ప్రచారంలో కాంగ్రెస్‌, బీజేపీ అభ్యర్థుల పోటాపోటీ..రెండు సీట్లపై సీఎం రేవంత్‌రెడ్డి ప్రత్యేక దృష్టి

 


ప్రచారంలో కాంగ్రెస్‌, బీజేపీ అభ్యర్థుల పోటాపోటీ

 



 

పార్లమెంట్‌ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా పార్టీల కార్యాచరణ



రెండు సీట్లపై సీఎం రేవంత్‌రెడ్డి ప్రత్యేక దృష్టి


పాలమూరులో స్పీడ్‌ పెంచని బీఆర్‌ఎస్‌.. నాగర్‌కర్నూల్‌పై శ్రద్ధ


రెండు స్థానాల్లోనూ త్రిముఖ పోరు






మహబూబ్‌నగర్‌,  పార్లమెంట్‌ ఎన్నికల వేళ.. పార్టీలు ఉమ్మడి పాలమూరు జిల్లాపై ఫోకస్‌ పెంచాయి. అభ్యర్థులు ప్రచార సరళిలో దూసుకుపోతున్నారు. ఇక్కడ రెండు పార్లమెంట్‌ స్థానాలు ఉండగా.. వాటిల్లో త్రిముఖ పోరు నెలకొనే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అభ్యర్థుల ప్రకటన కంటే ముందే కాంగ్రెస్‌, బీజేపీలు ప్రచారాన్ని ప్రారంభించి, పాదయాత్రలు, నియోజకవర్గ యాత్రలు చేపట్టగా.. బీఆర్‌ఎస్‌ మాత్రం ప్రచారంలో కొంత వెనుకబాటులో ఉందని చెప్పొచ్చు. గత పార్లమెంట్‌ ఎన్నికల్లో రెండు ఎంపీ స్థానాలను కైవసం చేసుకున్న బీఆర్‌ఎస్‌.. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమితో డీలా పడింది. ఆ పార్టీకి చెందిన కొంతమంది నాయకులు కాంగ్రెస్‌, బీజేపీలో చేరుతుండటంతో అభ్యర్థుల ప్రకటన కొంత ఆలస్యంగానే జరిగింది. అయితే ఇప్పటికీ బీఆర్‌ఎస్‌కు ఉమ్మడి జిల్లాలో ఓటుబ్యాంకు బలంగానే ఉంది. మొన్నటి వరకు రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీ కావడంతో కాంగ్రెస్‌, బీజేపీలకు పోటీ ఇచ్చే అవకాశాలు మెండుగా ఉన్నాయి. జనరల్‌ స్థానమైన మహబూబ్‌నగర్‌ పార్లమెంట్‌ నుంచి కాంగ్రెస్‌ తరఫున మాజీ ఎమ్మెల్యే, సీడబ్ల్యూసీ ప్రత్యేక ఆహ్వానితుడు చల్లా వంశీచంద్‌రెడ్డి అభ్యర్థిగా నిలవగా.. బీజేపీ నుంచి మాజీ మంత్రి, ఆ పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ పోటీలో ఉన్నారు. బీఆర్‌ఎస్‌ నుంచి ప్రస్తుత ఎంపీ మన్నె శ్రీనివా్‌సరెడ్డికి పార్టీ మరోసారి అవకాశం ఇచ్చింది. ఇక నాగర్‌కర్నూల్‌ నుంచి కాంగ్రెస్‌ తరఫున టీపీసీసీ ఉపాధ్యక్షుడు మల్లు రవి, బీజేపీ నుంచి కల్వకుర్తి జడ్పీటీసీ, ప్రస్తుత ఎంపీ రాములు తనయుడు పోతుగంటి భరత్‌ ప్రసాద్‌, బీఆర్‌ఎస్‌ నుంచి మాజీ ఐపీఎస్‌ ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌ పోటీ చేస్తున్నారు. పార్టీలు అభ్యర్థుల గెలుపు బాధ్యతను జిల్లా ముఖ్య నాయకులకు అప్పగించాయి.


సీఎం రేవంత్‌ ప్రత్యేక దృష్టి..


