తల్లి తెలంగాణ విగ్రహానికి.. బేగంపేటలో ఆనాడు ఏర్పాటు చేసిన తెలంగాణ తల్లి విగ్రహానికి పోలికలు ఉన్నాయి... కాంగ్రెస్ ప్రభుత్వం ఆ విగ్రహాన్ని కాపీ కొట్టిందా?

 

Telangana: రాష్ట్రంలో తొలి తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించిన ఆ స్టార్ హిరోయిన్‌.. కాంగ్రెస్ ప్రభుత్వం ఆ విగ్రహాన్ని కాపీ కొట్టిందా?
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాది పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా విజయోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా తెలంగాణ తల్లి విగ్రహాన్ని సచివాలయంలో ఏర్పాటు చేస్తున్నారు. తెలంగాణ తల్లి విగ్రహ ఏర్పాటుపై రాజకీయ రగడ సాగుతోంది. తెలంగాణ తల్లి విగ్రహ నమూనాపై అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్‌ల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. ఇంతకు రాష్ట్రంలో తొలి తెలంగాణ తల్లి విగ్రహం ఎక్కడ ఏర్పాటు చేశారో తెలుసా..? ఆ విగ్రహం ఎక్కడ ఉందో తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే..

అది ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన కోసం సాగుతున్న ఉద్యమ రోజులవి.. ఉద్యమ సమయంలో యాదాద్రి జిల్లా రాజపేట మండలం బేగంపేటలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొట్ట మొదటి తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. స్థానిక తెలంగాణ ఉద్యమ కారుడు సుదగాని వెంకటేష్ ఆధ్వర్యంలో 2007 జనవరి 25న తల్లి తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు విజయశాంతి ఈ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఓ సాధారణ మహిళలా ఉన్న ఈ తల్లి విగ్రహానికి కిరీటం లేదు.. నగలు లేవు.. తెలంగాణ తల్లి అంటేనే శాంతి స్వరూపిణి అనే రీతిలో నాడు ఏర్పాటు చేశారు. విగ్రహావిష్కరణ సమయంలో బేగంపేటలో భారీ బహిరంగ సభ కూడా నిర్వహించారు.

ఇప్పుడు రేవంత్ సర్కార్ సెక్రటేరియట్‌లో ఏర్పాటు చేస్తున్న తల్లి తెలంగాణ విగ్రహానికి.. బేగంపేటలో ఆనాడు ఏర్పాటు చేసిన తెలంగాణ తల్లి విగ్రహానికి పోలికలు ఉన్నాయి. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన తెలంగాణ తల్లి విగ్రహానికి భిన్నంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేయనున్న కొత్త విగ్రహం ఉంది. బీఆర్ఎస్ తెలంగాణ తల్లి విగ్రహంలో కుడిచేతికి బంగారు గాజులుంటాయి. అదే చేతిలో మొక్కజొన్న కంకులు పట్టుకొని ఉంటుంది. పాత విగ్రహానికి కాళ్లకు వెండి పట్టీలున్నాయి. పాత విగ్రహానికి కిరీటం, చేతిలో బతుకమ్మ ఉంటుంది. రేవంత్ సర్కార్ ఏర్పాటు చేస్తున్న తెలంగాణ తల్లి విగ్రహంలో రాచరికపు హావభావాలకు భిన్నంగా.. వాస్తవ తెలంగాణ బహుజనుల ప్రతిరూపంగా.. తెలంగాణ తల్లి విగ్రహం ఉంది. కాంగ్రెస్ సర్కార్ తెలంగాణ తల్లి విగ్రహం ఆకుపచ్చ చీరలో నిలబడి ఉన్నట్లుగా తయారు చేశారు. కుడి చేతితో తెలంగాణ ప్రజలకు అభయహస్తం చూపుతూ.. ఎడమ చేతిలో తెలంగాణలో పండించే ముఖ్యమైన పంటలు వరి, మొక్కజొన్న, సజ్జ కంకులున్నాయి. వీటి ద్వారా గ్రామీణ జీవన విధానం, వ్యవసాయానికి గల ప్రాధాన్యాన్ని చాటిచెబుతుంది. ఆకుపచ్చ, ఎరుపు రంగులు తెలంగాణ ధీరవనితల పోరాటాన్ని ప్రతిబింబిస్తాయి. తెలంగాణ పోరాట స్పూర్తిని తెలిపేలా విగ్రహ పీఠంలో బిగించిన పిడికిళ్లు రూపొందించారు. 17 ఏళ్ల క్రితం తెలంగాణ తల్లి విగ్రహాన్నిఏర్పాటు చేసుకోవడం పట్ల బేగంపేట వాసులు గర్వంగా చెబుతున్నారు.

Previous Post Next Post

نموذج الاتصال