లక్ష్మారెడ్డీ.. ఇవిగో నీ భూఅక్రమాలకు ఆధారాలు

 లక్ష్మారెడ్డీ.. ఇవిగో నీ భూఅక్రమాలకు ఆధారాలు





నేను చేసిన ఆరోపణలన్నింటికీ ఆధారాలు చూపించా

అయినా నువ్వు కాంగ్రెస్ పార్టీలోకి రావొద్దు

జడ్చర్ల ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్ రెడ్డి

జడ్చర్ల, సెప్టెంబర్ 9: జడ్చర్ల లోని సర్వే నెంబర్.149 లో ఉన్న భూములను మాజీ మంత్రి లక్ష్మారెడ్డి బంధువులు, అనుచరుల పేరిట భూకబ్జాలకు పాల్పడ్డారని జడ్చర్ల ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్ రెడ్డి ఆరోపించారు. ఈ సర్వే నెంబర్ లోని భూములతో పాటుగా అక్కడే ఉన్న ఆర్ అండ్ బి రోడ్డు కు చెందిన 22 గుంటల భూమిని కూడా అక్రమంగా తమ పేరిట రిజిష్టర్ చేసుకున్నారని చెప్పారు. ఈ కబ్జాలకు సంబంధించిన అధికారిక ఆధారాలను ఆయన సోమవారం మీడియా ప్రతినిధులకు అందించారు.

జడ్చర్ల ప్రభుత్వాసుపత్రి నిర్మించిన సర్వే నెంబర్ 149 లో లక్ష్మారెడ్డి ఆయన అనుచరులు, బంధువులు కబ్జాలకు పాల్పడ్డారని గతంలో అనిరుధ్ రెడ్డి ఆరోపించగా, ఆయన చేసిన ఆరోపణలను నిరూపించాలని లక్ష్మారెడ్డి సవాల్ చేసారు. ఈ సవాల్ కు స్పందించిన అనిరుధ్ రెడ్డి సోమవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో లక్ష్మారెడ్డి వర్గీయుల భూ ఆక్రమణలకు సంబంధించిన అధికారిక ఆధారపత్రాలను ప్రదర్శించారు. సర్వే నెంబర్ 149 లో 7.33 ఎకరాల భూమి ఉండగా అందులో 3 ఎకరాల భూమిని 1988 లో మత్స్యేంద్రనాథ్ అనే మాజీ మిలటరీ ఉద్యోగికి పట్టాగా ఇచ్చారని అనిరుధ్ చెప్పారు. ఈ 3 ఎకరాల్లో 22 గుంటల భూమి కల్వకర్తి రోడ్డులో కలిసిందని తెలిపారు. ఈ 22 గుంటలు పోను మిగిలిన భూమిని మాత్రమే మత్స్యేంద్రనాథ్ నుంచి కొనుగోలు చేయాల్సి ఉండగా లక్ష్మారెడ్డి బంధువులు రోడ్డు కోసం ప్రభుత్వం తీసుకున్న 22 గుంటల భూమిని కూడా అక్రమంగా రిజిష్టర్ చేసుకున్నారని వివరించారు. సర్వే నెంబర్ 149 లో మిగిలిన భూమిలో ప్రభుత్వాసుపత్రి కోసం సరెండర్ చేసిన భూమిని కూడా ప్లాట్లుగా చేసి తమ వారి పేరిట రిజిష్టర్ చేసుకున్నారని చెప్పారు. వారి రిజిష్టర్ పత్రాల్లో ఆస్పత్రికి వెళ్లే 33 అడుగుల రోడ్డు ఒకవైపు ఉందని చూపిస్తూ, వాస్తవంలో మాత్రం ఎక్కడా రోడ్డును వదలకుండా మొత్తం భూమికి ప్రహారీ గోడలను నిర్మించుకున్నారని అనిరుధ్ విమర్శించారు. ఇదే సర్వే నెంబర్ లో దళితులకు కేటాయించిన భూములను కూడా ఎలాంటి పరిహారం ఇవ్వకుండా లక్ష్మారెడ్డి లాగేసుకున్నారని ఆరోపించారు. దీనికి సంబంధించిన బాధితురాలు మాట్లాడుతూ తమకు డబ్బు ఇవ్వకుండా బెదిరించి తమతో బలవంతంగా సంతకాలు చేయించారని రోదించారు. ఇదే సర్వే నెంబర్ లో 1.10 ఎకరాల భూమిని లక్ష్మారెడ్డి మేనల్లుడి ఇంట్లో పని చేసే శివయ్య అనే వ్యక్తి పేరిట రికార్డుల్లోకి ఎక్కించారని ఆరోపిస్తూ, దానికి సంబంధించిన ఆధారాలను కూడా చూపించారు. తన బంధువులు, అనుచరుల భూములకు విలువ రావాలనే ఉద్దేశ్యంతోనే లక్ష్మారెడ్డి గట్టు మీద తన వారితో కబ్జా చేయించిన భూములను పెట్టుకొని ప్రభుత్వాసుపత్రిని మాత్రం వినాయకులను నిమజ్జనం చేసే లోతట్టు ప్రాంతంలో నిర్మించారని అనిరుధ్ దుయ్యబట్టారు. ఈ ఆస్పత్రి నిర్మాణానికి మున్సిపాలిటీ, ఇరిగేషన్ అధికారుల నుంచి ఎలాంటి అనుమతులు కూడా తీసుకోలేదని వివరించారు. ఇరిగేషన్ శాఖ ఇఇ కృష్ణ మోహన్ ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి చెప్పిన మాట వాస్తవమేనని ధృవీకరించారు. ప్రభుత్వం రోడ్డు కోసం తీసుకున్న 22 గుంటల భూమిని అక్రమంగా రిజిష్టర్ చేసుకున్న లక్ష్మారెడ్డి ఇప్పుడు తామేదో దాన కర్ణుడిలాగా ప్రభుత్వాసుపత్రి కోసం తమ సొంత భూమి ఇస్తామంటూ ప్రకటనలు చేయడం హాస్యాస్పదంగా ఉందన్నారు. తమ భూ కబ్జాలను నిరూపిస్తే తాను ముక్కును నేలకు రాసి బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ లో చేరుతానని లక్ష్మారెడ్డి సవాల్ చేసారని, ఆయన సవాల్ కు ప్రతి సవాల్ గానే తాను లక్ష్మారెడ్డి భూక్జాలకు చెందిన ఆధారాలను మీడియా ప్రతినిధుల ముందు పెడుతున్నానని చెప్పారు. అయితే తాను చేసిన ఆరోపణలను తాను నిరూపించినప్పటికీ లక్ష్మారెడ్డి కాంగ్రెస్ పార్టీలోకి రాకూడదని అన్నారు. లక్ష్మారెడ్డి కూడా కాంగ్రెస్ లోకి వచ్చి తనతో పాటు పని చేస్తే తాను కూడా ఆయన లాగే భూ కబ్జాలు చేస్తానని ప్రజలు భావించే ప్రమాదం ఉందని అభిప్రాయపడ్డారు. కాగా తాను ప్రస్తుతం ప్రభుత్వాసుపత్రి భూములకు చెందిన సర్వే నెంబర్ 149 గురించి మాత్రమే మాట్లాడానని, భవిష్యత్ లో లక్ష్మారెడ్డి ఆయన అనుచరులు చేసిన అన్ని అక్రమాలను బయటపెడతానని అనిరుధ్ రెడ్డి ప్రకటించారు.


Previous Post Next Post

نموذج الاتصال

💬 Chat 📢 Follow