స్థానికం కోటలు బీసీలకు 42% ఎస్సీ వర్గీకరణకు సై అన్న రేవంత్ రెడ్డి

 




వర్గీకరణ, రిజర్వేషన్ల పెంపునకు ఓకే




స్థానికంతోపాటు విద్య, ఉద్యోగాల్లోనూ బీసీలకు 42ు


రాబోయే అసెంబ్లీ సమావేశాల్లో మూడు బిల్లులు


ఓఆర్‌ఆర్‌ నుంచి ఆర్‌ఆర్‌ఆర్‌ వరకూ ఫ్యూచర్‌ సిటీ


30 వేల ఎకరాల్లో అభివృద్ధి.. ‘ఫ్యూచర్‌ సిటీ


డెవల్‌పమెంట్‌ అథారిటీ’ ఏర్పాటు


హెచ్‌ఎండీఏ పరిధిలోని 36 గ్రామాలు కూడా బదిలీ


మహిళా సంఘాల సభ్యుల వయసు 15 నుంచి 65


టీటీడీ తరహాలోనే యాదగిరిగుట్టకూ ట్రస్టు బోర్డు


10,954 గ్రామ పాలన అధికారుల నియామకం


అర్హులైన పాత వీఆర్‌ఓ, వీఆర్‌ఏలకు మళ్లీ చాన్స్‌


తెలంగాణకు పర్యాటక పాలసీ.. ఐదేళ్లకు ఆమోదం


కొత్త రెవెన్యూ డివిజన్లు, మండలాలకు 361 పోస్టులు


రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో కీలక నిర్ణయాలు



హైదరాబాద్‌, మార్చి 6 : షెడ్యూల్డు కులాల (ఎస్సీ) వర్గీకరణ, బీసీ రిజర్వేషన్లపై చట్టాలను రూపొందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. వివిధ సర్వేలు, కమిషన్ల నివేదికలు, మేధావులు, కుల సంఘాల అభిప్రాయాల ఆధారంగా విస్తృత కసరత్తు చేసి, చట్టాల రూపకల్పనకు మార్గాన్ని సుగమం చేసింది. ఈ మేరకు మూడు ముసాయిదా బిల్లులకు రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ఆమోదం తెలిపింది. ఎస్సీ వర్గీకరణ ముసాయిదా బిల్లుతోపాటు బీసీలకు స్థానిక సంస్థల్లో 42 శాతం; విద్య, ఉద్యోగాల్లో 42 శాతం రిజర్వేషన్ల కల్పనకు సంబంధించి రెండు ముసాయిదా బిల్లులకు ఆమోద ముద్ర వేసింది. వీటిని రాబోయే అసెంబ్లీ సమావేశాల్లో ప్రవేశపెట్టి, ఆమోదించాలని నిర్ణయించింది. లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజన విషయంలో దక్షిణాది రాష్ట్రాలు.. ముఖ్యంగా తెలంగాణకు అన్యాయం జరగకుండా కేంద్రానికి తమ వాణిని వినిపించాలని తీర్మానించింది. ఇందుకు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మాజీ మంత్రి జానారెడ్డి ఆధ్వర్యంలో అఖిలపక్ష సమావేశాన్ని నిర్వహించనుంది. ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి అధ్యక్షతన గురువారం సచివాలయంలో రాష్ట్ర మంత్రివర్గ సమావేశంజరిగింది. మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభమైన సమావేశం రాత్రి 9 గంటల వరకూ ఆరు గంటలపాటు సుదీర్ఘంగా కొనసాగింది. అనంతరం రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివా్‌సరెడ్డి, బీసీ సంక్షేమ, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ క్యాబినెట్‌ నిర్ణయాలను విలేకరులకు వెల్లడించారు.  ఎస్సీ వర్గీకరణపై ముసాయిదా బిల్లు