ముందు నుంచి అనుకున్నట్లుగానే మహబూబ్‌నగర్‌, నాగర్‌కర్నూల్‌ పార్లమెంట్‌ నియోజకవర్గాలకు చల్లా వంశీచంద్‌రెడ్డి, డాక్టర్‌ మల్లు రవిని కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థులుగా ఖరారు చేసింది. నాగర్‌కర్నూల్‌ పార్లమెంట్‌ స్థానం సీఎం రేవంత్‌రెడ్డి సొంత జిల్లా పరిధిలో ఉండటం, తనను గెలిపించిన కొడంగల్‌ నియోజకవర్గం మహబూబ్‌నగర్‌ పార్లమెంట్‌ పరిధిలో ఉండటంతో రెండు నియోజకవర్గాల్లో గెలుపే లక్ష్యంగా ముఖ్యమంత్రి ప్రత్యేక దృష్టి కేంద్రీకరించారు. మహబూబ్‌నగర్‌ జిల్లా పరిధిలో రెండుసార్లు బహిరంగ సభల్లో పాల్గొని పార్టీ అభ్యర్థుల తరఫున ప్రచారం చేశారు. తాజాగా గత ఆదివారం కొడంగల్‌లో భారీ మెజారిటీ లక్ష్యంగా ముఖ్య కార్యకర్తల సమావేశాన్ని నిర్వహించారు. అలాగే బీఆర్‌ఎస్‌ నుంచి చేరికలను ప్రోత్సహిస్తూ.. పార్టీ బలం పెరిగేలా ప్రణాళికలు చేస్తున్నారు. అభ్యర్థి చల్లా వంశీచంద్‌రెడ్డి సైతం పార్లమెంట్‌ పరిధిలో గెలిచిన ఎమ్మెల్యేలతో కలిసి ప్రచారం చేస్తున్నారు. నియోజకవర్గాలు, సామాజికవర్గాల వారీగా సమావేశాలు నిర్వహిస్తున్నారు. మీ మాటే మా మేనిఫెస్టో పేరుతో కరపత్రాలు విడుదల చేశారు. ప్రజల సమస్యలు, చేయాల్సిన పనులపై సూచనలు తీసుకుంటున్నారు. ఇప్పటికే పాలమూరు న్యాయయాత్ర పేరుతో నియోజకవర్గం మొత్తం చుట్టేశారు. నాగర్‌కర్నూల్‌ పార్లమెంట్‌ పరిధిలోని ఐదు నియోజకవర్గాల్లో అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ గెలుపొందింది. ఈ ఐదు నియోజకవర్గాలతో పాటు మిగతా సెగ్మెంట్లను కూడా కలుపుకుని పార్టీ అభ్యర్థి డాక్టర్‌ మల్లు రవి సమావేశాలు నిర్వహిస్తున్నారు. అయితే పాలమూరుతో పోల్చితే ఇక్కడ కొంత ప్రచారం మందకొడిగా సాగుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇప్పటికే అన్ని నియోజకవర్గాల్లో పార్టీ సమావేశాలు పూర్తి చేయగా.. ఇక నుంచి నేరుగా ప్రచారం చేయనున్నారు. ఆపరేషన్‌ ఆకర్ష్‌ పేరుతో మహబూబ్‌నగర్‌, కోస్గి, వనపర్తి మునిసిపాలిటీలను కాంగ్రెస్‌ కైవసం చేసుకుంది. మహబూబ్‌నగర్‌ జడ్పీ చైర్‌పర్సన్‌ కాంగ్రెస్‌ తీర్థం పుచ్చుకోగా.. బీజేపీ నుంచి చిత్తరంజన్‌దా్‌స కూడా కాంగ్రె్‌సలో చేరిపోయారు.


నరేంద్రమోదీ సభతో ఉత్తేజం..


