ఊరుకు పదిమంది తయారు కండి
-ప్రక్షాళన దిశగా ముదిరాజ్ మహాసభ అడుగులు
-రాజ్యాధికారం ఎలా రాదో చూద్దాం
-పేరు చివరన ఓటర్ లిస్టులో ముదిరాజ్ పెట్టుకోండి
-స్థానిక సంస్థల ఎన్నికల తోనే రాజ్యాధికారానికి నాంది
-ముదిరాజ్ మహాసభ జాతీయ ప్రధాన కార్యదర్శి కాసాని వీరేష్ ముదిరాజ్
మహబూబ్ నగర్: గతంలో జరిగిందేదో జరిగిపోయింది... ప్రస్తుతం నడుస్తున్న ట్రెండ్ కు అనుగుణంగా మన ఆలోచన విధానం మారాలి... చైతన్యం ఉంది... ఐక్యత ఉంది... మనపై నమ్మకమే రావడం లేదు.... అందుకోసం ముదిరాజ్ మహాసభ రాష్ట్ర కమిటీ ప్రక్షాళన దిశగా అడుగులు వేస్తుందని, ఊరుకు పదిమంది చైతన్యవంతులను తయారు చేయాలని, రాజ్యాధికారం ఎలా రాదో చూద్దామని ముదిరాజ్ మహాసభ జాతీయ ప్రధాన కార్యదర్శి కాసాని వీరేష్ పిలుపునిచ్చారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని కాళికాంబ కళ్యాణ మండపంలో ఏర్పాటుచేసిన ముదిరాజ్ మహాసభ పార్లమెంటు ముదిరాజ్ ముఖ్య నాయకుల సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాలానుగుణంగా ప్రస్తుతం సంఘం నిర్మాణంలోనూ మార్పులు రావాల్సిన అవసరం ఉందన్నారు. ముదిరాజుల ఆలోచనలు, సోషల్ మీడియా పోకడలు అంచనా వేసి అందుకు అనుగుణంగా సంఘం నిర్మాణంతో పాటు ముదిరాజుల హక్కుల సాధన, ఆర్థిక చైతన్యం, రాజ్యాధికారం వంటి అంశాలపై దృష్టి పెట్టాలని పిలుపునిచ్చారు. రాజకీయ పార్టీలు ముఖ్యం కాదని, అంతిమంగా కులమే ముఖ్యమని అన్నారు. ముదిరాజుల్లో చైతన్యం, ఐక్యత ఉన్నప్పటికీ రాజ్యాధికారానికి దూరమైపోయి రాజకీయ పార్టీల ఉచ్చులో పడడంతో కులానికి అన్యాయం జరుగుతుందని, దీన్ని అధిగమించేందుకు ఎలా ముందుకు పోవాలనే దానిపై తీవ్రంగా అన్వేషించడం జరిగిందని అన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోను ప్రస్తుతం తెలంగాణలోనూ అతి తక్కువ జనాభా ఉన్న కులమే 40 కి పైగా అసెంబ్లీ స్థానాలను కైవసం చేసుకుంటూ చట్టసభల్లో అడుగుపెడుతున్నారని అన్నారు. మారుతున్న జనరేషన్ ఆలోచన విధానాలకు అనుగుణంగా సంఘం ఆలోచనలు కూడా మారాలనే పంతాలో అన్ని జిల్లాల్లో సమావేశాలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ముదిరాజులు జనాభాలో అత్యధిక శాతం ఉన్నప్పటికీ రాజ్యాంగ ఫలితాలు అనుభవించకపోవడానికి కారణాలను వివరించారు. రాజకీయంగా ఆర్థికంగా ముదిరాజులు ఎదగాలంటే కచ్చితంగా ఓటర్ లిస్టులో పేరు చివరన ముదిరాజ్ ట్యాగ్ లైన్ కచ్చితంగా మార్పు చేయించుకోవాలని సూచించారు. ప్రస్తుతం ఓటర్ లిస్టు ఆధారంగానే రాజకీయాలు నడుస్తున్నాయని, తద్వారానే ఆయా కులాలకు మేలు జరుగుతుందని అన్నారు. ప్రతి ముదిరాజ్ తప్పనిసరిగా ఓటర్ లిస్టులో ముదిరాజ్ ట్యాగ్ లైన్ పెట్టుకోవాలని సూచించారు. అప్పుడే మనం ఎంతో.. మనకు ఎంత కేటాయిస్తున్నారు... రాజకీయపరంగా ఎన్ని సీట్లు కేటాయిస్తున్నారు అనే దానిపై స్పష్టత వస్తుందని పేర్కొన్నారు. చట్టసభల్లో ముదిరాజులకు రిజర్వేషన్లు రావాలంటే ఖచ్చితంగా ముదిరాజులు ఓటర్ లిస్టులో మార్పు చేయించుకోవాలని పిలుపునిచ్చారు. ముదిరాజులకు రాజ్యాధికారం ఎందుకు రాదో చూద్దామని, తాను రాబోయే ఎన్నికల్లో కచ్చితంగా 20 నుంచి 30 మంది ఎమ్మెల్యేలను రాష్ట్రంలో గెలిపించే బాధ్యత తీసుకుంటానన్నారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలే లక్ష్యంగా ముదిరాజులు రాజ్యాధికారం దిశగా ముందుకు నడవాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో ముదిరాజ్ మహాసభ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మెట్టుకాడి శ్రీనివాస్, జిల్లా అధ్యక్షుడు రామ్ శ్రీనివాస్, నారాయణపేట జిల్లా అధ్యక్షుడు వేణుగోపాల్ తదితరులు పాల్గొన్నారు.