‘‘ఎస్సీ వర్గీకరణకు దశాబ్దాలుగా పోరాటాలు జరిగాయి. సుప్రీం కోర్టు తీర్పునిచ్చిన కొన్ని గంటల్లోనే.. దానిని తమ ఇందిరమ్మ ప్రభుత్వం తూ.చా. తప్పకుండా అమలు చేస్తుందని సీఎం రేవంత్‌రెడ్డి చెప్పారు. అన్న మాట ప్రకారం.. జస్టిస్‌ షమీమ్‌ అక్తర్‌ ఆధ్వర్యంలో ఏక సభ్య కమిషన్‌ వేశారు. ఆయన ఇచ్చిన నివేదికను ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టి చర్చించింది. కమిషన్‌ సిఫారసులను పునఃపరిశీలన చేయాలంటూ వివిధ వర్గాల నుంచి 71 విజ్ఞప్తులు వచ్చాయి. వాటిని పరిశీలించాలంటూ మళ్లీ షమీమ్‌ అక్తర్‌ కమిషన్‌కు ఇవ్వడం జరిగింది. భవిష్యత్తులో ఎలాంటి న్యాయపరమైన చిక్కులు రాకుండా ఉండడానికి, మొక్కుబడిగా చేశారన్న ఇబ్బంది రాకుండా ఉండడానికి మళ్లీ కమిషన్‌కు అప్పగించాం. వీటిని పరిశీలించిన కమిషన్‌.. ప్రభుత్వానికి మరోసారి నివేదిక ఇచ్చింది. దాని ఆధారంగా ముసాయిదా బిల్లును రూపొందించాం’’ అని పొంగులేటి వివరించారు. దీనిని రాబోయే అసెంబ్లీ సమావేశంలో ప్రవేశపెట్టి, చట్ట రూపంలో తీసుకురావాలని క్యాబినెట్‌లో నిర్ణయించడం జరిగిందని తెలిపారు. బీసీ రిజర్వేషన్లపై కుల గణన సర్వే, బలహీన వర్గాల సంఘాలు, మేధావుల సలహాలపై క్యాబినెట్‌లో చర్చించామని, ఈ వివరాలతో రాబోయే శాసన సభ సమావేశాల్లో బిల్లులను ప్రవేశపెట్టనున్నామని వెల్లడించారు. గత శాసన సభలో (2017) 37 శాతంతో పెట్టినబిల్లును వాపసు చేయాలని నిర్ణయించామని తెలిపారు.



‘ఫ్యూచర్‌ సిటీ డెవల్‌పమెంట్‌ అథారిటీ (ఎఫ్‌సీడీఏ)’ ఏర్పాటు


ఓఆర్‌ఆర్‌ నుంచి ఆర్‌ఆర్‌ఆర్‌ వరకూ ‘ఫ్యూచర్‌ సిటీ’గా ప్రకటించడం జరిగిందని, ఈ ప్రాంతంలోని ఏడు మండలాలు, 56 గ్రామాలను కలిపి ‘ఫ్యూచర్‌ సిటీ డెవల్‌పమెంట్‌ అథారిటీ (ఎఫ్‌సీడీఏ)’గా ఏర్పాటు చేస్తూ క్యాబినెట్‌ నిర్ణయించిందని మంత్రి పొంగులేటి తెలిపారు. నాగార్జున సాగర్‌ హైవే నుంచి శ్రీశైలం హైవే మధ్యలో ఉన్న దాదాపు 30 వేల ఎకరాల్లో ఫ్యూచర్‌ సిటీని అభివృద్ధి చేయాలని నిర్ణయించామన్నారు. ‘‘ఈ 56 గ్రామాలతోపాటు ఇదివరకు హెచ్‌ఎండీఏ పరిధిలో ఉన్న 36 గ్రామాలను ఎఫ్‌సీడీఏకు బదిలీ చేయడం జరిగింది. దీనికి 90 పోస్టులను మంజూరు చేస్తూ క్యాబినెట్‌ ఆమోదించింది. హెచ్‌ఎండీఏ పరిధిని రీజినల్‌ రింగు రోడ్డు దాటి 2 కిలోమీటర్ల బఫర్‌ జోన్‌ వరకు విస్తరించడం జరిగింది. అంటే... 11 జిల్లాలు, 104 మండలాలు, 1,355 గ్రామ పంచాయతీలు హెచ్‌ఎండీఏ పరిధిలో ఉంటాయి. మరో 332 రెవెన్యూ గ్రామాలు హెచ్‌ఎండీఏ పరిధిలోకి రాబోతున్నాయి’’ అని వివరించారు.


