత్తా చూపిస్తామని వార్నింగ్ ఇచ్చి ఈసారి తోక జాడించారనే విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తోంది. ఎందుకంటే గులాబీ బాస్ అసెంబ్లీకి వస్తారా? రారా? అనే ప్రశ్న చాలా రోజులుగా రాజకీయాల్లో తిరుగుతోంది. అధికార పార్టీ నేతలు, ఆఖరికి సీఎం రేవంత్ రెడ్డి సైతం కేసీఆర్ అసెంబ్లీకి రావాలని.. మాట్లాడాలంటున్నారు. దీనికి తగ్గట్టుగానే ఆయన సమరశంఖం ముగించినట్టుగా అసెంబ్లీకి వస్తున్నానంటూ చెప్పకనే చెప్పారు. అన్నట్టుగా అసెంబ్లీకి వచ్చి ఒక సంతకం చేసి తిరిగి వెళ్లిపోయారు. దీంతో బీఆర్ఎస్ శ్రేణుల్లో నిండిన జోష్.. ఒక్కసారిగా నీరుగారిపోయింది. అభిమానులను, పార్టీ కేడర్‌ను ఊరించి.. చివరి నిమిషంలో ఊసురుమనిపించారు కేసీఆర్.
సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీస్తారని అంచనాలు
చాలా కాలం తర్వాత కేసీఆర్ అసెంబ్లీకి వస్తున్నారని తెలియగానే.. ప్రజల సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీస్తారని అంతా ఆశించారు. కానీ అసలు కారణం వేరే ఉందని కేసీఆర్ తీరుతో అర్థమైపోయింది. కేసీఆర్ ఆ కాసేపు కూడా అసెంబ్లీలో ఉండేందుకు కారణం అసెంబ్లీ రూల్ 153 అని తెలుస్తోంది. అసెంబ్లీ నిబంధనల ప్రకారం ఒక సభ్యుడు వరుసగా 60 రోజుల పాటు సభకు హాజరుకాకపోతే వారి సభ్యత్వం ప్రమాదంలో పడే అవకాశం ఉంటుంది. అంటే అనర్హత వేటు పడే అవకాశం ఉంటుంది. అందుకే కేసీఆర్ రాక కేవలం రిజిస్టర్‌లో సంతకం చేసి, తన ఎమ్మెల్యే పదవిని కాపాడుకోవడానికేనా? అనే ప్రశ్న ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.
కేవలం ఫార్యాలిటీ కోసమే వచ్చి వెళ్లాడనే టాక్..
సారు వస్తున్నారు.. సభను ఊపేస్తారు.. అని గాల్లో మేడలు కట్టిన బీఆర్ఎస్ శ్రేణులకు, ఆయన కేవలం ఫార్మాలిటీ కోసమే వచ్చి వెళ్లాడనేది ఇప్పుడు అస్సలు డైజెస్ట్ కాని విషయం. ఈ మాత్రం దానికి భారీ కాన్వాయ్, మీడియా హడావిడి. ఇప్పుడు అధికార పార్టీకి కేసీఆర్ వ్యవహారం ఓ ప్రత్యేక ఆయుధాన్ని అందించినట్టైంది. అనర్హత భయమే రప్పించింది.. ప్రజల కోసం కాదు.. తన పదవిని కాపాడుకోవడానికే కేసీఆర్ అసెంబ్లీ గడప తొక్కారు అంటూ సెటైర్లు వేస్తున్నారు.
పాలమూరు రంగారెడ్డిపై ప్రభుత్వ విధానాలను తప్పు పట్టిన కేసీఆర్
నిజానికి కేసీఆర్ నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో చాలా సీరియస్ కామెంట్స్ చేశారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్‌పై కాంగ్రెస్ ప్రభుత్వ విధానాలను తప్పు పట్టారు. సమరశంఖం పూరిస్తున్నామని చెప్పారు. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు సంబంధించి కాంగ్రెస్ ప్రభుత్వం తక్కువ నీటి కేటాయింపులకు అంగీకరించడం ద్వారా.. రైతాంగానికి తీరని అన్యాయం చేస్తోందని కేసీఆర్ మండిపడ్డారు. ఈ అన్యాయాన్ని ఎండగట్టడమే కాకుండా, క్షేత్రస్థాయిలో రైతులను చైతన్యపరచడానికి మూడు ఉమ్మడి జిల్లాల్లో మూడు భారీ బహిరంగ సభలను నిర్వహిస్తున్నట్టు ప్రకటించారు. ఇంతా చేసి ఆయన సైలెంట్ అవ్వడం ఇప్పుడు అస్సలు జీర్ణించుకోలేకపోతున్నారు.
