పాలమూరు టు పట్నం.. జనరల్‌ సర్జరీ, జనరల్‌ మెడిసిన్‌ కేసులే అధికం

 జనరల్‌ సర్జరీ, జనరల్‌ మెడిసిన్‌ కేసులే అధికం



రోజుకు 10 వరకు 108 అంబులెన్స్‌లు ఉస్మానియా, గాంధీ ఆస్పత్రులకు..

అత్యవసర సమయంలో అంబులెన్సులు దొరకని పరిస్థితి

ఆస్పత్రి వైద్యాధికారుల పర్యవేక్షణ లోపమే కారణం

హైదరాబాద్‌ వెళ్లాల్సిన పనిలేకుండా మహబూబ్‌నగర్‌ జనరల్‌ ఆస్పత్రిలోనే అన్ని రకాల వైద్యసేవలు అందించేందుకు కృషి చేస్తున్నామని ప్రజాప్రతినిధులు గొప్పలు చెబుతున్నా.. వాస్తవ పరిస్థితులు అందుకు విరుద్ధంగా ఉన్నాయి.

మహబూబ్‌నగర్‌  జూలై 31: హైదరాబాద్‌ వెళ్లాల్సిన పనిలేకుండా మహబూబ్‌నగర్‌ జనరల్‌ ఆస్పత్రిలోనే అన్ని రకాల వైద్యసేవలు అందించేందుకు కృషి చేస్తున్నామని ప్రజాప్రతినిధులు గొప్పలు చెబుతున్నా.. వాస్తవ పరిస్థితులు అందుకు విరుద్ధంగా ఉన్నాయి. ఇక్కడ చికిత్స చేయాల్సిన కేసులను సైతం హైదరాబాద్‌కు రెఫర్‌ చేస్తున్నారు. గడిచిన మూడు నెలల్లో 380 కేసులు రెఫర్‌ అయ్యాయంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. అందులో జనరల్‌ సర్జరీ, జనరల్‌ మెడిసిన్‌ కేసులే ఎక్కువగా ఉన్నాయి. జనరల్‌ ఆస్పత్రి నుంచే రోజుకు 10 వరకు 108 అంబులెన్స్‌ వాహనాలు హైదరాబాద్‌కు వెళ్తున్నాయి. దీంతో జిల్లాలో ఏదైనా పెద్ద అత్యవసర పరిస్థితి ఎదురైతే ఆ సమయంలో అంబులెన్సులు దొరకని దుస్థితి నెలకొంటోంది. అంతేకాకుండా రోగులు హైదరాబాద్‌ అంటేనే భయంతో సగం చచ్చిపోతున్నారు. వీటన్నింటిపై పర్యవేక్షణ చేయాల్సిన ఆస్పత్రి వైద్యాధికారులు పట్టించుకోవడం లేదు. ఫలితంగా శిక్షణ పొందుతున్న డాక్టర్లు ప్రతీ చిన్న కేసును హైదరాబాద్‌కు రెఫర్‌ చేస్తున్నారు.

మూడు నెలల్లో..

జనరల్‌ ఆస్పత్రి నుంచి హైదరాబాద్‌కు రెఫర్‌ అయ్యే కేసుల సంఖ్య ఇటీవల బాగా పెరిగింది. ఈ ఏడాది ఏప్రిల్‌, మే, జూన్‌ నెలల్లోనే 380 కేసులు హైదరాబాద్‌లోని ఉస్మానియా, గాంఽధీ, నిమ్స్‌ ఆస్పత్రులకు రెఫర్‌ అయ్యాయి. అందులో జనరల్‌ మెడిసిన్‌, జనరల్‌ సర్జరీ కేసులే ఎక్కువగా ఉన్నాయి. ఏప్రిల్‌లో 119 కేసులు, మేలో 141, జూన్‌లో 120 కేసులు రెఫర్‌ కాగా, జూలైలో దాదాపు 300పైగా కేసులు రెఫర్‌ అయినట్లు తెలుస్తోంది.

చిన్న చిన్న జబ్బులకు సైతం..

