గులాబీ బాపు గత పదేళ్లలో ఏం చేశాడు? బీఆర్ఎస్ తెలంగాణను ఎలా డీల్ చేసింది?

 BRS: పాట పైలం, పోరు చరిత్ర పైలం, స్వరాష్ట్రం పైలం.. ఇది కవి గూడ అంజయ్య తన జీవితం చివరి రోజుల్లో హెచ్చరించిన మాట. ఆయన ఎందుకు ఈ మాటన్నారో తెలుసుకోవాలంటే గులాబీ బాపు గత పదేళ్లలో ఏం చేశాడు? బీఆర్ఎస్ తెలంగాణను ఎలా డీల్ చేసింది? తెలంగాణ రాక ముందు కవులను, కళాకారులను, అమరవీరులను, ఉద్యమకారులను ఎలా వాడుకుంది.. తెలంగాణ వచ్చాక ఎలా సైలెంట్ గా సైడ్ చేసిందన్న విషయాలను డీకోడ్ చేయాలి. ఎందుకంటే ఇప్పుడు తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ తర్వాత బీఆర్ఎస్ వెళ్లగక్కుతున్న అక్కసు వెనుక కూడా చాలానే రీజన్స్ ఉన్నాయి.



విగ్రహాన్ని ఇన్నేళ్లు ఎందుకు ప్రతిష్ఠించలేదు?

ఇప్పుడు సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని జయజయధ్వానాల మధ్య ఆవిష్కరిస్తే అవహేళన చేసేలా గులాబీ లీడర్లు మాట్లాడుతున్నారు. అయితే గత పదేళ్లు అధికారంలో ఉన్న కేసీఆర్.. ఇన్నేళ్లలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని అధికారికంగా ప్రకటించి ఎందుకు ప్రతిష్ఠించలేదు? తెలంగాణ రాష్ట్ర గీతాన్ని కూడా ఎందుకు తీసుకురాలేదు? ఉద్యమంలో పదం పదం కలిపిన కవులు, కళాకారులను ఎందుకు పక్కన పెట్టారు? ఉద్యమం జరిగేటప్పుడు అందరినీ వాడుకుని, పని ముగిశాక పూర్తిగా ముఖం చాటేయడం కూడా గులాబీ బాస్ కే చెల్లిందని కాంగ్రెస్ నేతలు గుర్తు చేస్తున్నారు.


వాహనాలపై TG రాసుకుంటే TS తెచ్చిన కేసీఆర్

ఇప్పటి ప్రభుత్వం ఆనాటి తెలంగాణ ఉద్యమ గుర్తులకు పట్టం కడుతోంది. అవును ఇన్నేళ్లు గులాబీ పాలనలో దగా పడ్డ కవులు కళాకారులకు యావత్ తెలంగాణ గర్వించేలా సన్మానాలు చేసింది. లోక కవి అందెశ్రీ రచించిన జయజయహే తెలంగాణ పాటను రాష్ట్రగీతంగా చేసింది. ఒక గూడ అంజయ్య, జయరాజ్, బండి యాదగిరి, గద్దర్ ఇలాంటి వారందరినీ సత్కరించి గౌరవించిన సందర్భం. సబ్బండ వర్గాలను ప్రతిబింబించేలా తెలంగాణ తల్లి విగ్రహ రూపాన్ని ఆవిష్కరించింది.

ఉద్యమ సమయంలో వాహనాలపై టీజీ అని అంతా రాసుకుంటే కేసీఆర్ మాత్రం TS అని మార్చారు. మళ్లీ దాన్ని టీజీకి మార్చడం ద్వారా అందరి మనోభావాలను కాంగ్రెస్ ప్రభుత్వం గౌరవించినట్లయింది. ఉద్యమంలో ముందుండి పిడికిలి బిగించి ఆట పాటల ద్వారా ఉర్రూతలూగించిన వారికి ఇన్నాళ్లకు గౌరవం దక్కుతుంటే కళ్లకు పింక్ రిబ్బన్లు కట్టుకున్న వారు ఓర్చుకోలేకపోతున్నారా అన్న డౌట్లు పెరుగుతున్నాయి. ఎందుకంటే వారి ఫ్రస్టేషన్ ఆ స్థాయిలో కనిపిస్తోంది.


స్వరాష్ట్రం, స్వపరిపాలన అని నినాదాలు ఎవరికోసం?