జూరాల నుంచి శ్రీశైలానికి మార్చడం వెనుక భారీ అవినీతి!
కేసీఆర్ సైలెన్స్‌తో మరోసారి అధికార పార్టీ యాక్టివ్ అయ్యింది. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును కేసీఆర్ హయాంలో జూరాల నుంచి శ్రీశైలానికి మార్చడం వెనుక భారీ అవినీతి ఉందంటూ మరో సంచలన ఆరోపణ చేశారు సీఎం రేవంత్ రెడ్డి. ఈ మార్పునకు అసలు అప్పటి రాష్ట్ర మంత్రివర్గ ఆమోదమే లేదన్నారు. కేసీఆర్ అసెంబ్లీకి వస్తే తారీఖుతో సహా ఆయన చేసుకున్న ఒప్పందాలు, పెంచిన అంచనాలన్నీ బయటపెడతామని ప్రకటించారు. ఈ ప్రాజెక్టు ఎవరు బాగు పడటానికి జూరాల నుంచి శ్రీశైలానికి వెళ్లిందో, వేల కోట్లు ఎవరికి పోయాయో తేలాల్సి ఉందని అన్నారు. ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టుకు సంబంధించి బ్యారేజీని తుమ్మిడిహెట్టి నుంచి మేడిగడ్డకు మార్చినపుడు మంత్రివర్గ ఆమోదం తీసుకోలేదని, పాలమూరు ప్రాజెక్టు విషయంలోనూ అదే చేశారంటున్నారు సీఎం రేవంత్.
అధికార పార్టీ నేతలకు అనుకూలంగా బీఆర్ఎస్ నేతల తీరు..
అబద్ధాల్లో పోటీ పెడితే కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌లకు ఉమ్మడిగా మొదటి బహుమతి వస్తుందనేది కాంగ్రెస్ నేతల ఆరోపణ. కేసీఆర్ హయాంలో జరిగిన తప్పులను దిద్దుకుంటూ, పక్క రాష్ట్రాన్ని విమర్శించడం కాకుండా వ్యూహాత్మకంగా ముందుకు వెళ్తున్నామని చెబుతున్నారు ఆ పార్టీ నేతలు. కానీ ఇవన్నీ బీఆర్ఎస్ తప్పని వాదిస్తోంది. కానీ ఇదే విషయంపై సభలో మాట్లాడాల్సిన నేతలు మాత్రం మొఖం చాటేస్తుండటం ఇప్పుడు అధికార పార్టీకి ప్లస్ అవుతుండగా.. బీఆర్ఎస్ పార్టీకి మైనస్‌గా మారుతుంది.
ఇక మాజీ సీఎం, గులాబీ బాస్ పరిస్థితి ఇలా ఉంటే.. అదే పార్టీకి చెందిన కీలక నేతలు కూడా బాస్ దారిలోనే నడుస్తున్నట్టు కనిపిస్తోంది. నిన్నా మొన్నటి వరకు తొడకొట్టి సవాళ్లు విసిరిన నేతలు.. ఇప్పుడు మరో కొత్త రాగం ఎత్తుకున్నారు.
