నవశకానికి శుభారంభం భారత్ ఘనవిజయం

 




  • 336 పరుగులతో ఇంగ్లండ్‌ చిత్తు

  • రెండో ఇన్నింగ్స్‌లో 271 ఆలౌట్‌

  • ఆరు వికెట్లతో ఆకాశ్‌దీప్‌ విజృంభణ

  • ఎడ్జ్‌బాస్టన్‌లో భారత్‌కు తొలి గెలుపు

ఆకాశ్‌దీప్‌ (6/99)కు సహచరుల అభినందన

దిగ్గజ క్రికెటర్లు జట్టుకు దూరమయ్యారు.. గెలవాల్సిన తొలి టెస్టును అనుభవలేమితో కోల్పోయారు.. ఇక రెండో టెస్టులో స్టార్‌ పేసర్‌ బుమ్రాకు విశ్రాంతినిచ్చి ఏం సాధిస్తారంటూ విమర్శలు.. అయినా అందరి సందేహాలను పటాపంచలు చేస్తూ యువ భారత్‌ ఎడ్జ్‌బాస్టస్‌లో సగర్వంగా నిలిచింది. దాదాపు ఆరు దశాబ్దాల నుంచి భారత్‌ ఈ వేదికపై దండయాత్ర చేస్తున్నా గెలుపు రుచి చూసిందే లేదు. ఇదిగో.. ఇన్నాళ్లకు కెప్టెన్‌ గిల్‌ ఆధ్వర్యంలోని యువ ఆటగాళ్లు కలిసికట్టుగా చరిత్రాత్మక విజయాన్ని కళ్లముందుంచారు. 608 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో ఇంగ్లండ్‌ను పేసర్‌ ఆకాశ్‌ దీప్‌ ఆరు వికెట్లతో దెబ్బతీయడంతో మరో సెషన్‌ ఉండగానే జట్టు సంబరాలు చేసుకుంది. అంతకుముందు గిల్‌ బాదిన డబుల్‌ సెంచరీ, భారీ శతకం ఈ విజయంలో అత్యంత కీలకంగా నిలిచాయనడంలో సందేహం లేదు.

బర్మింగ్‌హామ్‌: టీమిండియా విజయ లాంఛనాన్ని ముగించింది. చివరి రోజు ఆదివారం ఇంగ్లండ్‌ డ్రా కోసం ప్రయత్నిస్తుందనుకున్నా.. భారత బౌలర్లు వారి ఆటలు సాగనీయలేదు. తొలి ఇన్నింగ్స్‌లో సిరాజ్‌ సత్తాచాటితే, రెండో ఇన్నింగ్స్‌లో పేసర్‌ ఆకాశ్‌దీ్‌ప (6/99) స్టోక్స్‌ సేన భరతం పట్టాడు. దీంతో ఇంగ్లండ్‌పై 336 పరుగుల భారీ తేడాతో ఘనవిజయం సాధించింది. ఐదు టెస్టుల సిరీ్‌సలో 1-1తో సమంగా నిలిచింది. ఎడ్జ్‌బాస్టన్‌లో 58 ఏళ్ల తర్వాత భారత్‌కిదే తొలి విజయం కావడం విశేషం. 1967 నుంచి ఇప్పటిదాకా ఆడిన ఎనిమిది టెస్టుల్లో ఏడింటిలో ఓడిన భారత్‌, ఓ మ్యాచ్‌ను డ్రాగా చేసుకుంది. ఇక.. 608 పరుగుల ఛేదనలో ఆతిథ్య ఇంగ్లండ్‌ రెండో ఇన్నింగ్స్‌లో 271 పరుగులకే కుప్పకూలింది. జేమీ స్మిత్‌ (88), బ్రైడన్‌ కార్స్‌ (38), సారథి బెన్‌ స్టోక్స్‌ (33) రాణించారు. మ్యాచ్‌ మొత్తమ్మీద పేసర్‌ ఆకాశ్‌కు పది వికెట్లు దక్కాయి. కెప్టెన్‌గా తొలి విజయం అందుకున్న శుభ్‌మన్‌ ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’గా నిలిచాడు.

Previous Post Next Post

نموذج الاتصال