బీఆర్‌ఎస్‌లో ఉండటమా? అధికార కాంగ్రెస్‌లోకి వెళ్లడమా?*

 *కొత్త సర్కారు పచ్చజెండా ఊపితేనే..*



 *పల్లెల్లో ఎన్నికల సంగ్రామం*


*లేదంటే కొన్నెళ్లుప్రత్యేకాధికారుల పాలనకు ఛాన్స్‌!*


*ఫిబ్రవరి ఒకటితో ముగియనున్న సర్పంచుల పదవీకాలం*


*మారనున్న పంచాయతీల రిజర్వేషన్లు.. తేలనున్న ఓటర్లలెక్క*


*బీఆర్‌ఎస్‌లో ఉండటమా? అధికార కాంగ్రెస్‌లోకి వెళ్లడమా?*


*అంతర్మథనంలో ప్రస్తుత సర్పంచ్‌లు.. ఆశావహులు*


*వచ్చే ఏడాది(2024) ఫిబ్రవరి ఒకటితో పంచాయతీల పాలకవర్గం గడువు ముగియనుంది. అయితే, రెెండు నెలల ముందే ఎన్నికలు నిర్వహించాలని పంచాయతీరాజ్‌ చట్టం చెబుతోంది. ఇటీవల అసెంబ్లీ ఎన్నికలు ముగించుకున్న రాష్ట్రంలో ఈనెల 6న పంచాయతీ ఎన్నికలకు సమాయత్తం కావాలని రాష్ట్ర ఎన్నికల సంఘం అన్ని జిల్లాల కలెక్టర్లను ఆదేశించింది. ఈ నేపథ్యంలో కొత్తగా కొలువుదీరిన కాంగ్రెస్‌ సర్కారుకు ఇంకా గ్రామ స్థాయిలో బలమైన పట్టులేదు. పైగా రాష్ట్రంలో అధికార పార్టీ మారడం, ఆయా అసెంబ్లీ స్థానాల్లో పలువురు సిట్టింగ్‌ ఎమ్మెల్యెలే గెలవడం, మరికొన్ని స్థానాల్లో కొత్తగా కాంగ్రెస్‌ శాసనసభ్యులు రావడం వంటి రాజకీయ పరిణామాల్లో పల్లెల్లోని ప్రస్తుత సర్పంచ్‌లు, ఆశావహులు అంతర్మథనంలో పడ్డారు. దీంతో గ్రామస్థాయిలో పరిస్థితులు చక్కదిద్దుకున్నాకే పంచాయతీ ఎన్నికలకు వెళ్లే అవకాశం ఉంటుందని.. దీంతో మరికొన్ని నెలలు స్పెషల్‌ ఆఫీసర్ల పాలన పెడతారనే వార్తలు వినిపిస్తున్నాయి.*


*ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ 64 చోట్ల గెలిచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినా బీఆర్‌ఎస్‌ 39 స్థానాల్లో గెలుపొందింది. కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినా.. పంచాయతీల్లో మార్పులు జరగాల్సి ఉంది. ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలో గతంలో 13 స్థానాల్లో మంథని తప్ప మిగిలిన 12స్థానాల్లో బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యెలే కొలువుదీరితే.. ఈసారి ఎన్నికల్లో 5 స్థానాలకే గులాబీ పార్టీ పరిమితమైంది. మిగిలిన 8 స్థానాల్లో కాంగ్రెస్‌ గెలుచుకుంది. పైగా రాష్ట్రంలో ఆ పార్టీయే కొలువుదీరింది. ఈ నేపథ్యంలో ఇన్నాళ్లూ బీఆర్‌ఎస్‌లోనే ఉన్న మెజార్టీ సర్పంచులు సహజంగానే అధికార పార్టీలో చేరికతో ప్రయోజనం సహా పంచాయతీ ఎన్నికల్లోనూ ఈజీగా గెలువొచ్చనే భావనలో ఉన్నారు. పైగా గ్రామస్థాయిలో ఇంకా శ్రేణులు, పల్లె పోరులో ఆశావహులు, ఇతర పార్టీల నుంచి వలసలు వంటి అంశాలపై కాంగ్రెస్‌ ప్రభుత్వానికి క్లారిటీ రాలేదు. అందుకే సందిగ్ధంలో ఉంది.*