ఓ వైపు కేసీఆర్ అలా ఉంటే.. ఆ పార్టీ నేతలు మేమేం తక్కువా అన్నట్టుగా వ్యవహరిస్తున్నారనే చర్చ జరుగుతోంది. ఈ అసెంబ్లీ సెషన్ మొత్తాన్ని బహిష్కరిస్తున్నట్టు ప్రకటించారు బీఆర్ఎస్ నేతలు. మరి మొన్నటి వరకు చేసిన వ్యాఖ్యలు, సవాళ్లకు ఇప్పుడు సమాధానం చెప్పేది ఎవరు అనేది ఇప్పుడు తేలాల్సిన అంశం. అంతేకాదు జల జగడాలపై ఇప్పుడు అధికార పార్టీ నేతలు కొత్త విషయాలను తెరపైకి తీసుకొస్తున్నారు. బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ ఇప్పటికే ఫామ్‌హౌస్‌కు వెళ్లిపోగా.. ఆ పార్టీ నేతలు ఏకంగా ఈ సెషన్ మొత్తం అసెంబ్లీని బహిష్కరించారు. అధికార పార్టీ నేతలు తమకు మైక్ ఇవ్వడం లేదని.. మాట్లాడే చాన్స్ ఇవ్వడం లేదని ఆరోపిస్తున్నారు నేతలు.
బహిష్కరించడం ఏంటి అంటూ కాంగ్రెస్ నేతల ప్రశ్నలు
వీరి ఆరోపణలు బాగానే ఉన్నా.. బీఆర్ఎస్ నేతల తీరుపైనే విమర్శలు మొదలయ్యాయి. నిన్నా మొన్నటి వరకు ఏ చర్చకైనా సిద్ధమే అని ప్రకటించి.. ఇప్పుడు సమయం దగ్గరికి వచ్చాక ఇలా బహిష్కరించడం ఏంటనే ప్రశ్నలు తెరపైకి వస్తున్నాయి. అయితే పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్‌పై అసలు నిజాలు బయటపడతాయనే బీఆర్ఎస్ నేతలు సభను వదిలి వెళ్లిపోయారంటున్నారు కాంగ్రెస్ మంత్రులు. అధికార పార్టీ మాత్రమే కాదు.. బీఆర్‌ఎస్ నుంచి సస్పెండ్‌కు గురై, ప్రస్తుతం సొంత పార్టీ పెట్టుకునే ఆలోచనలో ఉన్న తెలంగాణ జాగృతి నేత.. మాజీ సీఎం కేసీఆర్ సొంత తనయ కల్వకుంట్ల కవిత కూడా ఇప్పుడు బీఆర్ఎస్ తీరును తప్పు పడుతున్నారు. తెలంగాణ రాజకీయాల్లో కేసీఆర్ హైఓల్టేజ్‌ను క్రియేట్ చేశారన్నది ఎంత నిజమో.. ఆ ఓల్టేజ్‌తో బీఆర్ఎస్ పార్టీకే షాక్ తగిలిందన్నది అంతే నిజమంటున్నారు ఇప్పుడు అధికార పార్టీ నేతలు. అన్ని బీరాలు పలికి.. ఇప్పుడు మొఖం చాటేయడం చూస్తుంటే నిజంగా తప్పు బీఆర్ఎస్‌వైపే ఉందంటూ చర్చను లేవదీస్తున్నారు.
కానీ తెర వెనక కేసీఆర్ వ్యూహం మాత్రం మరోలా ఉందని తెలుస్తోంది. ఇప్పటికే కేసీఆర్ నిర్వహించ తలపెట్టిన మూడు బహిరంగ సభలకు సంబంధించిన గ్రౌండ్ వర్క్ మాత్రం జరుగుతోంది. ఈ సభలు సక్సెస్ కావాలంటే పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్‌లో రేవంత్ సర్కార్ ప్రభుత్వం తప్పుడు నిర్ణయాలు తీసుకుందనేది ప్రూవ్ చేయాలి. కానీ ఈ చాన్స్‌ను బీఆర్ఎస్‌కు ఇచ్చే మూడ్‌లో కనిపించడం లేదు అధికార పార్టీ. ఇప్పటికే ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన అన్ని వివరాలను ప్రజల ముందు ఉంచే ప్రయత్నం చేస్తోంది అధికార పార్టీ.
