Congress MLA: తెలంగాణ రాష్ట్రంలో ఏకంగా ఎమ్మెల్యేకే ఊహించని షాక్ ఇచ్చారు సైబర్ నేరగాళ్లు. అడిగినంత డబ్బు ఇవ్వకపోవడంతో సైబర్ నేరగాళ్లు చేసిన పనికి ఖంగుతినడం ఎమ్మెల్యే వంతైంది.
నల్గొండ, మార్చి 5: సైబర్ నేరాగాళ్ల (Cyber Crime) ఆగడాలకు అంతేలేకుండా పోతోంది. సామాన్య ప్రజలను టార్గెట్ చేస్తూ వారిని మోసం చేస్తూ డబ్బులు వసూళ్లకు పాల్పడుతున్నారు. లేకపోతే వారిని బెదిరిస్తూ అందిన కాడికి సొమ్మును మూటగట్టుకుంటున్నారు. అయితే ఇప్పుడు ఆ కేటుగాళ్ల కన్ను ప్రజాప్రతినిధులపైన పడింది. ఏకంగా ఒక ఎమ్మెల్యేనే (Telangana MLA) బెదిరించారంటే వారు ఎంతకు బరితెగించారో అర్థం చేసుకోవచ్చు. కానీ సైబర్ నేరగాళ్ల బెదిరింపులకు బెదరలేదు ఆ ఎమ్మెల్యే. దీంతో ఆ సైబర్ కేటుగాళ్లు చేసిన పని ఇప్పుడు వైరల్‌గా మారింది. ఇంతకీ సైబర్ నేరగాళ్లు బెదిరించిన ఎమ్మెల్యే ఎవరు.. ఏమని బెదిరింపులకు పాల్పడ్డారో ఇప్పుడు తెలుసుకుందాం.
తెలంగాణలో సైబర్ నేరగాళ్లు బరితెగింపులకు పాల్పడ్డారు. నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశాన్ని (Nakrekal MLA Vemula Veeresham) బెదిరించారు సైబర్ నేరగాళ్లు. ఆయనకు న్యూడ్ కాల్స్ చేసిన సైబర్ నేరగాళ్లు.. డబ్బులు పంపాలంటూ డిమాండ్ చేశారు. ఎమ్మెల్యే వేముల వీరేశం సోషల్ మీడియా అకౌంట్లో నుంచి ఫోటోలను సేకరించి, స్క్రీన్ రికార్డును పర్సనల్ నెంబర్ వాట్సాప్‌కు పంపించి బెదిరింపులకు పాల్పడ్డారు. కాగా.. అనుచరులతో మాట్లాడుతున్న సమయంలో ఎమ్మెల్యేలకు ఓ ఫోన్ కాల్ రాగా.. దాన్ని లిఫ్ట్ చేశారు. అది న్యూడ్ కాల్ కావడంతో వెంటనే కట్ చేశారు. అయితే అప్పటికే స్ట్రీన్‌ను రికార్డు చేసిన ఆ కేటుగాళ్లు... ఆ వీడియోను ఎమ్మెల్యేకు పంపి బెదిరింపులకు దిగారు. వాట్సప్ చాటింగ్ ద్వారా ఎమ్మెల్యేకు బెదిరింపు మెసేజ్ పంపారు. డబ్బుల కోసం బ్లాక్ మెయిలింగ్ చేశారు. ఆ కేటుగాళ్ల బెదిరింపులకు లొంగలేదు ఎమ్మెల్యే.