కడితే రూ.వేలు.. కొడితే లక్షలు కోడి పందేల బరుల్లో కత్తులే కీలకం


 కోడికత్తి చూసేందుకు చిన్నగా ఉన్నా.. తగిలితే రక్తం ధారలై పారుతుంది. దెబ్బతగిలిన కోడి క్షణాల్లో కుప్పకూలిపోతోంది. కోడి పందేల బరుల్లో వీటి పాత్ర ఎంతో కీలకం. సంక్రాంతి సమీపిస్తున్న తరుణంలో ప్రతి ఊరులోనూ వీటిపైనే చర్చ జరుగుతోంది.

విరగదు వంగదు..

కోడి కత్తులను ఆరు అంచెల్లో సాన పెడతారు. విరిగి పోకుండా, మొన వంగకుండా ఉండాలంటే ఎంతో గట్టిదనం అవసరం. అందుకే భారీ వాహనాల చక్రాల బేరింగుల్లో వినియోగించే స్టెయిన్‌లెస్‌ స్టీల్‌తో వీటిని తయారు చేస్తారు. దీనికి అత్యంత గట్టిదనం వచ్చేందుకు ఆరుసార్లు కొలిమిలో కాల్చుతారు.

కట్టే వారే ముఖ్యం..

సంక్రాతి కోడి పందేల బరుల్లో పుంజు కాళ్లకు కత్తులు కట్టేవారికే ఎంతో గిరాకీ ఉంటుంది.   పండగ నాలుగు రోజులు వీరికి మంచి డిమాండ్‌ ఉంటుంది. కత్తి కట్టడంలోనే పందెం ఆధారపడి ఉంటుందని భావిస్తారు. పందెం పుంజు కుడికాలి పిల్లవేలికి కత్తి కడతారు. పందెం జరుగుతున్నంత సేపూ పుంజు కాలిని కత్తికట్టే వ్యక్తి గమనిస్తూనే ఉంటాడు. విరిగినా, దిశ మారినా పందెం నిలిపి కత్తిని సరిచేసి మళ్లీ ప్రారంభిస్తారు. పందెం గెలిస్తే రూ.లక్షలు చేతులు మారుతాయి. అందుకే వీరికి రోజుకు రూ.25వేల నుంచి రూ.35వేల వరకు నిర్వాహకులు ముట్టజెబుతారు.

ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలో కేంద్రాలు..

కోడి కత్తులు తయారు చేసే కేంద్రాలు రాష్ట్రంలో ఎక్కువగా పశ్చిమ గోదావరి జిల్లా గణపవరం, నూజివీడు, గురవాయి పాలెం, ముప్పర్తిపాడు పరిధిలో, తూర్పుగోదావరి జిల్లాలో ముమ్మిడివరం, కాట్రేనికోన, ఎదుర్లంక, కాకినాడలో సామర్లకోట, అనపర్తి తదితర ప్రాంతాల్లో వీటి తయారీదారులు ఉన్నట్లు సమాచారం. ఉభయ గోదావరి జిల్లాల నుంచి రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు, కర్ణాటక సైతం తరలిస్తున్నారు. సంక్రాతి సీజన్‌లో ఉభయ గోదావరి జిల్లాలో వీటి వ్యాపారం సుమారు రూ.5 కోట్ల వరకు ఉంటుందని అంచనా.

రోజుకు పది కత్తులు మాత్రమే..

ఒక వ్యక్తి  రోజుకు 5 నుంచి 6 కత్తుల వరకు మాత్రమే తయారు చేయగలడు. అందుకే సంక్రాంతి కోసం ఏడాది పొడవునా తయారు చేస్తారు. గతంలో వీటి ధర రూ.200 నుంచి రూ.300 వరకు ఉండేది.  ప్రస్తుతం రూ.1000 వరకు ధర పలుకుతోంది. ముడి ఇనుమును చెన్నై, విజయవాడ, తిరువూరు తదితర ప్రాంతాల నుంచి తీసుకు వస్తారు.  ఒక కత్తి ఒక పందేనికి మాత్రమే వినియోగిస్తారు.

Previous Post Next Post

نموذج الاتصال

💬 Chat 📢 Follow