తెలంగాణ అంటే ఒక సెంటిమెంట్. ఉద్యమం అంటే జీవితకాలపు మధుర స్మృతి. లాఠీ దెబ్బలు తిన్న వారికి, ఉన్నదంతా పోగొట్టుకున్న వారికి, కేసులు నమోదైన వారికి, ప్రాణార్పణ చేసిన వారి కోసం ఆ నాటి ఉద్యమగుర్తులు ఉండాలి కదా. కనీసం పదేళ్లలో రాష్ట్ర గీతం ఆమోదించకపోవడం, తెలంగాణ తల్లి విగ్రహాన్ని అధికారికంగా ప్రతిష్ఠించకపోవడం.. స్వరాష్ట్రం, స్వపరిపాలన అని నినాదాలు ఇచ్చుకున్నది ఎందుకోసం అన్న ప్రశ్నలు సగటు తెలంగాణ వాసికి వస్తున్నాయి. ఉద్యమ గుర్తులన్నీ చెరిపేసి కేవలం కేసీఆర్, గులాబీ గుర్తులను మాత్రమే ఉంచే ప్రయత్నాలు జరిగాయా అన్న డౌట్లు అందరికీ రావడం పెద్ద ఆశ్చర్యమేమీ కాదు. ఇన్నాళ్లకైనా కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో తెలంగాణ గీతం ఆవిష్కరించారు. తెలంగాణ తల్లి విగ్రహాన్ని తీసుకొస్తే కేటీఆర్, కవిత ఏమంటున్నారో మీరే చూడండి.


కవులకు గౌరవం దక్కుతుంటే ఓర్వలేకున్నారా?


4 కోట్ల తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు ప్రతిరూపంగా, కవులు కళాకారులు, మేధావులు, సామాన్య జనం సూచనలు, సలహాలతో రూపొందించిన తెలంగాణ తల్లి విగ్రహంపై పింక్ లీడర్ల తిక్క మాటలు వారికే రివర్స్ అవడం ఖాయం. ఒకరు పాలాభిషేకం చేస్తుంటే.. మరొకరు విగ్రహాలను తరలిస్తామంటున్నారు. అయితే విగ్రహాలను, ఉద్యమ గుర్తులను కించపరిచేలా మాట్లాడినా, విష ప్రచారాలు చేసినా కఠిన చర్యలు తప్పని స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి హెచ్చరిస్తున్నారు. తెలంగాణ తల్లి విగ్రహం, తెలంగాణ రాష్ట్ర గీతంపై గులాబీ లీడర్లంతా అక్కసు వెళ్లగక్కుతున్నారు. ఇన్నాళ్లూ ఎందుకు తీసుకురాలేదన్న ప్రశ్నకు జవాబు లేదు. అధికారంలో ఉన్న పదేళ్లు, అంతకు ముందు చేసిందంతా మోసమే అని గుర్తు చేస్తున్నారా?


దశాబ్ది ఉత్సవాల థీమ్ లో అన్నీ కేసీఆర్ గుర్తులే


కొత్త సచివాలయం, కొత్తగా అమరుల జ్యోతి, పోలీస్ టవర్, రీడిజైన్ లో యాదగిరి గుట్ట.. ఇదే మారిన తెలంగాణ అంటూ గత పదేళ్లు కేసీఆర్ చూపించారు. 2023 జూన్ 2న తెలంగాణ దశాబ్ది ఉత్సవాలు మొదలు పెట్టిన కేసీఆర్ సర్కారు ఆ సంబురాల థీమ్ రిలీజ్ చేస్తే.. అందులో కనిపించినవన్నీ గులాబీ బాస్ గుర్తులే. తొలి, మలి తరం ఉద్యమకారులను పూర్తిగా ఫేడౌట్ చేసేశారు. తెలంగాణ ఏర్పాటుకు ముందే ఉన్న చిహ్నాలను, గుర్తులను పూర్తిగా పక్కన పెట్టేశారు. అసలైన తెలంగాణ సెంటిమెంట్ ఎక్కడికి పోయింది.. ఎందుకు పక్కన పెట్టారు. ఈ ప్రశ్నలకు జవాబు లేదు. అంతా మేమే.. అంతా మాదే అన్నది చెప్పుకోవడం కోసం అందరినీ నమ్మించి బలిపీఠం ఎక్కించారా?


