అధికారం శాశ్వతం కాదు.. ప్రజలు, కార్యకర్తలే నాకు ముఖ్యం.. అంటూ షాద్ నగర్ ఎమ్మెల్యే షాద్ నగర్ ఎమ్మెల్యే "వీర్లపల్లి శంకర్"

అధికారంలో ఒక్కడిది కాదు మీ అందరిదీ



 షాద్ నగర్ ఎమ్మెల్యే "వీర్లపల్లి శంకర్" 


 "అమ్మతోడు" అణువంత అధికార దర్పం నాకు లేదు 


 పార్టీకి చెడ్డ పేరు రాకుండా న్యాయంగా పాలించాలనుకుంటున్నా 


 అధికారం నాకు శాశ్వతం కాదు ప్రజలు, కార్యకర్తలే నాకు ముఖ్యం 


 కోపం ఉన్నచోటే అన్నం ఉంటుంది - మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ రెడ్డి కీలక వ్యాఖ్యలు 


అధికారం నా ఒక్కడిదే కాదు నన్ను గెలిపించి ఈ స్థాయికి తీసుకువచ్చిన మీ అందరిదీ.

మా అమ్మ తోడుగా చెబుతున్న నాకు అణువంత కూడా అధికార దర్పం లేదు. అధికారం శాశ్వతం కాదు.. ప్రజలు, కార్యకర్తలే నాకు ముఖ్యం.. అంటూ షాద్ నగర్ ఎమ్మెల్యే "వీర్లపల్లి శంకర్" కీలక వ్యాఖ్యలు చేశారు. శనివారం షాద్ నగర్ పట్టణ శివారులోని ఎన్ హెచ్ 44 హోటల్లో నిర్వహించిన సమన్వయ కమిటీ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్, మాజీ ఎమ్మెల్యే చౌలపల్లి ప్రతాప్ రెడ్డి, మాజీ జెడ్పిటిసి మామిడి శ్యాంసుందర్ రెడ్డి, మాజీ ఎంపీపీ శివశంకర్ గౌడ్, సీనియర్ నేతలు మహమ్మద్ అలీ ఖాన్ బాబర్, పి. రఘు బాలరాజ్ గౌడ్, ఆరు మండలాల పార్టీ అధ్యక్షులు ముఖ్యమైన నాయకులు తదితరులు నియోజకవర్గ స్థాయిలో హాజరయ్యారు. ఈ సమన్వయ కమిటీని ఉద్దేశించి ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ మొదటిసారిగా కీలక వ్యాఖ్యలు చేశారు. అధికారం తన హస్తగతం అయ్యాక ఎప్పుడు న్యాయబద్ధంగా ధర్మబద్ధంగా పాలించేందుకు చొరవ చూపినట్టు తెలిపారు. ప్రజలు ఎంతో విశ్వాసంతో తనకు అధికారాన్ని అప్పజెప్పారని ఇందులో కీలకపాత్ర పోషించిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ఎల్లవేళల రుణపడి ఉంటానని తెలిపారు. ప్రజలు పెట్టుకున్న ఆశలను వమ్ము చేయకుండా నిత్యం వారికి అభివృద్ధి ఫలాలు అందించాలనే ఉద్దేశంతో రాత్రింబవళ్లు పనిచేస్తున్నట్టు చెప్పారు. ఈ నేపథ్యంలో భూముల పంచాయతీలు, ఇతర వ్యాపకాలు, పార్టీకి ప్రభుత్వానికి చెడ్డ పేరు వచ్చే ఎలాంటి చర్యలను తాను దరి చేరనివ్వలేదని కీలకంగా విషయాలు ఎమ్మెల్యే శంకర్ ప్రస్తావించారు. ఈ విషయాలు ఎవరికైనా సొంత పార్టీ వారికి కూడా నష్టం జరిగినా తాను మాత్రం నీతి నిజాయితీగా ఉండాలని అనుకున్నానని చెప్పారు. ఈ నేపథ్యంలో కొంతమందికి నష్టం జరిగిందని తెలిసినప్పటికీ కూడా పార్టీ ప్రతిష్టను ప్రభుత్వ గౌరవాన్ని కాపాడేందుకే ప్రయత్నించానని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. ఎమ్మెల్యే అయ్యాక ఏనాడు అధికార దర్పణం ప్రదర్శించలేదని అన్నారు. పని ఒత్తిడిలో ఏదైనా చిరుబురులాడితే ఆ తర్వాత మళ్లీ వారిని సర్ది చెప్పినట్టు చెప్పారు. తన వల్ల ఎవరికైనా మనసుకు ఇబ్బంది కలిగిస్తే క్షమించాలని ఎమ్మెల్యే చెప్పారు. కార్యకర్తల ప్రయోజనాలు ప్రజల అభివృద్ధి తనకు ఎంతో ముఖ్యమని అన్నారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో రోజు ఉదయం వేళ కార్యకర్తలకు గంటపాటు అందుబాటులో ఉంటున్నానని స్పష్టం చేశారు. మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ రెడ్డి ఇంకా పార్టీలో అనేక మంది పెద్దలు కీలక నాయకులు, కార్యకర్తలు వారి మాట నాకు శిరోధార్యమని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. కలిసికట్టుగా నిజాయితీతో సుపరిపాలన అందిద్దామని ఎమ్మెల్యే విజ్ఞప్తి చేశారు. అధికారం శాశ్వతం కాదని అందుకే కార్యకర్తల మనసు నొప్పించకుండా భవిష్యత్తులో అందరి సూచన సలహాలు పాటిస్తానని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. 


