- విద్యాబోధనకు తప్పని తిప్పలు
- పట్టించుకోని విద్యాశాఖ అధికారులు
నారాయణపేట, జూలై 8 : జిల్లా కేంద్రమైన నారాయణపేట సింగార్‌బేస్ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ఐదు తరగతులకు ఇద్దరు ఉపాధ్యాయులే విద్యాబోధన చేస్తన్నారు. అయితే తరగతి గదిలో పాఠపుస్తకాల నిల్వలు ఉండడంతో వరండాలోనే ఐదు తరగతుల విద్యార్థులకు బోధన కొనసాగుతోంది. దీంతో విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నా.. సంబంధిత విద్యాశాఖ అధికారులు పట్టించుకోక పోవడంతో విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కొన్నేళ్లుగా ప్రతీ ఏటా జిల్లాకు సంబంధించిన పాఠ్య పుస్తకాలను ఈ పాఠశాల తరగతి గదుల్లోనే భద్రపరిచి జిల్లాలోని 13 మండలాల పాఠశాలలకు సరఫరా చేస్తారు. అదే విధంగా మిగిలిన పాఠ్య పుస్తకాలను ఫస్టు ఫ్లోర్‌లో గల తరగతి గదుల్లో భద్రపరిచేవారు. ఈసారి జాల్లా వ్యాప్తంగా పాఠ్య పుస్తకాలను సకాలంలో సరఫరా చేసినా మిగిలిన కొని పాఠ్య పుస్తకాలను గ్రౌండ్ ఫ్లోర్‌లోని తరగతి గదుల్లో ఉంచడం వల్ల విద్యార్థుల విద్యా బోధనకు తరగతి గదులు అందుబాటులో లేకుండా పోయాయి. విద్యాశాఖ అధికారుల నిర్లక్ష్యం పాఠశాలలో చదివే విద్యార్థులకు శాపంగా మారుతోంది. తక్షణమే పాఠ్య పుస్తకాలను ఫస్ట్ ప్లోర్‌లోని తరగతి గదులకు తరలించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మరో పక్క విద్యార్థులకు డబుల్ డెస్క్ బెంచీలు కొత్తగా వచ్చినా వేసేందుకు తరగతి గదులు ఖాళీగా లేకపోవడంతో విద్యార్థులు వరండాలో కింద కూర్చొని చదువుకుంటున్నారు. బదిలీల్లో భాగంగా పాఠశాలలో పని చేస్తున్న ఇద్డరు ఉపాధ్యాయులు పదోన్నతిపై వెళ్లగా, ప్రస్తుతం ఇద్దరు ఉపాధ్యాయులు ఉండగా, ఐదు తరగతులకు గానూ 54 మంది విద్యార్థులు ఉన్నారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి ఉపాధ్యాయుల సంఖ్యను పెంచి విద్యార్థుల కష్టాలను తొలగించాలని విద్యార్థులు తల్లిదండ్రులు కోరుతున్నారు.