*తేలాల్సిన రిజర్వేషన్లు.. పెరగనున్న ఓటర్లు*


*గ్రామపంచాయతీ సర్పంచ్‌, వార్డు సభ్యుల ఎన్నికకు జనాభా ప్రాతిపదికన ఎస్సీ, ఎస్టీ, బీసీ, జనరల్‌ కోటా రిజర్వేషన్లు ఖారారు చేయాల్సి ఉంటుంది. ఈ క్రమంలో వచ్చే ఏడాది ఫిబ్రవరి ఒకటితో సర్పంచ్‌ల పదవీకాలం ముగియనుండగా.. ఆర్టికల్‌ 243(3)(ఎ) ప్రకారం సర్పంచ్‌ల పదవీకాలం ఐదేండ్లు, పంచాయతీరాజ్‌ యాక్ట్‌ 14(2) ప్రకారం పదవీకాలం ముగియకముందే మూన్నెళ్ల ముందే ఎన్నికలు నిర్వహించాలని చెబుతున్నాయి. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రభుత్వానికి ముందస్తుగానే సమాచారం ఇచ్చింది. ఈ క్రమంలోనే ఆయా జిల్లా కలెక్టర్లకు ఈనెల 6న ఆదేశాలు జారీ చేసింది.*


*అయితే ఎన్నికల సమయానికి రిజర్వేషన్లు సహా ఎన్నికల తేదీలనూ ప్రకటించాల్సి ఉండగా అది సాధ్యమయ్యే పరిస్థితులు కనిపించడం లేదు. ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలో 2018 ఎన్నికల నాటికి 13 నియోజకవర్గాల పరిధిలో 2788092 మంది ఓటర్లు ఉండగా.. తాజాగా జరిగిన ఎన్నికల్లో 3112283 మందికి చేరుకున్నారు. కొత్తగా 324191 మంది ఓటర్లు వచ్చారు. ప్రతి బూత్‌ పరిధిలో 200 మంది ఓటర్లకు ఒక ప్రిసైడింగ్‌ ఆఫీసర్‌, ఇద్దరు పోలింగ్‌ అధికారులను, ఆపై 400లోపు ఉన్న బూత్‌ల్లో అదనంగా మరో ముగ్గురు పోలింగ్‌ అధికారులు, 650 ఓట్లు దాటిన బూత్‌ల్లో అదనంగా మరో బూత్‌ ఏర్పాటు వంటి ఏర్పాట్లు చేయాల్సి ఉంది. దీంతో ఎన్నికల ఏర్పాట్లు ఆలస్యమయ్యే అవకాశాలు ఉన్న నేపథ్యంలో కాంగ్రెస్‌ సర్కారు కూడా మరింత ఆలస్యానికే ప్రాధాన్యత ఇచ్చే అవకాశం లేకపోలేదు. ఫిబ్రవరి ఒకటి తరువాత ప్రత్యేక అధికారులను నియమించి కొన్నెళ్లపాటు పాలన సాగించి గ్రామస్థాయిలో పార్టీ పరిస్థితులు చక్కబడ్డాకే కాంగ్రెస్‌ సర్కారు ఎన్నికలకు పోయే అవకాశం ఉన్నట్టు చర్చ సాగుతోంది. ఇదే జరిగితే పల్లెల్లో ఏయే రిజర్వేషన్లు ఖరారు అవుతాయనే అంచనాతో ప్రస్తుత సర్పంచ్‌లు, ఆశావహులు లెక్కలు వేసుకునే పనిలో పడుతున్నారు.*

Previous Post Next Post

نموذج الاتصال

💬 Chat 📢 Follow