మహిళా గ్రూపుల్లో సభ్యుల అర్హత వయసు పెంపు


కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయాలన్న చిత్తశుద్ధితో ఇందిరా మహిళా శక్తి మిషన్‌ కింద ‘ఇందిరా మహిళా శక్తి పాలసీ-2025’ని క్యాబినెట్‌ ఆమోదించిందని మంత్రి పొంగులేటి తెలిపారు. గతంలో కాంగ్రెస్‌ ప్రభుత్వంలో మహిళలకు ఎలాంటి భద్రత, సహాయాన్ని అందించారో అదే మాదిరిగా ఇప్పుడు వారి అభివృద్ధి కోసం పాలసీని తెస్తున్నామన్నారు. ‘‘గతంలో గ్రామీణ ప్రాంత మహిళా సంఘాలను సెర్ప్‌ కింద, పట్టణ ప్రాంత మహిళా సంఘాలను మెప్మా కింద పెట్టారు. ఇకపై రాష్ట్రంలో ఈ మహిళా సంఘాలన్నీ ఒకే గొడుగు కింద ఉండాలని నిర్ణయించడం జరిగింది. ఇందిరా మహిళా శక్తి గ్రూపుల్లో గతంలో 60 ఏళ్లకే సభ్యులకు రిటైర్మెంట్‌ ఉండేది. దీనిని 65 సంవత్సరాలకు పొడిగించాం. గతంలో 18 ఏళ్లు నిండినవారికే సభ్యులుగా చేరే అవకాశం ఉండేది. ఇప్పుడు దీనిని 15 ఏళ్లకు కుదించాం. అంటే... 15 ఏళ్ల నుంచి 65 ఏళ్ల మధ్య వయసువారు మహిళా శక్తి గ్రూపుల్లో సభ్యులుగా ఉండొచ్చు’’ అని వివరించారు.



లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజనపై అఖిలపక్ష భేటీ


‘‘కేంద్ర ప్రభుత్వం దురాలోచనతో లోక్‌సభ నియోజక వర్గాలను పునర్విభజన చేయాలని అనుకుంటోంది. ఉత్తరం, దక్షిణం అనే భావనతో దక్షిణాదికి నష్టం చేయాలని యోచిస్తోంది. కేంద్ర ప్రభుత్వ ఆలోచనపై చర్చించాలని, పునర్విభజనను పక్కాగా చేపట్టాలన్న డిమాండ్‌తో అఖిలపక్ష సమావేశాన్ని నిర్వహించాలని నిర్ణయించాం. ఉత్తరాదికి లాభం చేకూరకుండా, దక్షిణాదికి నష్టం జరగకుండా చూడాలన్నదే రాష్ట్ర ప్రభుత్వ ఆలోచన. ఇందుకు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మాజీ మంత్రి జానారెడ్డి ఆధ్వర్యంలో అఖిలపక్ష సమావేశాన్ని నిర్వహించాలని నిర్ణయించాం’’ అని మంత్రి పొంగులేటి తెలిపారు. ఉత్తరాదికి పెంచే దామాషా పద్ధతిలోనే దక్షిణాదికి కూడా సీట్లు పెంచాలంటూ డిమాండ్‌ చేయాలని నిర్ణయించడం జరిగిందని తెలిపారు.


క్యాబినెట్‌లో తీసుకున్న ఇతర నిర్ణయాలు..