కాళోజీని కనీసం స్మరించుకోని వైనం


తెలంగాణ అంటే సకల జనులు. ఒక కుటుంబమో.. ఒకరిద్దరో కాదు.. ఉద్యమం ఊపందుకోక ముందు నుంచే ప్రొఫెసర్ జయశంకర్ ప్రత్యేక రాష్ట్ర అవసరం గురించి చెప్పని చోటు లేదు, తిరగని ప్రాంతం లేదు. ఒకదశ దిశ చూపించారు. ఆయనను పక్కన పెట్టారు. ఇంకోవైపు తన జీవితాన్ని తెలంగాణ కోసమే అంకితమిచ్చిన కాళోజీని కనీసం స్మరించుకునే స్థానం లేకుండా చేసిన పరిస్థితి. స్వరాష్ట్రం వస్తే జయ జయహే పాటను రాష్ట్ర గీతంగా అమలులోకి తెస్తామని ఉద్యమ సందర్భంలో చెప్పి.. ఆ తర్వాత పదాలు దొరకలేదు, కూర్పు కాలేదన్న మాట వినిపించారు కేసీఆర్. అందెశ్రీని పూర్తిగా పక్కన పెట్టేశారు. లోకకవిగా పేరొందిన అందెశ్రీని ఒకదశలో సోషల్ మీడియాలో అద్దెశ్రీ అని, ఆంధ్రా శ్రీ అని విమర్శించిన పరిస్థితి.


గూడ అంజయ్య గుర్తుకెందుకు రాలేదు?


పుడితొక్కటి సత్తె రెండని గొంతెత్తిన గూడ అంజయ్యను దశాబ్ది ఉత్సవాల్లో కేసీఆర్ గుర్తు చేసుకోలేదు. తెలంగాణ మలిదశ ఉద్యమానికి ఊపిరిలూదిన ఎన్నో పాటలను గూడ అంజయ్య రచించారు. అయ్యోడివా.. నీవు అవ్వోడివా అని పాడినా, ఉస్మానియా క్యాంపస్‌లో ఉదయించిన కిరణమా అని ప్రేరేపించినా, రాజిగా ఒరి రాజిగా, లచ్చులో లచ్చన్న అంటూ పదం పదం కలిపినా అది గూడ అంజయ్యకే చెల్లింది. అలాంటి మహా కవికి మరణానంతరం ఇప్పుడు రేవంత్ సర్కారు నీరాజనం పడితే ఓర్వలేని పరిస్థితి.


పార్టీ కోసం ఇల్లు ఇచ్చిన కొండా లక్ష్మణ్ బాపూజీని పక్కన పెట్టలేదా?


గత 60 ఏళ్ల పోరాటంలో కొట్లాడినోళ్లు, పాటలు రాసినోళ్లు, పాడినోళ్లు, ప్రాణాలు అర్పించిన వారి ప్రమేయమే లేదన్నట్లుగా పరిస్థితులు సాగాయి. అడుగడుగునా మోసమే. చివరికి టీఆర్ఎస్ నుంచి తెలంగాణ ఆత్మ తీసేసి బీఆర్ఎస్ గా మార్చేసుకోవడమూ వారికే చెల్లింది. టీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ కోసం స్థలం ఇచ్చిన కొండా లక్ష్మణ్ బాపూజీని, తెలంగాణ కోసం తన పార్టీని విలీనం చేసిన ఆలె నరేంద్ర, విజయశాంతిని పక్కన పెట్టేశారు.


తెలంగాణ కోసం తనతో ప్రయాణం చేసిన పాశం యాదగిరి, గాదె ఇన్నయ్య, దేశం చినమల్లయ్య, పాపారావు, మేచినేని కిషన్ రావు, సుదర్శన్ రావు రహమాన్ ఇలా చాలా మందిని వెంట తిప్పుకుని చివరికి దూరం పెట్టేశారు. దళితుడిని ముఖ్యమంత్రిని చేస్తానని దళితులను మోసం చేసిన పరిస్థితి. ఉద్యమ సమయంలో తెలంగాణ తల్లిని, విగ్రహాలను అడ్డం పెట్టుకొని అధికారంలోకి వచ్చాక పక్కన పెట్టి తెలంగాణ తల్లిని మోసం చేసిన చరిత్రను గుర్తు చేస్తున్నారు. పదేళ్లలో అధికారికంగా తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించేందుకు మనసు ఒప్పలేదా అని ప్రశ్నలకు జవాబు ఉందా?


