BRS, Congress: పొట్టుపొట్టు కొట్టుకున్నారు..



- బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ కార్యకర్తల బాహాబాహీ

- సవాళ్లు ప్రతి సవాళ్లతో హీటెక్కిన మల్కాజిగిరి

- తోపులాటలో చిరిగిన కార్పొరేటర్‌ భర్త డ్రెస్‌

- ఇరువర్గాలను చెదరగొట్టిన పోలీసులు

- మైనంపల్లి రాకతో మరోసారి తీవ్ర ఉద్రిక్తత

- భారీగా మోహరించిన బలగాలు

- చెక్కుల పంపిణీ ప్రొటోకాల్‌ విషయంలో మొదలైన ఘర్షణ

హైదరాబాద్: ప్రొటోకాల్‌ విషయంలో బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌(BRS, Congress) కార్యకర్తల మధ్య ఏర్పడిన వివాదం చినికి చినికి గాలివానగా మారింది. తీవ్రస్థాయిలో ఘర్షణకు దారి తీసింది. సభా వేదికపై కూర్చునే విషయంలో మొదలైన గొడవ ఇరు పార్టీల నాయకులు, కార్యకర్తలు కొట్టుకునే స్థాయికి చేరింది. మంగళవారం ఉదయం అల్వాల్‌లో.. సాయంత్రం మల్కాజిగిరిలో ఇరు పార్టీల వారు బాహాబాహీకి తలపడ్డారు. సవాళ్లు, ప్రతి సవాళ్లతో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. పోలీసులు ఇరు పార్టీలవారిని చెదరగొట్టి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. సాయంత్రం వేళ మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు, ఆయన కుమారుడు మెదక్‌ ఎమ్మెల్యే రోహిత్‌తో కలిసి మల్కాజిగిరికి 400మంది అనుచరులతో రావడంతో మళ్లీ ఉద్రిక్తత ఏర్పడింది. పోలీసులు అక్కడికి వచ్చిన ఇరుపార్టీల నాయకులు, కార్యకర్తలను సముదాయించి పంపించి వేశారు.

చెక్కుల పంపిణీతో మొదలైన వివాదం

అల్వాల్‌లోని శ్రీబాలాజీ వేంకటేశ్వరస్వామి ఆలయంలో బోనాల పండుగకు సంబంధించి చెక్‌ల పంపిణీ కార్యక్రమం మంగళవారం నిర్వహించారు. ప్రభుత్వ విప్‌ బీర్ల ఐలయ్య, ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్‌ రెడ్డి, కార్పొరేటర్లు రాజ్‌జితేందర్‌నాథ్‌, ప్రేమ్‌కుమార్‌, శాంతి శ్రీనివాస్‌రెడ్డి, సబితకిషోర్‌, మేకల సునీతయాదవ్‌లతోపాటు బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ పార్టీ నాయకులు, బోనాల ఉత్సవ కమిటీ నిర్వాహకులు హాజరయ్యారు. ఈ సందర్భంగా సభావేదికపై కూర్చునే విషయంలో ప్రొటోకాల్‌ అంశంపై కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ నాయకుల మధ్య వివాదం తలెత్తి అల్వాల్‌ పోలీస్‌స్టేషన్‌కు చేరుకున్నారు. అక్కడ ఇరుపార్టీల నేతలు, కార్యకర్తల ఘర్షణ జరిగింది. కాంగ్రెస్‌ నాయకుడు తోట లక్ష్మీకాంత్‌రెడ్డి అదుపుతప్పి కిందపడిపోయాడు. గౌతంనగర్‌ కార్పొరేటర్‌ సునీతయాదవ్‌ భర్త రాముయాదవ్‌ ప్యాంట్‌, షర్ట్‌ చిరిగిపోయింది. కొంతమంది కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ నాయకులకు, కార్యకర్తలకు గాయాలయ్యాయి. పేట్‌బషీరాబాద్‌ ఏసీపీ బాలగంగిరెడ్డి ఆధ్వర్యంలో పోలీసులు ఇరు పార్టీల కార్యకర్తలను చెదరగొట్టడంతో గొడవ సద్దుమణిగింది.

సవాల్‌ స్వీకరించిన మైనంపల్లి

కాంగ్రెస్‌ కార్యకర్తల దాడిలో బీఆర్‌ఎస్‌ నాయకుడు మండల చిన్నయాదవ్‌ తీవ్రంగా గాయపడ్డాడు. దీంతో అతని బాబాయి, సంఘ సేవకులు మండల్‌ రాధాకృష్ణ యాదవ్‌ మంగళవారం సాయంత్రం మాజీ ఎమ్మెల్యే మైనంపల్లికి ఫోన్‌ చేసి ‘తమ వారిపై ఇష్టానుసారంగా దాడులు చేస్తే సహించేదిలేదు.. మల్కాజిగిరిలోనే ఉంటాను. ఇక్కడికి రా.. తేల్చుకుందాం..’ అంటూ సవాల్‌ చేశారు. అందుకు మైనంపల్లి ‘అక్కడే ఉండు.. వస్తున్నా..’ అంటూ ప్రతిసవాల్‌ విసిరారు. సాయంత్రం 7 గంటల ప్రాంతంలో ఆయన కుమారుడు ఎమ్మెల్యే రోహిత్‌తో కలిసి 400 మంది అనుచరులతో మల్కాజ్‌గిరి చౌరస్తాకు చేరుకున్నాడు. దీంతో ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అప్రమత్తమైన పోలీసులు అక్కడే ఉన్న మండల రాధాకృష్ణ యాదవ్‌ను సురక్షిత ప్రాంతానికి తరలించారు.


అభివృద్ధిలో పోటీ పడండి

పండగ వేడుకలకు ప్రభుత్వం ఇచ్చే ఆర్థిక సహాయం పంపిణీ కార్యక్ర మంలో గొడవకు దిగి బీఆర్‌ఎస్‌ పార్టీ నాయకులపై కాంగ్రెస్‌ నాయకులు దాడి చేయడం వారి దౌర్జన్యానికి పరాకాష్ట. నియోజకవర్గానికి నిధుల మంజూరు కోసం పోటీ పడాలి తప్ప.. దాడులు చేయడానికి కాదు. మల్కాజిగిరిలో దాడుల సంస్కృతి పోవాలి. మహిళా కార్పొరేటర్‌లను అవమానించడంతో పాటు దుర్భాషలాడుతూ దాడులకు పాల్పడ్డారు.

- ఎమ్మెల్యే మర్రి రాజశేఖరరెడ్డి


దాడి చేస్తే సహించేది లేదు

ఏ ఒక్క కాంగ్రెస్‌ కార్యకర్తపై దాడికి దిగినా సహించేది లేదు. అది పార్టీ మీద దాడిగానే భావిస్తాం. ఎట్టి పరిస్థితుల్లో ఈ సంస్కృతిని సహించేది లేదు. రాబోయే ఎన్నికల్లో నియోజకవర్గంలోని 9 డివిజన్‌లలో కాంగ్రెస్‌ అభ్యర్థులను గెలిపిస్తాం. కార్యకర్తలు అందరూ సమష్టిగా ఉండాలి.

- మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు
Previous Post Next Post

نموذج الاتصال