రాష్ట్రంలోని దివ్యాంగులు, ట్రాన్స్‌జెండర్ల అభివృద్ధి, సంక్షేమం కోసం తెలంగాణ ప్రభుత్వం అత్యంత మానవీయ కోణంలో పనిచేస్తోందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ప్రజా భవన్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన పాల్గొని, దివ్యాంగులకు సహాయ పరికరాలను పంపిణీ చేశారు. బాల భరోసా స్కీం, ప్రణామ్ డే కేర్ సెంటర్లను సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. శారీరక వైకల్యం ఉన్నప్పటికీ మానసికంగా ఎవరూ కుంగిపోకూడదని అన్నారు. దివ్యాంగులకు అండగా నిలవడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని భరోసా ఇచ్చారు. దివ్యాంగుల వివాహానికి రూ.2 లక్షలు సాయం అందజేస్తామని సీఎం ప్రకటించారు.
రూ. 50 కోట్లతో సహాయ పరికరాల పంపిణీ
దివ్యాంగుల సాధికారత కోసం ప్రభుత్వం రూ. 50 కోట్ల వ్యయంతో ఉచిత సహాయ పరికరాల పంపిణీ చేపట్టిందని సీఎం వెల్లడించారు. దివ్యాంగులను వివాహం చేసుకునే వారికి ఆర్థిక సహాయం అందిస్తున్నామని.. తద్వారా వారి జీవితాల్లో కొత్త వెలుగులు నింపాలని ప్రభుత్వం ఆకాంక్షిస్తోందని తెలిపారు. మాజీ కేంద్ర మంత్రి జైపాల్ రెడ్డిని దివ్యాంగులందరూ స్ఫూర్తిగా తీసుకోవాలని, ఆయన సాధించిన విజయాలు ప్రతి ఒక్కరిలో ఆత్మవిశ్వాసాన్ని నింపుతాయని కొనియాడారు.
Tags
Telangana