తిరుమల తిరుపతి దేవస్థానం ట్రస్టు బోర్డు మాదిరిగానే యాదగిరిగుట్ట నర్సింహస్వామి ఆలయానికి ట్రస్టు బోర్డును ఏర్పాటు చేయాలని నిర్ణయించడం జరిగింది. అందుకు వీలుగా తెలంగాణ చారిటబుల్‌ అండ్‌ హిందూ రెలిజియస్‌ ఇన్‌స్టిట్యూషన్స్‌ అండ్‌ ఎండోమెంట్‌ యాక్ట్‌- 1987ను సవరించాలని నిర్ణయించాం.


గడిచిన పదేళ్లలో తెలంగాణ పర్యాటక రంగం తీవ్ర నిర్లక్ష్యానికి గురైంది. రాష్ట్రంలో అనేక టూరిస్టు స్పాట్‌లు ఉన్నా, ఒక పాలసీ లేకపోవడం వల్ల నష్టం జరిగింది. తెలంగాణకు కూడా ఒక టూరిజం పాలసీ ఉండాలని సమావేశంలో నిర్ణయించడం జరిగింది. ఈ మేరకు ‘తెలంగాణ టూరిజం పాలసీ-2025-30’ను ఆమోదించడం జరిగింది. రాష్ట్రంలోని 27 టూరిజం స్పాట్‌లను ప్రత్యేక పర్యాటక కేంద్రాలుగా అభివృద్ధి చేయాలని నిర్ణయించాం. రాబోయే ఐదేళ్లలో దీనివల్ల రూ.15 వేల కోట్లకు తగ్గకుండా పెట్టుబడులు వచ్చేలా నిర్ణయాలు తీసుకోవడం జరిగింది.


మేలో జరిగే ‘మిస్‌ వరల్డ్‌’ పోటీలను హైదరాబాద్‌లో ఏర్పాటు చేయాలని నిర్ణయించాం. దీనికి ప్రపంచవ్యాప్తంగా 140 దేశాల నుంచి వచ్చే అతిథులకు లోటు జరగకుండా చూడాలని నిర్ణయించడం జరిగింది.

In


రెవెన్యూ శాఖకు సంబంధించి 10,954 రెవెన్యూ గ్రామాలకు నాథుడు లేరు. గడిచిన పదేళ్లలో ప్రజలు ఇబ్బందిపడ్డారు. సీఎం, మంత్రులు చెప్పిన మాట ప్రకారం.. వీటికి గ్రామపాలన అధికారులను నియమించాలని నిర్ణయించడం జరిగింది. గతంలో రద్దు చేసిన వీఆర్‌ఓ, వీఆర్‌ఏ వ్యవస్థలోని అర్హులైన వారిని ఈ పోస్టుల్లో నియమించాలని నిర్ణయించడం జరిగింది.


శంషాబాద్‌ మండలంలో 100 పడకల ఈఎ్‌సఐ ఆస్పత్రి నిర్మాణానికి 5.15 ఎకరాలు కేటాయించడం జరిగింది.


పారాలింపిక్స్‌-2024 కాంస్య పతక విజేత దీప్తి జీవాంజికి ఉద్యోగం ఇవ్వాలని నిర్ణయం.


కొత్త రెవెన్యూ డివిజన్లు, మండలాలను గత ప్రభుత్వంలో మొక్కుబడిగా ఏర్పాటు చేశారు. వాటికి పోస్టులను కేటాయించలేదు. అందుకే, వాటికి 361 పోస్టులను మంజూరు చేయాలని నిర్ణయం.


తెలంగాణ రెసిడెన్షియల్‌ ఎడ్యుకేషనల్‌ ఇన్‌స్టిట్యూషన్స్‌ సొసైటీ పరిధిలోని గురుకుల పాఠశాలలకు 330 రెగ్యులర్‌, 165 ఔట్‌సోర్సింగ్‌.. మొత్తం 495 పోస్టులకు ఆమోదం.



Previous Post Next Post

نموذج الاتصال

Follow Me