తనపై ఎవరు చెప్పారని పోలీసులు కేసులు నమోదు చేశారో చెప్పాలని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ప్రశ్నించారు. రేవంత్ ప్రభుత్వం ప్రశ్నించొద్దని చెబితే కాంగ్రెస్ నేతలు జిల్లాలో ఏం చేసినా తాము నోరు తెరువమని అన్నారు. తాను కేసులు పెడితే భయపడే రకం కాదని చెప్పారు.
మహబూబ్ నగర్: కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్ని అక్రమ కేసులు పెట్టినా తాను భయపడనని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. ఇవాళ(శుక్రవారం) బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. సోషల్ మీడియాలో పోస్టులు పెడితే తమపై కేసులు పెడుతున్నారని మండిపడ్డారు. కేసు నమోదైన వరద భాస్కర్ కుటుంబాన్ని తాము పలకరించడానికి వెళ్తే భాస్కర్ తల్లి కన్నీరు పెట్టిందని శ్రీనివాస్ గౌడ్ అన్నారు.
తనను పోలీసులు చిత్రహింసలకు గురిచేశారని వరద భాస్కర్ తమకు చెప్పి ఆవేదన వ్యక్తం చేశారని అన్నారు. వికలాంగుల ఇళ్లు కూల్చి వారిని రోడ్డుపై పడేశారని చెప్పారు. ఇప్పటికి ఇంకా చాలా ఇళ్లను కూలుస్తామని సీఎం రేవంత్‌రెడ్డి భయపెడుతున్నారని మండిపడ్డారు. ప్రస్తుతం మహబూబ్‌నగర్‌లో సరైన వైద్యం అందడం లేదని అన్నారు. పేదలకు సరైన వైద్యం అందలేదని మంచి హాస్పిటల్ నిర్మాణం కోసం కేసీఆర్ ప్రభుత్వంలోనే ఆదేశాలు ఇచ్చానని శ్రీనివాస్ గౌడ్ గుర్తుచేశారు.
బీఆర్‌ఎస్ హయాంలో ప్రారంభమైన హాస్పిటల్‌ను పూర్తి చేయడం ఇప్పటికి ప్రస్తుత ఎమ్మెల్యేకు సాధ్యం కావడం లేదని చెప్పారు. ఇంజినీరింగ్ కాలేజీలు కూడా తమ హయాంలోనే ఇక్కడికి తీసుకువచ్చామని గుర్తుచేశారు. అసత్య ప్రచారాలతో తాము కాంగ్రెస్ నేతలను ఎన్నికల్లో ఓడించలేక పోయామని అన్నారు. న్యాయం చేయమని అడిగితే అక్రమ కేసులు బనాయిస్తురని శ్రీనివాస్ గౌడ్ ధ్వజమెత్తారు.
ప్రజా వ్యతిరేక విధానాలపై రేవంత్ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే తమ నోరు మూయిస్తున్నారని ఫైర్ అయ్యారు. మంచి ప్రభుత్వం అంటే పేదల పక్షానా నిలబడాలని.. కానీ ఇక్కడ చెరువులు, నాలాల పేర్లు చెప్పి ఇళ్లను కూల్చివేస్తున్నారని.. ఇది ఎంతవరకు సమంజసం అని నిలదీశారు. కూలగొట్టిన ఇంటి స్థానంలో పేదలకు తిరిగి కొత్త ఇళ్లు కట్టివ్వాలని శ్రీనివాస్ గౌడ్ డిమాండ్ చేశారు. జర్నలిస్టులకు కూడా బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఇల్లు ఇచ్చామని స్పష్టం చేశారు. బీఆర్ఎస్ పాలనలో మహబూబ్‌నగర్‌ను చూసి ప్రతి ఒక్కరూ ఆశ్చర్యపోయారని అన్నారు. ఎవరూ చెప్పారని పోలీసులు తనపై కేసులు నమోదు చేశారో చెప్పాలని నిలదీశారు. తాను కేసులు పెడితే భయపడే రకం కాదని అన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి ముందు ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని శ్రీనివాస్ గౌ
డ్ కోరారు.