వేసవి ఎండల నుంచి ఉపశమనం కలిగిస్తూ నైరుతి రుతుపవనాలు చురుగ్గా విస్తరిస్తున్నాయి. 2, 3 రోజుల్లో మరింత విస్తరించేందుకు అనుకూల అవకాశాలు ఉన్నాయంటూ విశాఖ తుఫాన్ హెచ్చరికల కేంద్రం వెల్లడించింది. జూన్ 2 నుంచి ఏపీలో వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. ఏపీలో రెండు రోజుల పాటు పొడి వాతావరణం ఉంటుందని.. దక్షిణ కోస్తాలో వడగాలులు వీస్తాయని.. అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపారు.
ఇప్పటికే కేరళ తీరాన్ని తాకిన నైరుతీ రుతుపవనాలు చాలా చురుగ్గా ముందుకు విస్తరిస్తున్నాయి. రుతుపవనాల ప్రభావంతో భారీ మేఘాలు కమ్ముకుని భారత భూభాగంలో అక్కడక్కడ భారీ వర్షాలు అందుకుంటున్నాయి. నైరుతి రుతుపవనాల కదలికతో ఏపీలో తొలకరి జల్లులు కురిసేందుకు సిద్ధమవుతున్నాయి. మరో రెండు రోజుల్లో ఏపీలో ఋతుపవనాలు విస్తరించే ఛాన్స్ బలంగా ఉందని చెప్పారు వాతావరణశాఖ అధికారులు. అన్ని అనుకూలిస్తే .. జూన్ ఫస్ట్ వీక్‌లోనే రాయలసీమలోకి రుతుపవనాలు ప్రవేశిస్తాయని అంచనా వేస్తున్నారు.
మరోవైపు తెలంగాణ రైతులకు హైదరాబాద్ వాతావరణ శాఖ చల్లని కబురు చెప్పింది. జూన్ 10లోగా నైరుతి రుతుపవనాలు రాష్ట్రంలోకి ప్రవేశిస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది. నైరుతి రుతుపవనాలు రెండు రోజుల్లో ఆంధ్రప్రదేశ్‌కు, జూన్ 10 లోగా తెలంగాణకు రుతుపవనాలు చేరుకుంటాయని వాతావరణశాఖ అధికారి తెలిపారు. జూన్ 11 వరకు రాష్ట్రమంతటా విస్తరిస్తాయని వెల్లడించారు. జూన్ 1 నుంచి మూడురోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేరొన్నారు.