ఓవరాల్‌గా చూస్తే కేసీఆర్ ప్లాన్ బ్యాక్ ఫైర్ అయ్యిందా? అనే చర్చ ఇప్పుడు పొలిటికల్ సర్కిల్స్‌లో జరుగుతోంది. మొత్తానికి ఈ వ్యవహారంతో కొన్ని విషయాలు మాత్రం ప్రజలకు, పార్టీ నేతలకు తెలిశాయనే చెప్పాలి. కానీ ఈ పరిణామం కారు పార్టీకి మూడు రకాలుగా మైనస్‌గా మారింది. ఫస్ట్.. ఎన్నికల ఓటమి తర్వాత బీఆర్ఎస్ కార్యకర్తలు తీవ్రమైన నిరాశలో ఉన్నారు. తమ నాయకుడు అసెంబ్లీలో అడుగుపెట్టి, పాత కాలపు దూకుడుతో కాంగ్రెస్‌ను విమర్శిస్తే మళ్లీ పూర్వ వైభవం వస్తుందని వారు ఆశించారు. కానీ అది జరగలేదు. అంతేకాకుండా.. నాయకుడే ముఖం చాటేస్తుంటే.. మేం క్షేత్రస్థాయిలో ఎలా పోరాడాలి? అనే భావన పార్టీ నేతల్లో మొదలైంది.
సెకండ్.. కేసీఆర్ అసెంబ్లీకి రాకపోవడం ఒక వరమైతే.. వస్తానని చెప్పి రాకపోవడం.. కాంగ్రెస్ పార్టీకి ఆయుధంగా మారింది. కేసీఆర్ ఓటమిని అంగీకరించారు, అందుకే సభకు రావడానికి భయపడుతున్నారనే అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇక థర్డ్.. కేసీఆర్ అసెంబ్లీకి వచ్చి సంతకం చేసి వెళ్లిపోవడం.. కేవలం పదవి పోకుండా ఉండటానికి 60 రోజుల గడువు లోపు ఒకసారి వచ్చి సంతకం పెట్టి వెళ్లారు అనే విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తుంది అధికార పార్టీ. ఒకప్పుడు సభను శాసించిన నేత ఇప్పుడు కేవలం అటెండెన్స్ కోసం రావాల్సి వచ్చిందంటూ ఆయన గ్రాఫ్‌ను తగ్గించే ప్రయత్నం చేస్తోంది కాంగ్రెస్. నిజానికి కేసీఆర్ డుమ్మా కొట్టడం .. బీఆర్‌ఎస్‌కు లోటుగా మారింది. కేసీఆర్ సభకు దూరంగా ఉంటుండడంతో మిగిలిన బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేల్లో సీరియస్ నెస్ మిస్సవుతోంది. ఏదో వచ్చామా వెళ్లామా అన్నట్లుగానే చాలా మంది ఉంటున్నారు. ఈ సారైతే పాలమూరు లిఫ్ట్ పై చర్చకు ముందే సమావేశాలను బహిష్కరించి చేతులెత్తేశారన్న వాదన వినిపిస్తోంది.
ఇక్కడ మరో విషయం.. అసెంబ్లీలో కృష్ణా నది జలాల పంపకంపై పవర్ పాయింట్ ప్రజంటేషన్‌కు అవకాశం ఇవ్వాలని బీఆర్‌ఎస్ డిమాండ్ చేస్తోంది. నిజానికి ఇలాంటి డిమాండ్ చేయడం ఇది తొలిసారి కాదు. గతంలో కూడా చేసింది. కానీ ఇక్కడ బీఆర్ఎస్ నేతలు మరిచపోతున్న విషయం ఏంటంటే.. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ నేతలు కూడా ఇదే తరహా డిమాండ్ చేసింది. కానీ అప్పుడు వారికి ఆ అవకాశం ఇవ్వలేదు. నిజానికి అప్పట్లో బీఆర్ఎస్ నేతలు అప్పుడు ఆ అవకాశం ఇచ్చి ఉంటే.. ఓ కొత్త సాంప్రదాయానికి శ్రీకారం చుట్టిన వారయ్యేవారు. ఇప్పుడు బీఆర్ఎస్ కూడా బలంగా డిమాండ్ చేసేందుకు అవకాశం ఉండేది. కానీ అలా జరగలేదు. ఇదే అంశాన్ని తెరపైకి తీసుకువస్తున్నారు కాంగ్రెస్ నేతలు. కర్మ రిటర్న్స్ అంటే ఇదేనేమో.