 కార్యకర్తలకు సమయం కేటాయించాలి - మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ రెడ్డి 


కాంగ్రెస్ పార్టీలో అభివృద్ధి ఒకవైపు కార్యకర్తలు మరోవైపుగా భావించి ఇరువర్గాలకు ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ న్యాయం చేయాల్సిన ఆవశ్యకత ఉందని మాజీ ఎమ్మెల్యే చౌలపల్లి ప్రతాప్ రెడ్డి కీలక సూచనలు చేశారు. ఈ సమావేశంలో ఆయన ప్రసంగిస్తూ.. ప్రభుత్వం ఏర్పాటు అయ్యాక ఎనిమిది నెలల తర్వాత మొదటి సమావేశం ఏర్పాటు చేస్తున్నామని ఇంకెప్పుడు ఇలా కాకుండా సమస్యల పరిష్కారం కోసం ఎప్పటికప్పుడు తరచూ సమావేశాలు ఏర్పాటు చేస్తూ ఉండాలని పేర్కొన్నారు. కార్యకర్తలకు కనీసం రెండు గంటలైనా రోజుకు సమయం కేటాయించాలని, ప్రజా సమస్యలను పట్టించుకోవాలని అప్పుడే పార్టీ అన్ని విధాల ముందుకు సాగుతుందని అన్నారు. ఎమ్మెల్యేతో మాట్లాడడానికి పనులు చేయించుకోవడానికి కొంతమంది కార్యకర్తలు భయపడుతున్నారనే కొన్ని విషయాలు తన దృష్టికి తెచ్చారని వాస్తవానికి కోపం ఉన్నచోటే అన్నం ఉంటుందని ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ కార్యకర్త శ్రేయస్సు కోసమే ఆయన ఆలోచనలు ఉంటాయని దీనిని ఎవరు తప్పుగా భావించాల్సిన అవసరం లేదని అన్నారు. రాజకీయంగా ఒత్తిడిలు ప్రభుత్వపరంగా పనులు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల నిర్వహణకు ఎంతో ఒత్తిడి ఉంటుందని వీటిని దాటుకుంటూ కార్యకర్తలకు పని చేసే విధానాల్లో కొంత అలసత్వం జరగవచ్చని ఇకపై అలాంటి పరిస్థితులు రాకుండా ఉండాలని మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ రెడ్డి ఎమ్మెల్యే శంకర్ కు సూచించారు. పార్టీలొ పాత కొత్తల కలయికను పట్టించుకోవద్దని అందరూ సమానమేనని కాంగ్రెస్ కండువా కప్పుకున్న ప్రతి కార్యకర్త ఎమ్మెల్యేకు సమానమేనని అన్నారు. రాబోయే ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని పార్టీల చేరికలు తదితర అంశాలలో పార్టీ బలోపేతానికి అందరూ సహకరించాలని వాళ్లు వీళ్లు వద్దు అనే ప్రస్తావనలు రావద్దని అందరం కలిసికట్టుగా పార్టీని ముందుకు నడిపించాల్సిన అవసరం ఉందని అన్నారు. ఎల్లప్పుడూ పార్టీకి సేవలు అందించడానికి తాను సంసిద్ధంగా ఉన్నానని ప్రతాప్ రెడ్డి స్పష్టం చేశారు. తాము కోరినట్టుగా తమకు ఎమ్మెల్యే పదవిని అందించిన కార్యకర్తలకు ఎల్లవేళలా రుణపడి ఉంటామని అన్నారు. 


 కార్యకర్తలను గెలిపించుకుంటాం - మామిడి శ్యాంసుందర్ రెడ్డి 


రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలలో సర్పంచులుగా జెడ్పిటిసిలుగా ఎంపీపీలుగా ఎంపీటీసీలుగా అనేక హోదాలలో కార్యకర్తలను గెలిపించుకోవడానికి సిద్ధంగా ఉన్నామని మాజీ జెడ్పిటిసి శ్యామ్ సుందర్ రెడ్డి ప్రకటించారు. రాబోయే ఎన్నికలలో ఎలాంటి వివక్ష లేకుండా కష్టపడ్డ ప్రతి కార్యకర్తను అందలమెక్కించేందుకు శ్రీకారం చూట్టామని శ్యాంసుందర్ రెడ్డి అన్నారు. గత అసెంబ్లీ పార్లమెంటు ఎన్నికల్లో కూడా కార్యకర్తలు కష్టపడి కాంగ్రెస్ పార్టీకి మెజార్టీ సాధించి ఇచ్చారని అందుకు అనుగుణంగా వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో కార్యకర్తలు నాయకులకు గుండెల్లో పెట్టుకొని చూసుకుంటామని వారి గెలుపుకు కష్టపడతామని వారు అన్నారు. ఈ సందర్భంగా సమన్వయ కమిటీ సమావేశంలో కార్యకర్తలు నాయకులు తమ అభిప్రాయాలను కూలంకషంగా చర్చించుకున్నారు. మనసులో ఎలాంటి భేదాభిప్రాయాలు లేకుండా ప్రతి విషయాన్ని చర్చించి ముందుకు సాగేందుకు సంసిద్ధం అయ్యారు.. 

Previous Post Next Post

نموذج الاتصال

💬 Chat 📢 Follow