అడ్రస్ లేదని అమరవీరులను గుర్తించలేని పరిస్థితి


ఉద్యమ సమయంలో అమరవీరుల త్యాగాలను అడ్డంపెట్టుకున్న కేసీఆర్ (kcr) అధికారంలోకి వచ్చాక వారి కుటుంబాలను పట్టించుకోలేదు. ఉద్యమం సమయంలో ఆత్మ బలిదానాలు చేసుకున్న వారి సంఖ్య 1,230. కానీ, ఆ నాటి కేసీఆర్ ప్రభుత్వం గుర్తించింది 419 మందినే. FIR లేదని, అడ్రస్ లేదని చెప్పి చాలా మందిని పక్కన పెట్టేశారు. కానీ ఎక్కడో ఉన్న పంజాబ్ లో మాత్రం రైతు ఉద్యమాల్లో పాల్గొని చనిపోయిన 700 మంది పంజాబ్ రైతుల అడ్రస్ కనుక్కుని మరీ సహాయం చేసి వచ్చారు కేసీఆర్. ఉద్యమ సమయంలో కెసిఆర్ మాటలు నమ్మి ఉద్యమంలో పాల్గొని కేసుల పాలై జైలుకి వెళ్లి ఆస్తులను పోగొట్టుకున్న అనేక మంది ఉద్యమకారులను పట్టించుకోలేదు.


కుటుంబ సభ్యులకే అందలమివ్వడం మర్చిపోతారా?


అంతే కాదు ఉద్యమ సమయంలో తాను, తన భార్య మాత్రమే ఉన్నాం.. తన కొడుకు కూతురు అమెరికాలో ఉన్నారు అని చెప్పి అధికారంలోకి రాగానే కుటుంబ సభ్యులకే పదవులు కట్టబెట్టింది ఎవరి మర్చిపోయారు. ఉద్యమ సమయంలో తెలంగాణ రాష్ట్రం వచ్చాక తాను కాపలా కుక్కలా ఉంటానని చెప్పి.. రాష్ట్రం ఏర్పడ్డాక సీఎం పీఠం ఎక్కడం మోసం చేసినట్లు కాదా అని గుర్తు చేస్తున్నారు ఉద్యమకారులు. తెలంగాణ ఇస్తే టీఆర్ఎస్‌ను (trs) ను కాంగ్రెస్‌లో విలీనం చేస్తానని చెప్పి రాష్ట్రం వచ్చాక సోనియాగాంధీకే షాక్ ఇచ్చిన చరిత్ర కేసీఆర్ ది. గన్ పార్క్ లో ఉన్న అమరవీరుల స్థూప రూపకర్త ఎక్కా యాదగిరి రావును వాడుకొని అధికారంలోకి వచ్చాక ఆయనను విస్మరించడం దేనికి నిదర్శనం?


కేసీఆర్ చేతిలో కేటీఆర్ కూ పరాభవం తప్పలేదా?


ఉద్యమ సమయంలో TG సెంటిమెంట్ ను రగిలించి అధికారంలోకి వచ్చాక వాహనాలకు ముందు TS అని ప్రకటించి పార్టీ పేరును వచ్చేలా చూసుకున్నది నిజం కాదా? చివరికి కేసీఆర్ చేతిలో కేటీఆర్ కూ పరాభవం తప్పలేదని గుర్తు చేస్తున్నారు హస్తం నేతలు. మోడీ దగ్గర్నుంచి సహచర మంత్రుల దాకా కేటీఆరే నెక్ట్స్ సీఎం అన్న విషయాలను ప్రస్తావించి చివరికి సీఎం చేయకుండానే ఆపేశారు. అంతా కేసీఆర్ చేతుల్లోనే ఉన్నా చేయలేకపోయారు.


తెలంగాణ వస్తే మొక్కులు చెల్లించుకుంటాను అని మొక్కి అధికారంలోకి వచ్చాక ప్రభుత్వ సొమ్ములతో మొక్కులు చెల్లించుకున్న పరిస్థితి. సీఎం పీఠంకోసమేనా ఈ మొక్కులన్నీ అన్న ప్రశ్నలకు జవాబు ఉందా? సో కేసీఆర్ ఒకటి చెప్పారు అంటే అది కచ్చితంగా చేయరు అన్న నమ్మకం ఉంటుంది. నీకెందుకు.. నేనున్నానని ఎవరికైనా చెబితే అది వట్టిదే అని గ్రహించాలి అన్నంతగా రూపం మార్చారు గులాబీ బాపు. ఇప్పుడేమో తెలంగాణ అసలైన గుర్తులను అధికారికంగా తెరపైకి తెస్తుంటే మాత్రం అదే అక్కసు చూపిస్తున్నారు. ఇదెక్కడి దిక్కుమాలిన లాజిక్ అంటూ కాంగ్రెస్ నేతలు ఫైర్ అవుతున్నారు.

Previous Post Next Post

نموذج الاتصال