No title

 



బిందె కింద పడితే.. చొట్ట పడటం సాధారణమే. కానీ, మనల్ని మోస్తున్న ఈ భూమి.. ఏ వస్తువు తాకకుండానే చొట్టపడుతోందట. అదెలా సాధ్యం అనుకుంటున్నారా? అయితే, మీరు శాస్త్రవేత్తలు ఏం చెప్పారో తెలుసుకోవల్సిందే. అసలు విషయం తెలుసుకున్న తర్వాత.. ‘‘ఓడియమ్మ బంటి.. మన భూమి చాలా వెరైటీ’’ అనుకొని తీరుతారు. ఏంటో ఈ సైన్సు మనకు అస్సలు అర్థమై చావదు.. అని అనుకుంటున్నారా? అందుకే మీకు అర్థమయ్యేలా వివరిస్తాం చూడండి.

టర్కీలో కుంగుతోన్న భూమి.. పైకి లేస్తున్న పర్వతాలు

టర్కీలో ఒక ప్లేసు ఉంది. అక్కడ మిలియన్ ఏళ్ల నుంచి ‘స్ట్రేంజర్ థింగ్స్’ తరహాలో ఏదో జరుగుతోంది. భూమి మెల్ల మెల్లగా లోపలికి కుంగిపోతోంది. మరో వింత ఏమిటంటే ఒక వైపు భూమి లోపలికి కుంగిపోతుంటే.. దాని చుట్టు ఉన్న నేల మాత్రం పైకి ఉబ్బుతోంది. అంటే.. ఆ ప్రాంతం చుట్టూ కొత్తగా పర్వతాలు ఏర్పడుతున్నాయన్న మాట. మరీ ఈజీగా చెప్పాలంటే.. మనం బ్రెడ్‌(బన్)ను బొటన వేలుతో నొక్కినప్పుడు.. ప్రెస్ చేసిన ప్రాంతంలో లోపలికి, ప్రెస్ చేయని ప్రాంతాల్లోని బ్రెడ్ పైకి లేస్తోంది. ప్రస్తుతం టర్కీలో ఉన్న కోన్యా బేసిన్ (Konya Basin)లో కూడా అదే జరుగుతోందట. ఈ పరిణామాన్నే.. పరిశోధకులు తమ శాస్త్రీయ భాషలో లిథోస్పియర్ (lithospheric dipping) అని అంటున్నారు. నోరు తిరగనివారు సింపుల్‌గా ఎర్త్ క్రస్ట్ (Earth Crust) అని పిలుస్తున్నారు.


అసలు భూమి ఎందుకు కుంగిపోతుంది?

భూమి నిర్మాణం చాలా వెరైటీగా.. వింతగా ఉంటుంది. భూమి పై భాగం.. అంటే మనం నివసిస్తున్న ప్రాంతం అంతా చాలా గట్టిగా ఉంటుంది. కానీ, భూమిని తవ్వుకుంటూ వెళ్లే కొద్ది.. మెత్తగా మారుతుంది. చివరికి మధ్యలో ఉండే కోర్(కేంద్రం) భగభగలాడుతూ.. హాట్ సూప్‌లో ద్రవీభవించి ఉంటుంది. అయితే, కొన్ని చోట్ల భూమిలోని కొన్ని పొరలు చాలా సున్నితంగా ఉంటాయి. మనం నివసిస్తున్న బరువైన నేలను అవి మోయలేవు. ముఖ్యంగా టర్కీలోని కోన్యా బేసిన్.. చాలా సుకుమారి. అక్కడి భూమి లోపలి పొరలు నేల పైభాగాన్ని మోయలేక పోతున్నాయి. అందుకే.. అక్కడ నేల క్రమేనా లోపలికి చొచ్చుకొని పోతుంది. ఒక నీటి చుక్క రూపంలో.. అది భూమి లోపలికి కుచించుకుపోతోంది. భూమి లోపలి భాగంలో గుర్వుత్వాకర్షణ శక్తి చాలా ఎక్కువగా ఉంటుంది. అందుకే.. భూమి పైభాగం చాలా ఈజీగా కిందకి వెళ్లిపోతోంది. ఆ చర్యకు ప్రతి చర్యగా.. కుంగిపోతున్న భూమికి చుట్టుపక్కల ఉన్న నేల క్రమేనా పైకి లేస్తోంది. అక్కడ కొత్తగా పర్వతాలు ఏర్పడుతున్నాయి. ఇది కొన్ని మిలియన్ ఏళ్ల కిందట నుంచి జరుగుతుంది. చాలా నెమ్మదిగా సాగుతోంది.


ప్రమాదకరమా? ఇండియాలోనూ ఇలాంటివి ఉన్నాయా?

మరి, భూమి ఇలా కుంగిపోవడం ప్రమాదకరమా అనే సందేహం చాలామందిలో రావచ్చు. డోన్ట్ వర్రీ.. అలాంటిది ఏమీ ఉండదు. ఇది భూమిలో నిత్యం జరిగే ప్రక్రియ. అయితే, టర్కీలో మాత్రం కాస్త ఎక్కువ. భూమి ఒక్కోసారి తనని తాను ఎడ్జస్ట్ చేసుకుంటూ ఉంటుంది. ఇండియాలోనూ ఇలాంటి ఎర్క్ క్రస్ట్‌లు ఉన్నాయి. ఉత్తర భారత దేశంలోని ఇండో-గాంగ్టిటిక్ బేసిన్‌లో ఉన్న హిమాలయాల వల్ల నేల క్రమేనా కుంగిపోతుంది. అయితే, టర్కీతో పోల్చితే చాలా తక్కువ ఇంపాక్ట్ ఉంటుంది. భుందేల్‌ఖండ్ రీజియన్‌లో ఉన్న మధ్య ప్రదేశ్, ఉత్తరప్రదేశ్‌లో కూడా ఇలాంటి క్రస్ట్‌లు ఉన్నాయి. అయితే నర్మదా బేసిన్‌లో ఏకంగా చీలికే ఏర్పడిందట. గుజరాత్‌లోని కుచ్ రీజియన్‌లో కూడా భూమి కుంగిపోతూ.. దాని చుట్టుపక్కల ప్రాంతాలు పైకి లేస్తున్నాయట. అయితే, ఇవేవీ ప్రమాదకరం కావు. అయితే, పదేళ్ల కిందట మీరు చూసినట్లుగా ఆ ప్రాంతం ఉండదు. భూమి మరింత లోపలికి కుంగిపోయి.. దాని చుట్టుపక్కల ప్రాంతాలు పైకి ఉబ్బి.. పర్వతాలను తలపిస్తాయి అంతే.

Previous Post Next Post

نموذج الاتصال

💬 Chat 📢 Follow