అక్కడ ఉదయం నిద్రలేవగానే మందు కొడుతున్నారు


 BELT SHOPS LIQUOR SALES IN VILLAGES : నల్గొండ జిల్లా పేరు చెబితే, తాగునీటి కష్టాలు గుర్తొస్తాయి. ప్రభుత్వాలు మారినా, ఎన్ని మంచినీటి పథకాలు తీసుకొచ్చినా, నేటికీ మూడు, నాలుగు రోజులైతే గానీ ఒక్కసారి కూడా తాగునీరు రాని ఊర్లెన్నో ఉన్నాయి. కానీ, అక్కడ మద్యం విక్రయించని గ్రామం మాత్రం ఒక్కటి కూడా లేదు. ఉదయం నాలుగింటికే టీ, కాఫీ తాగినట్లే, మందుబాబులు మద్యం పెగ్గులు సేవిస్తున్నారు. పంచాయతీ ఎన్నికలు సమీపిస్తుండటంతో ఈ ధోరణి మరింత పెరుగుతోంది.

లైసెన్స్​డ్ షాప్​ల్లో కన్నా : ప్రభుత్వం నిర్వహించే మద్యం దుకాణాల టెండర్లలో లక్షల్లో వేలం వేసినా, లక్కీ డ్రాలో అదృష్టంతో ఆధారపడి ఉంటుంది. ఈ తరహాలో పర్మిషన్​ పొందిన షాపుల కన్నా, గ్రామాల్లో ఉండే ఈ గొలుసు దుకాణాల్లోనే ఎక్కువ మద్యం అమ్ముడవుతోంది. అయితే, పాత మద్యం దుకాణాల గడువు డిసెంబర్ 1తో ముగియడంతో వీటికి మరింత గిరాకీ పెరిగింది. ప్రస్తుతం జిల్లాలో 154 మద్యం షాపులుండగా, 2,450 బెల్ట్ షాప్​లు ఉన్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు.

ఎన్నికల సందడితో మరింతగా : ప్రస్తుతం పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో, పోటీలో నిలిచిన సర్పంచ్, వార్డు సభ్యులు ఓటర్లను మచ్చిక చేసుకోవడం సకల ప్రయత్నాలు చేస్తున్నారు. ఏకంగా ఉదయం ఎనిమిది గంటల నుంచే తమ కార్యకర్తలతో పాటు ఇతరులకు మద్యం ధార పోస్తున్నారు. గొలుసు దుకాణాల్లో మద్యంతో డంపులను ఏర్పాటు చేస్తున్నారు.

అడిగేవారే లేరు : గొలుసు దుకాణాల నిర్వాహకులు అధికారులకు నెలవారీగా మామూళ్లు సమర్పించుకోవడంతో, ఈ దందాలపై చూసిచూడనట్లుగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలున్నాయి. దుకాణదారులు ఎమ్మార్పీ ధర కన్నా బీరుకు రూ.30, క్వార్టర్​పై అదనంగా రూ.25 తీసుకుంటున్నారు. అయినా అనుమతి తీసుకున్న షాపుల్లా పర్మిట్​ రూమ్​లు లేక, కొన్ని గ్రామాల్లో బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవిస్తున్నా పట్టించుకునే నాథుడే లేడు.

చర్యలు తీసుకుంటాం : అక్రమంగా మద్యం విక్రయిస్తున్న గొలుసు దుకాణాలపై ప్రత్యేక దృష్టి సారించామని ప్రాంతీయ ఆబ్కారీ శాఖ సూపరింటెండెంట్ సంతోశ్ తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో మద్యం పంపిణీ, కల్తీ మద్యం రవాణాలపైనా నిఘా పెంచినట్లు ఆయన వివరించారు. దీని కోసం స్థానిక పోలీసులతో కలిసి తనిఖీలు నిర్వహిస్తున్నట్లు అధికారి వెల్లడించారు. గుడుంబా, గొలుసు దుకాణాల నిర్వాహకుల సమాచారం ఇచ్చిన వారి వివరాలను గోప్యంగా ఉంచుతామని ఆయన తెలిపారు. సమాచారం ఇచ్చేందుకు 08682-227271 నెంబర్​ను సంప్రదించాలని సూచించారు.

పంచాయతీ ఎన్నికల్లో మద్యం, కల్తీ మద్యం రవాణా, గొలుసు దుకాణాలపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశాం. స్థానిక పోలీసులతో కలిసి తనిఖీలు చేస్తున్నాం. గుడుంబా, గొలుసు దుకాణాలపై సమాచారం ఇచ్చేవారి వివరాలు గోప్యంగా ఉంచుతాం. సమాచారం ఇచ్చేందుకు 08682-227271 నెంబర్​ను సంప్రదించండి

- సంతోశ్, ఆబ్కారీశాఖ సూపరింటెండెంట్‌

Previous Post Next Post

نموذج الاتصال

💬 Chat 📢 Follow