జమిలి ఎన్నికల బిల్లుకు కేంద్ర కేబినెట్ ఆమోదం - త్వరలో పార్లమెంటులో 'వన్ నేషన్-వన్ ఎలక్షన్' బిల్లు ప్రవేశపెట్టే అవకాశం
ఒకే దేశం- ఒకే ఎన్నికలు' బిల్లుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో గురువారం జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం కొనసాగుతున్న పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లోనే జమిలి ఎన్నికల బిల్లు ప్రవేశపెట్టే అవకాశం ఉందని సంబంధిత వర్గాల సమాచారం. ఈ నేపథ్యంలో 13, 14 తేదీల్లో తప్పనిసరిగా సభకు హాజరు కావాలని పార్టీ ఎంపీలకు బీజేపీ విప్ జారీ చేయడం ఇందుకు బలాన్ని చేకూరుస్తోంది. దీంతోపాటు మరిన్ని కీలక బిల్లులు కూడా సభ ముందుకు వచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం.
పార్లమెంటు నుంచి పంచాయతీ వరకు అన్ని ఎన్నికలనూ ఒకేసారి నిర్వహించడంపై మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ నేతృత్వంలో రూపొందించిన నివేదికకు భారత రాష్ట్రపతికి ఈ ఏడాది మార్చిలో అందించారు. దీనికి కేంద్ర మంత్రివర్గం ఈ సెప్టెంబరులోనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. తాజాగా ఈ బిల్లుకు కేంద్ర కేబినెట్ ఆమోదముద్ర వేసింది.
జమిలి ఎన్నికలపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతోన్న సమయంలో దీనిపై ఏకాభిప్రాయం సాధించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. విస్తృత సంప్రదింపుల కోసం జాయింట్ పార్లమెంటరీ కమిటీ- జేపీసీకి ఈ బిల్లును సిఫార్సు చేయాలని ప్రభుత్వం యోచిస్తున్నట్లు సమాచారం. వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో సంప్రదింపులు జరపడం సహా అన్ని భాగస్వామ్య పక్షాలకు అవకాశం కల్పించనున్నట్లు సమాచారం. అంతేకాకుండా ఉన్నత స్థాయి కమిటీ ద్వారా రాష్ట్రాల అసెంబ్లీ స్పీకర్లను సంప్రదించి వారితో సంప్రదింపులు జరపాలని ప్రభుత్వం ఆసక్తిగా ఉందని తెలుస్తోంది.