బీజేపీ నుంచి అభ్యర్థులుగా ఖరారైన డీకే అరుణ, పోతుగంటి భరత్‌ ప్రసాద్‌ ప్రచారంలో దూకుడు పెంచారు. అభ్యర్థి ప్రకటనకు ముందే డీకే అరుణ ఆధ్వర్యంలో నియోజకవర్గ వ్యాప్తంగా బీజేపీ యాత్ర నిర్వహించింది. రోజూ ఏదో ఒక కార్యక్రమంలో పాల్గొంటున్నారు. టిఫిన్‌ బాక్స్‌ బైఠక్‌, పార్టీ ప్రచార ప్రముఖ్‌లతో సమావేశాలు, కార్యకర్తలతో ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహిస్తున్నారు. గత ఎన్నికల్లో రెండో స్థానంలో నిలిచిన అరుణ.. అప్పటి నుంచే మహబూబ్‌నగర్‌ పార్లమెంట్‌లో పట్టు పెంచుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. తన పదునైన మాటలతో ప్రత్యర్థులను ఇరుకున పెట్టడంతోపాటు.. ఓటర్లను ఆకర్షించుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. సామాజిక, వ్యాపార వర్గాలతో ప్రత్యేకంగా సమావేశం అవుతున్నారు. డీకే అరుణ తాను ఉమ్మడి జిల్లాకు ఏం చేసిందో చెప్పడంతో పాటు.. కేంద్రం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను వివరిస్తున్నారు. నాగర్‌కర్నూల్‌ అభ్యర్థి పోతుగంటి భరత్‌ప్రసాద్‌.. తన తండ్రి, ప్రస్తుత ఎంపీ రాములుతో కలిసి ప్రచారాన్ని దూకుడుగా కొనసాగిస్తున్నారు. అలాగే వాకర్స్‌ మీటింగ్‌లు, కార్యకర్తల సమావేశాలు, ప్రభుత్వ విధానాలపై నిరసనలు తెలుపుతూ పార్టీ బలం పెంచేలా ప్రణాళికలు చేస్తున్నారు. ఈ పార్లమెంట్‌ పరిధిలో వనపర్తి జడ్పీ చైర్‌పర్సన్‌, మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డి సన్నిహితుడు బీఆర్‌ఎస్‌ నుంచి బీజేపీలో చేరిపోయారు. షెడ్యూల్‌ ప్రకటనకు ముందే నాగర్‌కర్నూల్‌లో నరేంద్రమోదీ నిర్వహించిన ఎన్నికల శంఖారావ సభతో అభ్యర్థులు, కేడర్‌లో ఉత్తేజం నిండిందని చెప్పొచ్చు.


బీఆర్‌ఎస్‌ వెనుకబాటు..


అసెంబ్లీ ఎన్నికల్లో జరిగిన పరాభవంతో బీఆర్‌ఎస్‌ పార్టీ కొంత డీలా పడిందని చెప్పొచ్చు. రెండు పార్లమెంట్‌ స్థానాలకు ఇప్పటికే అభ్యర్థులు ఖరారు కాగా.. పాలమూరు నుంచి ఇంకా ప్రచారంలో స్తబ్దత నెలకొనే ఉంది. నాగర్‌కర్నూల్‌లో మాత్రం అభ్యర్థి ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌ ప్రచారంలో స్పీడ్‌ పెంచారు. రోజూ నియోజకవర్గ పరిధిలో ఏదో ఒక కార్యక్రమం నిర్వహిస్తున్నారు. మహబూబ్‌నగర్‌ పార్లమెంట్‌ స్థానం పరిధిలో ఏడు నియోజకవర్గాలు ఉండగా.. అసెంబ్లీ ఎన్నికల్లో అన్నింటిలో బీఆర్‌ఎస్‌ ఓటమి చెందింది. మాజీ ఎమ్మెల్యేలు సైతం పెద్దగా పార్టీ ప్రచార కార్యక్రమాల్లో పాల్గొనడం లేదు. గత పార్లమెంట్‌ ఎన్నికల్లో రెండు స్థానాలను దక్కించుకున్న బీఆర్‌ఎ్‌సకు నాగర్‌కర్నూల్‌ ఎంపీ రాములు బీజేపీలోకి వెళ్లడంతో దెబ్బతగలగా.. జడ్పీ చైర్‌పర్సన్లు, కీలక నాయకులు కూడా పార్టీని వీడుతుండటం కొంత కలవరపెడుతోంది. అయితే పదేళ్లు అధికారంలో ఉండటంతో ఇంకా పార్టీ కేడర్‌ బలంగానే ఉంది. ఓటుబ్యాంకు కూడా మెరుగ్గానే ఉంది. రెండు స్థానాలను దక్కించుకోవాలని ఆశిస్తున్న పార్టీ అధిష్ఠానం ప్రచారంలో స్పీడ్‌ పెంచడంతోపాటు నియోజకవర్గాల్లో మాజీ ఎమ్మెల్యేలు, కీలక నాయకుల సమావేశాలు నిర్వహించడంతో పాటు ప్రచారం స్పీడ్‌ పెంచాలనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

Previous Post Next Post

نموذج الاتصال