రెఫర్‌ చేస్తున్న కేసుల్లో చాలా వరకు చిన్న చిన్నవే ఉంటున్నాయి. ఇక్కడ నయం అయ్యే వాటినీ రెఫర్‌ చేస్తున్నారు. కోయిలకొండ మండలం అభంగపట్నం గ్రామానికి చెందిన నర్సమ్మకు షుగర్‌ వ్యాధి ఉంది. కాలుకు దెబ్బ తగలడంతో అది సెల్యులైటి్‌సగా మారింది. ఆ కేసు ఇక్కడే ఉంచి డ్రెస్సింగ్‌ చేస్తూ నయం చేయాల్సి ఉండగా, సర్జరీ విభాగం డాక్టర్లు ఈనెల 28న హైదరాబాద్‌కు రెఫర్‌ చేశారు. ఉస్మానియా ఆస్పత్రికి వెళ్తే.. అక్కడి ఆర్‌ఎంవో కేసును అడ్మిట్‌ చేసుకోలేదు. అంతేకాకుండా ఆ ఆర్‌ఎంవో జనరల్‌ ఆస్పత్రి ఆర్‌ఎంవోకు ఫోన్‌ చేసి, ఎందుకు ఈ కేసు పంపించారంటూ ఆరా తీసినట్లు తెలిసింది. దాంతో మహబూబ్‌నగర్‌ ఆస్పత్రి ఆర్‌ఎంవో తనకు తెలియదని, విచారణ చేస్తానని చెప్పారని సమాచారం. తర్వాత ఆ రోగిని ప్రైవేట్‌ అంబులెన్సులో బంధువులు ఇంటికి తీసుకొచ్చారు. అదేవిధంగా శివమ్మ అనే రోగి తన ఎడమ చేయి వణుకుతుందని ఈనెల ఏడో తేదీన మధ్యాహ్నం ఆస్పత్రికి వచ్చింది. కానీ ఆమెను అదేరోజు రాత్రి 10:30 గంటలకు ఉస్మానియా ఆస్పత్రికి రెఫర్‌ చేశారు. ఆమె అక్కడికి వెళ్లిన తర్వాత చిన్న సమస్య అని చెప్పి మందులు రాసి పంపించారు. ఇలా చాలా వరకు కేసులను అనవసరంగా హైదరాబాద్‌కు పంపిస్తున్నారు.

అంబులెన్సులు దొరకని పరిస్థితి..

జనరల్‌ ఆస్పత్రి నుంచి రోజూ ఉదయం నుంచి రాత్రి వరకు దాదాపు ఐదు నుంచి ఎనిమిది అంబులెన్సులు హైదరాబాద్‌కు వెళుతున్నాయి. జిల్లాలో ఉన్న 108 అంబులెన్సు వాహనాలు 16 ఉన్నాయి. అందులో రోజూ దాదాపు ఎనిమిది వరకు అంబులెన్స్‌లు హైదరాబాద్‌కు వెళ్తుండటంతో ఇక్కడ ఏదైనా అత్యవసర పరిస్థితి ఉన్నపుడు అవి లేక ఇబ్బందులు ఎదురవుతున్నాయి. తమ డ్యూటీ అయిపోయినా హైదరాబాద్‌కు పంపుతున్నారని, డబుల్‌ డ్యూటీ అవుతుందని అంబులెన్సు పైలెట్లు వాపోతున్నారు. నడవగలిగిన వారు, అత్యవసర పరిస్థితి లేని వారిని సైతం అంబులెన్సులలో పంపిస్తుండటంతో అత్యవసర పరిస్థితి ఉన్నవారికి నష్టం జరుగుతోంది.

అధికారుల పర్యవేక్షణ లోపం..

ప్రతీ చిన్న కేసు ఆస్పత్రి నుంచి రెఫర్‌ అవుతుందంటే అధికారుల పర్యవేక్షణ లోపం వల్లే జరుగుతుందని తెలుస్తోంది. పీజీ డాక్టర్లు, శిక్షణ పొందుతున్నవారు, వైద్య విద్యను అభ్యసిస్తున్న డాక్టర్లు సైతం హైదరాబాద్‌కు రెఫర్‌ చేస్తున్నారు. వాస్తవానికి హైదరాబాద్‌కు రెఫర్‌ అయ్యే కేసులు అన్ని ఆర్‌ఎంవో పర్యవేక్షణలో ఉంటే ఇలాంటి ఇబ్బందులు ఉండవు. వారే స్వయంగా కేసును పరిశీలించి, 108 అంబులెన్సుకు ఫోన్‌ చేసే సౌకర్యం కల్పిస్తే అనవసరంగా రెఫరల్‌ కేసుల సంఖ్య తగ్గే అవకాశం ఉంది.

రెఫరల్స్‌పై ప్రణాళిక రూపొందిస్తాం

జనరల్‌ ఆస్పత్రి నుంచి అనవసరంగా హైదరాబాద్‌కు రెఫర్‌ అవుతున్న కేసులపై ప్రత్యేక ప్రణాళిక రూపొందిస్తాం. సూపర్‌ స్పెషాలిటీకి సంబంధించిన కేసు తప్ప. ఏ ఇతర కేసు కూడా హైదరాబాద్‌కు రెఫర్‌ కాకుండా చూసేందుకు కృషి చేస్తాను. ఇకపై ప్రతీ విభాగం నుంచి రోజూ ఓపీ, అడ్మిషన్‌, రెఫరల్‌ కేసులు ఎన్ని అనే అంశాలపై నివేదికలు తెప్పించుకొని వాటిపై చర్యలు తీసుకుంటాం.

- డాక్టర్‌ సంపత్‌ కుమార్‌ సింగ్‌, జనరల్‌ ఆస్పత్రి సూపరింటెండెంట్‌

Previous Post Next Post

نموذج الاتصال

💬 Chat 📢 Follow